చర్చల్లో పాల్గొన్న రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు
కీవ్: ప్రపంచ దేశాలు ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్న రష్యా, ఉక్రెయిన్ చర్చలు సోమవారం అసంపూర్ణంగా ముగిశాయి. ఇరు దేశాల అధికారులు బెలారస్ సరిహద్దులోని గోమెల్‌లో సమావేశమయ్యారు. చర్చల్లో కీలక నిర్ణయాలేమీ జరగలేదు. మరోమారు సమావేశం కావాలని ఇరుపక్షాలు అంగీకరించాయని రష్యాకు చెందిన స్పుత్నిక్ మీడియా తెలిపింది. తమ దేశంతో పాటు క్రిమియా, డాన్‌బాస్ ప్రాంతాల నుంచి బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రష్యాను ఉక్రెయిన్ డిమాండ్ చేసిందని తెలిపింది.
చర్చలు జరుగుతుండగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చర్చలు జరిపారు. ‘‘క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని గుర్తించాలి. ఉక్రెయిన్ తటస్థ దేశంగా కొనసాగాలి. నాటో సభ్యత్వ డిమాండ్‌ను శాశ్వతంగా వదులుకోవాలి. అప్పుడే యుద్ధం ఆగుతుంది’’ అని స్పష్టం చేసినట్టు సమాచారం. చర్చలు రెండో దఫా చర్చలు పోలాండ్– బెలారస్ సరిహద్దుల్లో త్వరలో జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైకోలియో పోడోలక్ చెప్పారు.
పుతిన్‌కు ఆసక్తి లేదా?
చర్చల్లో ఉక్రెయిన్ తరఫున రక్షణ మంత్రితో పాటు ఉన్నతాధికారులు పాల్గొనగా రష్యా నుంచి మాత్రం పుతిన్ సాంస్కృతిక సలహాదారుతో పాటు ఇతర అధికారులు వచ్చారు. దీంతో పుతిన్‌కు ఈ చర్చలపై ఆసక్తి పెద్దగా లేదని నిపుణులు భావిస్తున్నారు. చర్చించుకుందామంటూ తొలుత రష్యా చేసిన ప్రతిపాదించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించడం తెలిసిందే. చర్చలకు బయలుదేరడం మొదలు, అవి జరిగి, ఇరుపక్షాలూ వెనుదిరిగే దాకా బెలారస్‌లో విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణలు ఏవీ ఎగరకుండా చూస్తామని అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో హామీ ఇవ్వడంతో గోమెల్‌లో చర్చలకు జెలెన్‌స్కీ అంగీకరించారు. తక్షణ పరిష్కారం లభించకున్నా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని దేశాలన్నీ ఆశిస్తున్నాయి.
తగ్గిన రష్యా దూకుడు
ఉక్రెయిన్ రాజధాని, ఇతర నగరాల్లోకి చొచ్చుకొస్తున్న రష్యా సేనల దూకుడు ఆదివారం కాస్త తగ్గింది. సంఖ్యలో తక్కువగా ఉన్నా, ఉక్రెయిన్ బలగాలు పలు చోట్ల సాధ్యమైనంతమేర రష్యా చొరబాటును అడ్డుకుంటున్నారు. ఉక్రెయిన్ ప్రతిఘటన, అంతర్జాతీయ కఠిన ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘అణు’ ఘంటికలు మోగించారు. దేశమంతా యుద్ధవాతావరణం నెలకొనడంతో వేలాది ఉక్రెయిన్ కుటుంబాలు పారిపోతున్నాయి. చాలామంది బంకర్లు, బేస్‌మెంట్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటివరకు యుద్ధంలో ఎంతమంది చనిపోయింది అధికారికంగా తెలియరాలేదు.
102 మంది పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని ఐరాస తెలిపింది. 352 మంది పౌరులు చనిపోయారని, వీరిలో 16మంది పిల్లలున్నారని జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను పాశ్చాత్య దేశాలు కొనసాగించాయి. కర్ఫ్యూ సడలించడంతో సోమవారం కీవ్‌లో సూపర్‌మార్కెట్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. సోమవారం నుంచి రష్యాకు తోడుగా బెలారస్ సైతం యుద్ధంలోకి బలగాలను పంపనుందని అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రష్యా అనుకున్నదాని కన్నా ఆక్రమణ కష్టంగా, నెమ్మదిగా సాగుతోందని తెలిపాయి.
ఉక్రెయిన్‌కు వెల్లువలా సాయం
ఉక్రెయిన్‌కు సాయంగా స్టింగర్ మిస్సైళ్లను పంపుతామని జర్మనీ, అమెరికా ప్రకటించాయి. ఈయూ సైతం తొలిసారి ఒక దేశానికి ఆయుధాలు, మందుగుండు సరఫరా చేయనుంది. సోమవారం చర్చల కోసం ఈయూ రక్షణ మంత్రులు సమావేశం అవుతున్నారు. ఉక్రెయిన్‌కు అందే సాయాన్ని అడ్డుకోవడానికి రష్యా మార్గాలు వెతుకుతోంది. నాటో వర్గాలు రెచ్చగొడుతున్నాయంటూ ఆదివారం పుతిన్ చేసిన అణు హెచ్చరికలపై పాశ్చాత్య దేశాలు మండిపడ్డాయి. అవి కేవలం బెదిరింపులేనని భావిస్తున్నాయి.
రష్యా ఏం చేస్తుందో..
కీవ్‌లోని పౌరులు సురక్షిత మార్గంలో నగరం వీడేందుకు అవకాశమిస్తామని రష్యా మిలటరీ ప్రకటించింది. దీంతో ఒక్కసారి నగరం వశమయ్యాక మిగిలిన పౌరులపై రష్యా విరుచుకుపడవచ్చన్న భయాలు పెరిగాయి. ప్రస్తుతం నగర రక్షణకు ముందుకు వస్తున్న ప్రతిఒక్కరికీ ఉక్రెయిన్ అధికారులు ఆయుధాలిస్తున్నారు. ఖార్కివ్‌తో పాటు చాలా నగరాల్లో రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్నాయి. దేశంలోని వైమానిక స్థావరాలన్నీ తమ అధీనంలోకి వచ్చాయని సోమవారం రష్యా సైనికులు ప్రకటించారు. దీనిలో నిజానిజాలపై యూఎస్ అనుమానం వ్యక్తం చేసింది.
ఎవరేమన్నారు!
చర్చలు ఐదు గంటలపాటు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలు కలిగించే కొన్ని విషయాలను ఇరు పక్షాలు గుర్తించాయి. మరో దఫా సమావేశమయ్యేందుకు అంగీకారం కుదిరింది.
– రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్ స్కీ
కాల్పుల విరమణ అవకాశాలపై దృష్టి సారించాం. సమీప భవిష్యత్‌లో రెండో దఫా చర్చలు జరుగుతాయి. వీటిని పోలాండ్– బెలారస్ సరిహద్దుల్లో జరిపేందుకు అంగీకరించడం జరిగింది.
– ఉక్రెయిన్ ప్రతినిధి మైఖైలో పొడోలైక్
Comments
Please login to add a commentAdd a comment