కీవ్: సంక్షోభ నివారణకు రష్యా బృందంతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కీవ్ సమీపంలోకి రష్యా సేనలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు పక్షాలు బెలారస్ సరిహద్దులో ఏదో ఒక ప్రాంతంలో చర్చలు జరుపుతాయని జెలెన్‌స్కీ కార్యాలయం తెలిపింది. ఏ సమయంలో చర్చలు జరిగేది వెల్లడించలేదు. అంతకుముందు చర్చలకు బెలారస్‌లోని గోమెల్ నగరానికి తమ బృందం వెళ్లిందని రష్యా ఆదివారం తెలిపింది.
నాటోలో చేరకపోవడం సహా కీలక డిమాండ్లపై చర్చలకు సిద్ధమని జెలెన్‌స్కీ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో రష్యా ఈ బృందాన్ని పంపింది. అయితే బెలారస్‌లో చర్చలకు తాము సిద్ధం కాదని జెలెన్‌స్కీ చెప్పారు. తమపై మిస్సైల్ దాడులు చేస్తున్న భూభాగంపై చర్చలు అంగీకరించమని, వార్సా, బ్రటిస్లవా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బకు తదితర నగరాల్లో ఎక్కడైనా చర్చలకు రెడీ అని తెలిపారు. చర్చలు నిజాయతీగా, యుద్ధాన్ని ముగించేలా ఉండాలన్నారు. అయితే గోమెల్ నగరం పేరును ఉక్రెయిన్ వర్గాలే ప్రతిపాదించాయని రష్యా చెప్పగా, అబద్ధమని జెలెన్‌స్కీ కొట్టిపారేశారు. చర్చలు ఆరంభమయ్యేవరకు మిలటరీ చర్య కొనసాగుతూనే ఉంటుందని రష్యా పేర్కొంది.
అణుభయాలే కారణమా
నాటో నేతల వ్యాఖ్యల నేపథ్యంలో దేనికైనా సిద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు విభాగానికి ఆదేశాలిచ్చారు. దీంతో పరిస్థితి మరింత విషమిస్తుందన్న భయంతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించినట్లు నిపుణులు భావిస్తున్నారు. చర్చలు ముగిసి, ఉక్రెయిన్ బృందం క్షేమంగా వెనుతిరిగేంతవరకు బెలారస్ గగనతలంలో విమానాలు, హెలికాప్టర్లు, మిస్సైళ్లు ప్రయాణించవని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ హామీ ఇచ్చారని ఉక్రెయిన్ తెలిపింది. అందుకే చర్చలకు అంగీకరించామని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment