ఘాట్‌కో గండం
నాసిరకంగా ఘాట్ల ఏర్పాటు
కొన్ని చోట్ల జారుడు బండల్లా నిర్మాణం
ఆయా ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు
పుష్కర పనుల్లో అంతా హడావుడి.. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఏర్పాట్లన్నీ నత్తనడకన సాగుతున్నాయి.. ముహూర్తం ముంచుకొచ్చేకొద్దీ అధికారులు ఇష్టారాజ్యంగా పనులు ముగిస్తున్నారు..ఈ క్రమంలో భక్తుల భద్రతను మాత్రం గాలికొదిలేస్తున్నారు. లక్షల మంది భక్త జనం వచ్చే ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందిపోయి..తూతూమంత్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఘాట్లన్నీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
కొల్లిపర: పుష్కరఘాట్ల వద్ద ప్రమాదకర దశ్యాలు కనిపిస్తున్నాయి. పిడపర్రు లాకుల వద్ద పుష్కరఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణంలో మట్టి, ఇసుక వాడారు. అప్రోచ్ రోడ్డు పక్కనే ఉన్న రేపల్లె బ్యాంకు కెనాల్ స్లూయిస్ బాగా పల్లంగా ఉండటంతో ఇది భయపెడుతోంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణం వెంట బారికేడ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
మున్నంగి వద్ద అప్రోచ్ రోడ్డు..
మున్నంగి పుష్కర ఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వారు. ఎక్కువ లోతుగా తవ్వకాలు జరపటంతో రోడ్డు వెంట పల్లంగా మారింది. ఒక వేళ పట్టుజారిందా గోతిలో పడాల్సిందే. ఇక్కడ అప్రోచ్‌రోడ్డు వెంట సైడ్ వాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
వల్లభాపురం ఘాట్‌కు బారికేడ్లు తప్పనిసరి?
భక్తులు స్నానాలు చేసే చోట తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వల్లభాపురం తిరుపతమ్మ గుడి వద్ద భక్తుల స్నానాల కోసం అక్కడ ఉన్న ర్యాంప్ వద్ద రెండు పుష్కర ఘాట్‌లను నిర్మిస్తున్నారు. ఒక ఘాట్ ర్యాంపునకు ఎదురుగా, మరో ఘాట్ ర్యాంపునకు ఎడమవైపు ఉంది. ఆ రెండింటి మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. రెండు ఘాట్‌ల వద్ద రెండున్నర అడుగుల మేర మాత్రమే సైడ్ వాల్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో భక్తులు స్నానమాచరిస్తారు. కావున బారికేడ్లు తప్పనిసరి.
వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద గుండం..
వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న ఘాట్‌కు సమీపంలో గుండం ఉంది. అక్కడ అధికారులు నిర్దేశించిన ఘాట్ ప్రాంతంలోనే స్నానం చేయడం మంచిది. గుండం వద్దకు భక్తులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇక్కడ కచ్చితంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
జారుడు బల్లగా పుష్కర ఘాట్..
వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న పుష్కరఘాట్ జారుడు బల్లగా కనిపిస్తుంది. పుష్కరాల సమయంలో వర్షం వస్తే భక్తులకు ఇబ్బందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భద్రతా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.