నాణ్యత డొల్ల.. | Quality very poor | Sakshi
Sakshi News home page

నాణ్యత డొల్ల..

Published Wed, Jul 20 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

నాణ్యత డొల్ల..

నాణ్యత డొల్ల..

పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల్లో అవినీతి
వైఎస్సార్‌ సీపీ పరిశీలనలో బట్టబయలు 
 రూ.వందల కోట్లు కృష్ణార్పణం 
నాణ్యతకు తిలోదకాలు
 
 
కృష్ణాపుష్కర పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదు.. ఇసుక, మట్టితో ఘాట్లు నిర్మిస్తున్నారు.. నామ మాత్రంగా కాంక్రీటు వేస్తున్నారు.. మొత్తంగా కాంట్రాక్టర్ల రూపంలో టీడీపీ నేతలు రూ.కోట్లు ఆరగిస్తున్నాన్న విషయం వైఎస్సార్‌ సీపీ నాయకుల పరిశీనలో బట్టబయలైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు బుధవారం అమరావతి, ధరణికోట, సీతానగరం పుష్కర ఘాట్లను పరిశీలించారు. పనుల్లో డొల్లతనం, నాణ్యతలేమిని గుర్తించారు.
 
సాక్షి, అమరాతి: గడువులోగా ఎలాగోలా పూర్తిచేయాలని.. ఘాట్‌ పనుల్లో ఇసుక పోసి.. పైన నామమాత్రంగా పూతగా కాంక్రీటు వేసి దోపిడీ చేస్తుండడం చూసి వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిర్మాణ పనుల్లో పాటించాల్సిన క్యూరింగ్‌ జాడ కనిపించడం లేదు. కన్సాలిడేషన్‌ చేయటం లేదు. దీంతో టైల్స్‌ వేసినా పుష్కరాల ప్రారంభం నాటికే పగిలిపోయే పరిస్థితిని గమనించారు. ఘాట్ల వద్ద పనుల నాణ్యతను పట్టించుకోకపోవడం దారుణమని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వారు అధికారులను ఆరా తీయగా జూలై 30 నాటికి పూర్తి చేయాల్సిందేనని సీఎం హుకుం జారీ చేశారని, దీంతో ఎలాగోలా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు  హడావుడి పనులు చేస్తున్నారని చెప్పడం విశేషం. 
 
డొల్లతనం బట్టబయలు..
అమరావతి ధ్యాన బుద్ధ సమీపంలోని ధరణికోట ఘాట్‌ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పనుల నాణ్యతపై అధికారులను పలు విషయాలపై ప్రశ్నించారు. కాంక్రీట్‌ ఎంత మందంతో వేస్తున్నారని అడిగారు. 0.4 మీటర్ల మందంతో వేయాల్సి ఉందని అధికారులు చెప్పగా.. కాంక్రీట్‌ వేస్తున్న ప్రాంతాన్ని చూపి ఇక్కడ 0.4 మీటర్ల మందంతో కాంక్రీట్‌ వేస్తున్నారా.. అని అధికారులను అడగ్గా వారు నీళ్లు నమిలారు. కనీసం 0.2 మీటర్లు కూడా లేకుంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుకను గుట్టలుగా పోస్తున్నారని, కనీసం కన్సాలిడేషన్‌ కూడా చేయకుంటే ఎలాగని నిలదీశారు. నల్లరేగడి నేల పగిలిపోదా అని పేర్కొన్నారు. రూ.10 కోట్ల విలువైన పనులు చేస్తున్నా ఒక్క వైబ్రేటర్‌ కూడా వాడలేదంటే పనుల నాణ్యతలో డొల్లతనం తేట తెల్లమవుతోందన్నారు. అక్కడ ఉన్న కంకరును చూసి ఇది 40 ఎంఎం కంకరా.. అని ప్రశ్నించారు. పుష్కర పనుల్లో వాడుతున్న స్టీల్‌కు సంబంధించి టెస్టింగ్‌ సర్టిఫికెట్లు చూపాలని అధికారులను కోరగా.. సబ్‌మిట్‌ చేశామంటూ వారు సమాధానాన్ని దాటవేశారు.
 
30వ తేదీ నాటికి ఎలా పూర్తిచేస్తారు..?
 పనులు ఎప్పటి నుంచి ప్రారంభించారని మర్రి రాజశేఖర్‌ ప్రశ్నించారు. ప్రస్తుతం 40 శాతం పనులు కూడా.. పూర్తి కాలేదు.. మిగతా పనులు ఈ నెల 30వ తేదీలోపు ఎలా పూర్తి చేస్తారని అడిగారు. అక్కడ జరుగుతున్న పనులపై పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ సమన్వయకర్తలు కావటి మనోహర్‌ నాయుడు, క్రిస్టినా, రావి వెంకటరమణ, అన్నాబత్తుల శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, రావి వెంకటరమణలు ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లి అమరావతి ఘాట్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి, వైకుంఠపురంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
 
సీతానగరం ఘాట్‌లో...
సీతా నగరంలో జరుగుతున్న ఘాట్‌ పనులు చూసి, ఇలా పనులు చేస్తే పుష్కరాలు వచ్చే వరకు కూడా ఘాట్లు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో చేసిన కాంక్రీట్‌ పనులు చూపి.. వాటికీ ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎంత తేడా ఉందో చూడాలని మీడియా సభ్యులను కోరారు. కొద్ది పాటి వర్షానికే కోట్టుకు పోయిన ఇసుకను చూపారు. పుష్కర పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి, ధరణికోట, సీతానగరం ఘాట్లు మోడల్‌ ఘాట్లని.. వీటి పరిస్థితే ఇలా ఉంటే మిగతా ఘాట్ల పనులు ఎలా చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చుని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement