డ్రిం ‘కిల్‌’ వాటర్‌ | story on drinking water | Sakshi
Sakshi News home page

డ్రిం ‘కిల్‌’ వాటర్‌

Published Sat, Jan 28 2017 10:31 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

డ్రిం ‘కిల్‌’ వాటర్‌ - Sakshi

డ్రిం ‘కిల్‌’ వాటర్‌

- ‘ప్యూరిఫైడ్‌ వాటర్‌’ పేరిట విక్రయాలు
- ఈ నీటిని తాగుతూ రోగాల బారిన జనం
-ఎక్కువ మందిలో మూత్రపిండాల సమస్యలు
- కీళ్లవాతం, ఇతర సమస్యలూ పెరుగుతున్న వైనం
- టీడీఎస్‌ స్థాయిని గణనీయంగా తగ్గిస్తున్న ప్లాంట్ల నిర్వాహకులు
- ముప్పని తెలిసినా పట్టించుకోని ప్రజారోగ్య విభాగం అధికారులు


మీరు బయట ‘ప్యూరిఫైడ్‌ వాటర్‌’ పేరుతో విక్రయిస్తున్న నీటిని తాగుతున్నారా? ఆ నీరు సురక్షితమని భావిస్తున్నారా? అయితే..మీ భావన కరెక్ట్‌ కాదు. మీరు అనారోగ్యానికి దగ్గర పడుతున్నారన్నమాట! ఇదేంటి?! ఆరోగ్యం కోసం శుద్ధి చేసిన నీళ్లు తాగుతుంటే..అవి అనారోగ్య హేతువు అని చెబుతున్నారే అనుకుంటున్నారా? అవునండీ.. ఇది నిజం! ‘ప్యూరిఫైడ్‌ వాటర్‌’ పేరుతో బయట విక్రయిస్తున్న నీటిని తాగేకంటే బోరు నీళ్లు లేదా నదీ జలాలే సురక్షితమని వైద్యులు చెబుతున్నారు. వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనల మేరకు నీటిని శుద్ధిచేయడం లేదని, దీనివల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు.

 (సాక్షి ప్రతినిధి, అనంతపురం)
    ప్రకాశం జిల్లాలో కిడ్నీబాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు కారణమేంటని వైద్య, ఆరోగ్యశాఖ, ప్రజారోగ్య శాఖ అధికారులు శోధిస్తున్నారు. కేంద్రబృందం మాత్రం ఫ్లోరైడ్‌ జలాల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ప్రాథమికంగా తేల్చింది. ఈ ఘటన తర్వాత పలు స్వచ్ఛంద, పరిశోధన సంస్థలు ఇతర జిల్లాల్లోనూ కిడ్నీ బాధితుల సంఖ్యపై దృష్టి పెట్టాయి. గత నాలుగేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఇతర జిల్లాల్లో కూడా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మన జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం  ఎన్‌టీఆర్‌ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) ద్వారా జిల్లాలో 318మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. మరో 200మంది దాకా బెంగళూరుతో పాటు కర్నూలు, కడప, బళ్లారిలో చికిత్స చేయించుకుంటున్నారు. వీరిలో 70 శాతం మంది 45 ఏళ్లలోçపు వారేనని సమాచారం. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీలు దెబ్బతింటుంటాయి. దీంతో డయాలసిస్‌ అనివార్యమవుతుంది. కానీ ఇప్పుడు డయాలసిస్‌ చేసే రోగుల్లో మధుమేహం లేనివారు కూడా ఉన్నారు. ఇందుకు ‘ప్యూరిఫైడ్‌’ పేరుతో మనం తాగుతున్న నీరే కారణమని  వైద్యులు చెబుతున్నారు.

టీడీఎస్‌ తగ్గింపుతో ప్రమాదం
జిల్లాలో అనేక వాటర్‌ప్లాంట్లకు గుర్తింపు లేదు. వీటిలో నీటిని ఇష్టానుసారంగా శుద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీఎస్‌ స్థాయిని గణనీయంగా తగ్గిస్తున్నారు. అంటే నీటిలోని కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌లను పూర్తిగా తీసేస్తున్నారు. ఈ నీటిని తాగుతూ శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందక ప్రజలు రోగాల బారినపడుతున్నారు. మొదట కిడ్నీలు, ఆపై ఎముకలు, ఆ తర్వాత ఇతర అవయవాలపై ఽప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదకరంగా మరి పదిమందిలో కనీసం నలుగురు కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. కలుషిత నీటితో పాటు పెయిన్‌ కిల్లర్స్, రసాయనాలు అధికంగా వినియోగించే కూరగాయలు, ఆహారపదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ వాధిగ్రస్తులు పెరుగుతున్నారని విశ్లేషిస్తున్నారు.

అందని రక్షిత నీరు
 మునిసిపాలిటీల్లో శుద్ధజలం అందడం లేదు. చాలా పంచాయతీల్లోనూ ఇదే సమస్య. తాగేందుకు వీలులేని కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీంతో దాదాపు 90 శాతం మంది ‘ప్యూరిఫైడ్‌ వాటర్‌’ను కొంటున్నారు. వీరిలో 85శాతం మంది గుర్తింపు లేని ప్లాంట్ల నుంచి సరఫరా అయ్యే నీటిని తీసుకుంటున్నారు. ఈ నీటితో పాటు బాటిల్, ప్యాకెట్‌ నీటిని తాగినా రోగాలు తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో కరిగిన ఘన పదార్థాల శాతాన్ని ( టీడీఎస్‌– టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) అతి స్వల్ప మోతాదుకు తగ్గించడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వందల సంఖ్యలో  వాటర్‌ ప్లాంట్లు వెలిశాయి. ఇందులో పది మినహా తక్కిన ప్లాంట్లన్నీ భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్‌) గుర్తింపు లేనివే. బీఐఎస్‌ నిర్దేశించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నా ప్రజారోగ్య అధికారులు గానీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ సంస్థ గానీ పట్టించుకోవడం లేదు.

స్వచ్ఛమైన నీరు అంటే..
        హైడ్రోజన్, ఆక్సిజన్‌ మాత్రమే కలిగి ఉన్న నీటిని స్వచ్ఛమైనవిగా భావిస్తారు. దీన్ని శుద్ధజలం (డిస్టిల్డ్‌ వాటర్‌)గా పిలుస్తారు. ఈ నీటిని కర్మాగారాలకు వాడతారు. తాగేనీటిలో శరీరానికి అవసరమైన ఘన పదార్థాలు సరైన మోతాదులో ఉండటం తప్పనిసరి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ వంటి ఉపయోగకర ఘనపదార్థాలను మనం నీటి ద్వారానే గ్రహిస్తుంటాం. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో భూగర్భజలాలు కలుషితమయ్యాయి. సీసం, పాదరసం , ఫ్లోరిన్‌ లాంటి హానికర మూలకాలు కూడా  నీటిలో కరిగి ఉన్నాయి. వీటిని తొలగించి శరీరానికి అవసరమైన మూలకాలను సరైన మోతాదులో ఉండేలా భూగర్భజలాలను శుద్ధి చేయాలి. కానీ చాలామంది ఈ ప్రక్రియను సరిగా నిర్వహించడం లేదు. హానికారకాలను తొలగించే ప్రక్రియలో భాగంగా చాలా ఫిల్టర్లు టీడీఎస్‌లను నామమాత్రపు స్థాయికి తగ్గిస్తున్నాయి. దీంతో తాగునీటి ద్వారా శరీరం గ్రహించాల్సిన మూలకాల మోతాదు గణనీయంగా తగ్గుతోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా, దీర్ఘకాలంలో శరీరంలో ఘనపదార్థాల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. తాగునీటిలో టీడీఎస్‌ మోతాదు 80–150 మధ్య ఉండటం మంచిదని ప్రపంచ ఆరోగ్యసంస్థ సహా పలు సంస్థలు చెబుతున్నాయి. బోరుబావులు, మునిసిపాలిటీ ద్వారా అందే నీరే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు.

టీడీఎస్‌ అంటే..
నీటిలో పూర్తిగా కరిగిన ఘన పదార్థాల శాతాన్ని టీడీఎస్‌గా వ్యవహరిస్తారు. లీటరు నీటిలో ఎన్ని మిల్లీగ్రాముల ఘన పదార్థాలు కరిగి ఉన్నాయో దీని ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలోని బోరు లేదా కుళాయి నుంచి సేకరించిన నీటిలో 500 టీడీఎస్‌ ఉందంటే ఈ నీటిలో లీటరుకు  500 మిల్లీగ్రాముల ఘనపదార్థాలు ఉన్నాయని అర్థం.

అక్రమాలు ఇలా..
   ప్రస్తుతం పోటీని తట్టుకునేందుకు భూగర్భజలాలను ఎక్కువ మోతాదులో ఫిల్టర్‌ చేస్తున్నారు. దీంతో మినరల్స్‌ పూర్తిగా బయటకు వెళ్లిపోతున్నాయి. కొన్ని ప్లాంట్లలో రుచి కోసం కొన్ని రసాయనాలను కూడా నీటిలో కలుపుతున్నారు. బీఐఎస్‌ ప్రమాణాల ప్రకారం ప్రతి ప్లాంటులో అధునాతన ప్రయోగశాల ఉండాలి. శుద్ధి చేసిన నీటిలో టీడీఎస్‌తో పాటు ఇతర వివరాలను రోజూ పరీక్షించి నమోదు చేసేందుకు ఓ బయోకెమిస్ట్‌ ఉండాలి. ఇవి ఉంటేనే  ప్లాంటు ఏర్పాటుకు పబ్లిక్‌హెల్త్‌ అధికారులు అనుమతివ్వాలి. అయితే.. ఇవేవీ  ప్లాంట్లలో కనిపించడం లేదు.
 
తెలుసుకోండిలా..
        నీటిలో టీడీఎస్‌ స్థాయిని తెలుసుకునేందుకు ప్రత్యేక పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి ధర రూ.500–1000 వరకూ ఉంటుంది. సాధారణంగా మార్కెట్‌లో లభించే ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌నే చాలామంది మినరల్‌ వాటర్‌గా భావిస్తున్నారు. వాస్తవానికి మినరల్‌ వాటర్‌ వేరు. కొన్ని ముఖ్యమైన బ్రాండెడ్‌ కంపెనీలు మాత్రమే మినరల్‌వాటర్‌ తయారు చేస్తున్నాయి.  

ఆ నీరు మరింత ప్రమాదం
నీళ్ల ఆటోలు రోజూ పట్టణప్రాంతాలతో పాటు పల్లెలోనూ చక్కర్లు కొడుతున్నాయి. క్యాన్‌ నీటిని రూ.10కి విక్రయిస్తున్నారు. ఈ నీరు కూడా గుర్తింపులేని ప్లాంట్లలో తయారైందే! పైగా ఈ ట్యాంకుల శుభ్రతపై కూడా దృష్టి సారించరు. సర్ఫ్‌ పౌడర్‌ను వేసి రెన్నెళ్లకోసారి శుభ్రం చేస్తారు. ఇందులోని నీటిని తాగడం మరింత ప్రమాదకరం.

జిల్లా వ్యాప్తంగా  వాటర్‌ప్లాంట్లు : 489
అనంతపురం నగర పరిధిలో : 137
ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్నవి : 5
గుర్తింపు లేని ప్లాంట్ల నీరు తాగితే వచ్చేవ్యాధులు: ఎముకలు, కీళ్లు, నరాలు, మూత్రపిండ, జీర్ణకోశ సమస్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement