ఎప్పుడూ ఇంతే
అనంతపురం టౌన్ : హైలెవెల్ కెనాల్ (హెచ్చెల్సీ)పై తుంగభద్ర బోర్డు చిన్నచూపు చూస్తోంది. తుంగభద్ర జలాశయంలో పూడిక చేరుతోందన్న సాకు చూపి నీటి కేటాయింపుల్లో భారీగా కోత విధిస్తోంది. ఫలితంగా అనంతపురం జిల్లాలో సాగు, తాగునీటికి ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయి. తుంగభద్ర జలాశయం పరిధిలో ప్రధాన కాలువైన హెచ్చెల్సీకి 32 టీఎంసీల నికర జలాలను కేటాయించాల్సి ఉంది.
ఈ ఏడాది డ్యాంలో 144 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని భావించి.. హెచ్చెల్సీకి 20 టీఎంసీలు కేటాయించారు. ఇప్పుడేమో పూడికను సాకుగా చూపి అందులోనూ కోత విధిస్తున్నారు. 132.473 టీఎంసీల సామర్థ్యం ఉన్నజలాశయంలో ఏయేటికాయేడు పూడిక చేరడంతో నీటి నిల్వ తగ్గిపోతోందని అధికారులు అంటున్నారు. 2008లో నిర్వహించిన సర్వే ప్రకారం నీటి నిల్వ 100.855 టీఎంసీలకు తగ్గిపోయినట్లు చెబుతున్నారు. సోమవారం నాటి లెక్కల ప్రకారం.. జలాశయం నీటి మట్టం 67 టీఎంసీలు. 95 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 1,633 అడుగుల కెపాసిటీ ఉన్న జలాశయంలోకి 1,623 అడుగుల మేర నీరు చేరింది. మరో పది అడుగులు చేరితే డ్యాంకు ఉన్న 33 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలే అవకాశముంది. రిజర్వాయర్‌లో ఇలాంటి పరిస్థితి ఉన్నా జిల్లాకు మాత్రం జలాలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి.
కర్ణాటకలో మరో పది రోజుల పాటు వర్షాలు కొనసాగితే వరద నీరు దిగువకు వెళ్లిపోతుంది కానీ.. కరువు జిల్లా అయిన ‘అనంత’కు వాడుకోవడానికి వీల్లేకుండా పోతోంది. ఇందుకు తుంగభద్ర బోర్డు నిర్ణయాలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హెచ్చెల్సీకి సకాలంలో నీటి కేటాయింపులు చేయకపోవడం, కోటాలో కోత విధించడం, అరకొరగా కేటాయిస్తున్న నీటిని కూడా హెచ్చెల్సీ వెంబడి కర్ణాటక రైతులు చౌర్యం చేస్తుండడం తదితర కారణాలతో జిల్లా రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
హెచ్చెల్సీ కింద అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సుమారు 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి కేటాయింపుల్లో కోత వల్ల లక్ష ఎకరాలకు కూడా సాగు నీరు అందించలేకపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 60 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీరివ్వాలని నిర్ణయించారు. అలాగే జిల్లాలో పలు తాగునీటి పథకాలకు హెచ్చెల్సీ నీరే ఆధారం. ఇంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ హెచ్చెల్సీకి కోటా మేరకు నీరు తీసుకు రావడంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమవుతున్నారు.