thugubadhra
-
శ్రీశైలం జలాశయంలో 871 అడుగులకు చేరిన నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం డ్యామ్‌లో నీటిమట్టం బుధవారం నాటికి 871 అడుగులకు చేరింది. జలాశయానికి కృష్ణ (జూరాల), తుంగభద్ర ( రోజా గేజింగ్ పాయింట్) నదుల నుంచి 2,92,167 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పటికే జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 146.2606 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 871.10 అడుగులుగా నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం వరకు 21.91 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం జలాశయం నుంచి 44,048 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. బుధవారం సాయంత్రం విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు రెండు జలవిద్యుత్ కేంద్రాలలో 13 జనరేటర్లతో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నీటి మట్టం ఈ ఏడాది నీటిమట్టం : 1629.96 అడుగులు ఇన్‌ఫ్లో : +109719 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో : 136909 క్యూసెక్కులు నీటి నిల్వ : 89.575 టీఎంసీలు గత ఏడాది నీటిమట్టం : 1631.59 అడుగులు ఇన్‌ఫ్లో : +154367 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో : 165509 క్యూసెక్కులు నీటి నిల్వ : 95.494 టీఎంసీలు -
ఎప్పుడూ ఇంతే
అనంతపురం టౌన్ : హైలెవెల్ కెనాల్ (హెచ్చెల్సీ)పై తుంగభద్ర బోర్డు చిన్నచూపు చూస్తోంది. తుంగభద్ర జలాశయంలో పూడిక చేరుతోందన్న సాకు చూపి నీటి కేటాయింపుల్లో భారీగా కోత విధిస్తోంది. ఫలితంగా అనంతపురం జిల్లాలో సాగు, తాగునీటికి ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయి. తుంగభద్ర జలాశయం పరిధిలో ప్రధాన కాలువైన హెచ్చెల్సీకి 32 టీఎంసీల నికర జలాలను కేటాయించాల్సి ఉంది. ఈ ఏడాది డ్యాంలో 144 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని భావించి.. హెచ్చెల్సీకి 20 టీఎంసీలు కేటాయించారు. ఇప్పుడేమో పూడికను సాకుగా చూపి అందులోనూ కోత విధిస్తున్నారు. 132.473 టీఎంసీల సామర్థ్యం ఉన్నజలాశయంలో ఏయేటికాయేడు పూడిక చేరడంతో నీటి నిల్వ తగ్గిపోతోందని అధికారులు అంటున్నారు. 2008లో నిర్వహించిన సర్వే ప్రకారం నీటి నిల్వ 100.855 టీఎంసీలకు తగ్గిపోయినట్లు చెబుతున్నారు. సోమవారం నాటి లెక్కల ప్రకారం.. జలాశయం నీటి మట్టం 67 టీఎంసీలు. 95 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 1,633 అడుగుల కెపాసిటీ ఉన్న జలాశయంలోకి 1,623 అడుగుల మేర నీరు చేరింది. మరో పది అడుగులు చేరితే డ్యాంకు ఉన్న 33 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలే అవకాశముంది. రిజర్వాయర్‌లో ఇలాంటి పరిస్థితి ఉన్నా జిల్లాకు మాత్రం జలాలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. కర్ణాటకలో మరో పది రోజుల పాటు వర్షాలు కొనసాగితే వరద నీరు దిగువకు వెళ్లిపోతుంది కానీ.. కరువు జిల్లా అయిన ‘అనంత’కు వాడుకోవడానికి వీల్లేకుండా పోతోంది. ఇందుకు తుంగభద్ర బోర్డు నిర్ణయాలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్చెల్సీకి సకాలంలో నీటి కేటాయింపులు చేయకపోవడం, కోటాలో కోత విధించడం, అరకొరగా కేటాయిస్తున్న నీటిని కూడా హెచ్చెల్సీ వెంబడి కర్ణాటక రైతులు చౌర్యం చేస్తుండడం తదితర కారణాలతో జిల్లా రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. హెచ్చెల్సీ కింద అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సుమారు 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి కేటాయింపుల్లో కోత వల్ల లక్ష ఎకరాలకు కూడా సాగు నీరు అందించలేకపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 60 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీరివ్వాలని నిర్ణయించారు. అలాగే జిల్లాలో పలు తాగునీటి పథకాలకు హెచ్చెల్సీ నీరే ఆధారం. ఇంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ హెచ్చెల్సీకి కోటా మేరకు నీరు తీసుకు రావడంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమవుతున్నారు. -
జిల్లా వాటాకు కర్ణాటక గండి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు/ఆలూరు రూరల్/ హాలహర్వి: జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల ప్రధాన సాగు, తాగునీటి వనరు అయిన తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు కర్ణాటకలోని మోకా సమీపంలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పడిన చిన్న గండి అనుమానాలకు తావిస్తోంది. ఈ గండి ద్వారా సుమారు 600 క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. నీటి ఉధృతిని తట్టుకోలేక సహజంగా ఈ గండి పడిందా.. లేదా కర్ణాటక రైతులే గండి కొట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఎల్లెల్సీ నీటి కోసం కర్ణాటక, కర్నూలు జిల్లా రైతుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతున్న ఆంధ్ర వాటా నీటిపై కన్నేసిన కర్ణాటక రైతులు ఏటా జల చౌర్యానికి పాల్పడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వల్ల కాలువ కింద కర్ణాటక పరిధిలో నాన్ ఆయకట్టు ప్రతి యేటా పెరుగుతోంది. ఎల్లెల్సీ పొడవు 324 కి.మీ. 0 నుంచి 130 కి.మీ వరకు కర్ణాటక రాష్ట్రంలోనూ, 131 నుంచి 324 కి.మీ. వరకు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనూ ఉంది. కర్ణాటక పరిధిలో కాలువకు ఎప్పుడు, ఎక్కడా గండ్లు పడవు. పూర్తిగా ఆంధ్ర పరిధిలో ఉన్న కాలువకు కూడా గండ్లు పడిన దాఖలాలు లేవు. కేవలం కర్ణాటక రైతుల భూములు ఉన్న మోకా వద్ద మాత్రమే ప్రతి ఏటా గండ్లు పడుతున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నాన్ ఆయకట్టు కోసమే గండ్లు కర్ణాటక పరిధిలో సుమారు 60 వేల ఎకరాలు నాన్ ఆయకట్టు సాగవుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ప్రతి యేటా జలచౌర్యానికి పాల్పడుతున్నట్లు సమాచారం. గత వారం తుంగభద్ర డ్యామ్ నుంచి 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీరు సోమవారం ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన మోకా వద్దకు చేరాయి. ఈ నీటికి గండి కొట్టేందుకు కర్ణాటక రైతులు ముందే ఏర్పాట్లు చేసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. నాన్ ఆయకట్టులో వరి నారుమళ్లు ఉన్నాయి. వరి నాట్ల సమయం కావటంతో నీరు అవసరం. అందుకే కర్ణాటక రైతులు ముందుచూపుతో కాలువకు అక్కడక్కడా రంధ్రాలు చేసినట్లు సమాచారం. ఈ చిన్న రంధ్రాలే గండ్లుగా మారుతున్నాయి. ఇలాగే కొనసాగితే కర్నూలు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్నూలులో బుధవారం జరుగుబోయే నీటిపారుదల సలహా మండలి భేటీలోనైనా పాలకులు, అధికారులు స్పందించి గట్టి నిర్ణయం తీసుకుంటారా? లేదా? అని జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. గండిపై గండి.. గతేడాది అక్టోబర్ 24న దిగువ కాలువ మైలురాయి 119/6-120 మధ్యలో కుడివైపు కాలువ లైనింగ్ దెబ్బతిని పెద్దఎత్తున గండి పడింది. ఆ గండి ద్వారా అప్పట్లో ఒక టీఎంసీ నీరు బయటకు వృథాగా పోయింది. ప్రస్తుతం పడిన గండి కూడా గతంలో పడిన గండికి కొంత దూరంలోనే ఉంది. కర్ణాటక ఆయకట్టు, నాన్ ఆయకట్టు రైతులు కాలువకు ఇరువైపులా పైపులను వేసి అక్రమ జలచౌర్యానికి పాల్పడుతున్నారు. ఆ సమయంలో కాలువ పైభాగంలో కొంతమేర తవ్వి కట్ట కింది భాగంలో ఉన్న చోట పైపులను వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల కట్ట పైభాగం, కింది భాగంలో పైపుల లీకేజి వల్ల కాలువ దెబ్బతింటుందంటూ జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు అక్రమ జలచౌర్యాన్ని అరికట్టడం, కాలువ భద్రతను కాపాడడం లేదంటూ వాపోతున్నారు. -
ఎల్ఎల్సీకి గండి
సాక్షి, బళ్లారి (కర్ణాటక): తుంగభద్ర ఎల్ఎల్సీకి మంగళవారం ఉదయం మోకా సమీపంలో 119వ కి.మీ వద్ద చిన్న పాటి గండి పడి నీరు వృథాగా పోతోంది. ఎల్ఎల్సీ ఈఈ నారాయణ నాయక్ తదితరులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గండిని పూడ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎల్ఎల్సీ ద్వారా కర్నూలు జిల్లా రైతులకు ప్రతి రోజూ దాదాపు 700 క్యూసెక్కుల నీరు అందజేయాల్సి ఉంది. ఈ సమయంలో గండి పడడంతో ఆ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కాలువకు నీటి ప్రవాహం తగ్గించి, మరమ్మతు పనులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
కుప్పేసి కుమ్మేస్తున్నారు
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఇసుక తవ్వకాలు నిషేధించడంతో అధికార పార్టీకి చెందిన నేతలు వాల్టాచట్టాన్ని అతిక్రమించి కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. జిల్లాలోని తుంగభద్ర, కృష్ణానదుల నుంచి ఇసుకఎల్లలు దాటుతోంది. వ్యాపారులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ వాటిని వెంటనే సుదూరప్రాంతాలకు తీసుకెళ్లకుండా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఒకచోట డంప్ చేయిస్తున్నారు. ఆ తరువాత తహశీల్దార్ ఆధ్వర్యంలో దాడులు చేసినట్లు హడావుడి చేసి ఇసుకను సీజ్చేయిస్తారు. రెండుమూడు రోజుల తర్వాత ఏదో ఒక వంకచూపుతూ డంప్‌చేసిన ఇసుకను రవాణా చేసేందుకు అనుమతులివ్వడం ఆనవాయితీగా మారింది. అడ్డాకుల మండలంలోని పెద్దవాగులో డంపింగ్‌ల దందాకు తెరతీశారు. వాగులో యంత్రాలను వినయోగించి అక్రమంగా ఇసుకను తవ్వడం.. అక్కడికి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో డంప్ చేయడం పరిపాటిగా మారింది. పొన్నకల్ శివారులోని పెద్దవాగు వద్ద గద్వాలకు చెందిన అధికార పార్టీ నేతలు కొందరు స్థానిక రైతుల పట్టా భూముల్లో ఇసుక తరలించుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వాటికి అనుమతి రాకముందే ఇసుక రవాణా కోసం రెండు నెలల కిందటే శాఖాపూర్ పాత హైవే నుంచి వాగువరకు అప్పుడే రోడ్డు కూడా వేశారు. అనుమతుల పేర అక్రమరవాణా సీజ్ చేసిన ఇసుకను మహబూబ్‌నగర్‌లోని రైల్వే క్వార్టర్ల నిర్మాణం కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు రెండొందల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు రెవెన్యూ అధికారులు అనుమతులిచ్చారు. జిల్లా కేంద్రంలో బాలుర హాస్టల్‌కు ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు 200 క్యూబిక్ మీటర్లు, కిరణ్ కాన్వెంట్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి ఈనెల 5 నుంచి 7తేదీ వరకు 106 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేలా అధికారులు అనుమతులిచ్చారు. సీజ్ చేసిన ఇసుకను తరలించేందుకు అనుమతులు పొందిన ఇసుక మాఫియా కొన్నాళ్ల నుంచి రాత్రిళ్లు అక్రమ డంపింగ్‌ల దందాను మొదలుపెట్టింది. అనుమతి ముసుగులో రాత్రికి రాత్రే వాగులో యంత్రాల సహాయంతో ఇసుకను తీసుకొచ్చి అనుమతి ఉన్న డంప్‌ల వద్ద నిల్వచేసి జేసీబీలతో లారీలను నింపుతున్నారు. నిత్యం రాత్రిళ్లు 20 నుంచి 40 లారీల వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అయితే అధికారులు మొదట సీజ్ చేసిన ఇసుక స్థానంలో ఇప్పటికీ డంప్‌లు ఉండటం విశేషం. తాజాగా హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు వద్ద నిర్మాణాల నిమిత్తం ఐదువేల క్యూబిక్ మీటర్ల సీజ్ చేసిన ఇసుక తరలించే విధంగా అనుమతులు రావడం గమనార్హం. సరిహద్దులో నిద్రపోతున్న నిఘా! పెద్దవాగులో దుబ్బపల్లి వద్ద మరో దందా సాగుతోంది. ఇక్కడ పొన్నకల్‌కు చెందిన ట్రాక్టర్లతో స్థానికులు ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇటీవల పోలీసులు అక్కడ రాత్రి వేళలో ఇసుకను నింపుకుంటున్న ఎనిమిది లారీలను పట్టుకుని కేసులు నమోదుచేసినా.. అక్రమదందా కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా కొమిరెడ్డిపల్లి, కందూర్, పొన్నకల్ గ్రామాల శివారులోని పెద్దవాగులో చిన్న డీసీఎంలు, టిప్పర్ల ద్వారా వందల ట్రిప్పుల ఇసుక రాత్రివేళలో నిత్యం తరలిపోతోంది. తిమ్మాపూర్, తాళ్లగడ్డ, మూసాపేట, నిజాలాపూర్, సంకలమద్ది, కొమిరెడ్డిపల్లి, కందూర్, పొన్నకల్, రాచాల గ్రామల రైతులు వ్యవసాయం చేసుకోవడానికి పెద్దవాగే ప్రధాన ఆధారం. ఇక్కడి నుంచి ఇసుక యథేచ్ఛగా తరలుతోంది. అలాగే కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి నేరుగా హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుకను తరలిస్తుండటంతో వాటిని అడ్డుకట్ట వేసేందుకు యర్రవల్లి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రయత్నించిన తహశీల్దార్లు మునెప్ప, సురేష్‌బాబులపై దాడులకు పాల్పడటంతో అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించినా తహశీల్దార్లకు జిల్లా అధికారులు పూర్తిగా అండదండలు ఇవ్వలేకపోయారు. తుంగభద్ర, కృష్ణానదుల నుంచి రాజోలి, తూర్పుగార్లపాడు, తుమ్మలపల్లి, బుడమొర్సు, తుమ్మిళ్ల, చిన్నధన్వాడ, పెద్ద ధన్వాడ, మాన్దొడ్డిల, మానవపాడు, బీచ్పల్లి మీదుగా ఇసుకఎల్లలు దాటుతోంది. అధికారులు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ఇసుక దొరకడం కష్టంగా మారనుంది. -
దిగువ కాల్వ దుస్థితిపై దిగులేది ?
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా పశ్చిమ ప్రాంత ఆయకట్టుకు పెద్దదిక్కుగా ఉన్న తుంగభద్ర దిగువ కాల్వ నుంచి వాటా మేరకు నీటి సరఫరా రాకపోవడంపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నా నాయకులు, ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదు. ఎగువ ప్రాంతంలోని కర్ణాటక రైతులు యథేచ్చగా జల చౌర్యానికి పాల్పడుతుండడంతో వాటాలో కనీస పరిమాణంలో కూడా జిల్లాకు నీరు రాని దుస్థితి నెలకొంది. కర్ణాటక- ఆంధ్ర ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం నుంచి మన రాష్ట్రానికి వాటా మేరకు నీటిని సరఫరా చేసే నిమిత్తం 1691 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి వీలుగా తుంగభద్ర దిగువ కాల్వను నిర్మించారు. కాల్వ పరిధిలో కర్ణాటక వాటా 640, కర్నూలు జిల్లాకు ఆంధ్రా వాటా కింద 725 క్యుసెక్కులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఎగువ ఉన్న కర్ణాటక సంగతేమో కానీ మన జిల్లాకు వచ్చేసరికి ఏనాడు 350 క్యుసెక్కులకు మించి నీటి సరఫరా జరగలేదు. ఈ ఏడాది జలాశయం నీటి లభ్యత ఆధారంగా దిగువ కాల్వకు 16.50 టీఎంసీలు కేటాయించారు. ఇందులో ఖరీఫ్ సాగు నిమిత్తం జూలై4 నుంచి 13 వరకు 750 క్యూసెక్కులు, రెండో విడత కింద జూలై 31 నుంచి ఆగస్టు 9 వరకు 640 క్యుసెక్కులకు ఇండెంట్ పెట్టగా యాభైశాతం కూడా సరఫరా కాలేదు. ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, ఎల్లెల్సీ, టీబీ బోర్డు అధికారులతో కలిసి కాల్వ వెంట పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆదేశాల మేరకు మూడో విడత కింద ఈ నెల 14 నుంచి 22 వరకు 640 క్యూసెక్కులు సరఫరా చేస్తామని ఇండెంట్ పెట్టారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు : కర్ణాటక రైతుల జల చౌర్యం విషయంపై అధికారులు జిల్లా ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చినా ఫలితం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగునీటి చౌర్యానికి అడ్డుకట్టవేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన కరువైంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితిపై అధికారుల లేఖ : తుంగభద్ర దిగువ కాల్వపై కన్నడిగుల పెత్తనం రోజురోజుకి మితిమీరిపోయి జిల్లా రైతులకు నష్టం వాటిల్లుతుండడంతో ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, అధికారులు పరిస్థితిపై ఈ నెల 8 వతేదీన ఆ శాఖ ఈఎన్‌సికి లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు.. బోర్డు పరిధిలోని ఎల్లెల్సీ 0 కి.మీ. నుంచి 130 కి.మీ. వరకు 6 సెక్షన్లలో కర్ణాటక ప్రభుత్వం అధికారులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ కరువై నానాయకట్టుకు సాగునీరు తరలిపోంది. 0 కి.మీ. నుంచి 130 కి.మీ. వరకు మరమ్మతుల కోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 30 కోట్లు మంజూరు చేయగా ఆలస్యంగా టెండర్లు పిలిచిన అధికారులు అంతలోనే నీరు విడుదల కావడంతో నిధులను తిప్పిపంపారు. దీంతో కాల్వ బలహీనంగా ఉండడంతో పూర్తిస్థాయిలో నీటిని వదలడంలేదు. బోర్డు పరిధిలో 0 .కి.మీ. నుంచి 250 కి.మీ. (ఆంధ్రాసరిహద్దు) వరకు కాల్వపై పర్యవేక్షణకు కర్ణాటక ప్రభుత్వం రెగ్యులర్ లష్కర్స్ను నియమించడ లేదు. తాత్కాలికంగా నియమితులవుతున్న లష్కర్లు నానాయకట్టుదారులతో మామూళ్లు పుచ్చుకుని వారికి సహకరిస్తున్నారు. నానాయకట్టుదారులపై టీబీ బోర్డు అధికారులు కేసులు పెట్టినా అక్కడి పోలీసులు కేసు నమోదు చేయడం లేదని లేఖ ద్వారా ఎస్ఈ ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి ఎస్ఈ సుధాకర్‌తో మాట్లాడగా కన్నడీగుల జల చౌర్యంపై లేఖ రాసినట్లు తెలిపారు.