కర్నూలు రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా పశ్చిమ ప్రాంత ఆయకట్టుకు పెద్దదిక్కుగా ఉన్న తుంగభద్ర దిగువ కాల్వ నుంచి వాటా మేరకు నీటి సరఫరా రాకపోవడంపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నా నాయకులు, ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదు. ఎగువ ప్రాంతంలోని కర్ణాటక రైతులు యథేచ్చగా జల చౌర్యానికి పాల్పడుతుండడంతో వాటాలో కనీస పరిమాణంలో కూడా జిల్లాకు నీరు రాని దుస్థితి నెలకొంది. కర్ణాటక- ఆంధ్ర ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం నుంచి మన రాష్ట్రానికి వాటా మేరకు నీటిని సరఫరా చేసే నిమిత్తం 1691 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి వీలుగా తుంగభద్ర దిగువ కాల్వను నిర్మించారు. కాల్వ పరిధిలో కర్ణాటక వాటా 640, కర్నూలు జిల్లాకు ఆంధ్రా వాటా కింద 725 క్యుసెక్కులు ఇవ్వాల్సి ఉంది.
అయితే ఎగువ ఉన్న కర్ణాటక సంగతేమో కానీ మన జిల్లాకు వచ్చేసరికి ఏనాడు 350 క్యుసెక్కులకు మించి నీటి సరఫరా జరగలేదు. ఈ ఏడాది జలాశయం నీటి లభ్యత ఆధారంగా దిగువ కాల్వకు 16.50 టీఎంసీలు కేటాయించారు. ఇందులో ఖరీఫ్ సాగు నిమిత్తం జూలై4 నుంచి 13 వరకు 750 క్యూసెక్కులు, రెండో విడత కింద జూలై 31 నుంచి ఆగస్టు 9 వరకు 640 క్యుసెక్కులకు ఇండెంట్ పెట్టగా యాభైశాతం కూడా సరఫరా కాలేదు. ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకర్, ఎల్లెల్సీ, టీబీ బోర్డు అధికారులతో కలిసి కాల్వ వెంట పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆదేశాల మేరకు మూడో విడత కింద ఈ నెల 14 నుంచి 22 వరకు 640 క్యూసెక్కులు సరఫరా చేస్తామని ఇండెంట్ పెట్టారు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు :
కర్ణాటక రైతుల జల చౌర్యం విషయంపై అధికారులు జిల్లా ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చినా ఫలితం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగునీటి చౌర్యానికి అడ్డుకట్టవేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన కరువైంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పరిస్థితిపై అధికారుల లేఖ :
తుంగభద్ర దిగువ కాల్వపై కన్నడిగుల పెత్తనం రోజురోజుకి మితిమీరిపోయి జిల్లా రైతులకు నష్టం వాటిల్లుతుండడంతో ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకర్, అధికారులు పరిస్థితిపై ఈ నెల 8 వతేదీన ఆ శాఖ ఈఎన్‌సికి లేఖ రాశారు.
లేఖలోని ముఖ్యాంశాలు..
బోర్డు పరిధిలోని ఎల్లెల్సీ 0 కి.మీ. నుంచి 130 కి.మీ. వరకు 6 సెక్షన్లలో కర్ణాటక ప్రభుత్వం అధికారులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ కరువై నానాయకట్టుకు సాగునీరు తరలిపోంది. 0 కి.మీ. నుంచి 130 కి.మీ. వరకు మరమ్మతుల కోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 30 కోట్లు మంజూరు చేయగా ఆలస్యంగా టెండర్లు పిలిచిన అధికారులు అంతలోనే నీరు విడుదల కావడంతో నిధులను తిప్పిపంపారు. దీంతో కాల్వ బలహీనంగా ఉండడంతో పూర్తిస్థాయిలో నీటిని వదలడంలేదు.
బోర్డు పరిధిలో 0 .కి.మీ. నుంచి 250 కి.మీ. (ఆంధ్రాసరిహద్దు) వరకు కాల్వపై పర్యవేక్షణకు కర్ణాటక ప్రభుత్వం రెగ్యులర్ లష్కర్స్‌ను నియమించడ లేదు. తాత్కాలికంగా నియమితులవుతున్న లష్కర్లు నానాయకట్టుదారులతో మామూళ్లు పుచ్చుకుని వారికి సహకరిస్తున్నారు. నానాయకట్టుదారులపై టీబీ బోర్డు అధికారులు కేసులు పెట్టినా అక్కడి పోలీసులు కేసు నమోదు చేయడం లేదని లేఖ ద్వారా ఎస్‌ఈ ఈఎన్‌సీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఈ సుధాకర్‌తో మాట్లాడగా కన్నడీగుల జల చౌర్యంపై లేఖ రాసినట్లు తెలిపారు.
దిగువ కాల్వ దుస్థితిపై దిగులేది ?
Published Wed, Aug 14 2013 3:41 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
Advertisement
Advertisement