మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఇసుక తవ్వకాలు నిషేధించడంతో అధికార పార్టీకి చెందిన నేతలు వాల్టాచట్టాన్ని అతిక్రమించి కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. జిల్లాలోని తుంగభద్ర, కృష్ణానదుల నుంచి ఇసుకఎల్లలు దాటుతోంది. వ్యాపారులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ వాటిని వెంటనే సుదూరప్రాంతాలకు తీసుకెళ్లకుండా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఒకచోట డంప్ చేయిస్తున్నారు. ఆ తరువాత తహశీల్దార్ ఆధ్వర్యంలో దాడులు చేసినట్లు హడావుడి చేసి ఇసుకను సీజ్‌చేయిస్తారు. రెండుమూడు రోజుల తర్వాత ఏదో ఒక వంకచూపుతూ డంప్‌చేసిన ఇసుకను రవాణా చేసేందుకు అనుమతులివ్వడం ఆనవాయితీగా మారింది.
అడ్డాకుల మండలంలోని పెద్దవాగులో డంపింగ్‌ల దందాకు తెరతీశారు. వాగులో యంత్రాలను వినయోగించి అక్రమంగా ఇసుకను తవ్వడం.. అక్కడికి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో డంప్ చేయడం పరిపాటిగా మారింది. పొన్నకల్ శివారులోని పెద్దవాగు వద్ద గద్వాలకు చెందిన అధికార పార్టీ నేతలు కొందరు స్థానిక రైతుల పట్టా భూముల్లో ఇసుక తరలించుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వాటికి అనుమతి రాకముందే ఇసుక రవాణా కోసం రెండు నెలల కిందటే శాఖాపూర్ పాత హైవే నుంచి వాగువరకు అప్పుడే రోడ్డు కూడా వేశారు.
అనుమతుల పేర అక్రమరవాణా
సీజ్ చేసిన ఇసుకను మహబూబ్‌నగర్‌లోని రైల్వే క్వార్టర్ల నిర్మాణం కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు రెండొందల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు రెవెన్యూ అధికారులు అనుమతులిచ్చారు. జిల్లా కేంద్రంలో బాలుర హాస్టల్‌కు ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు 200 క్యూబిక్ మీటర్లు, కిరణ్ కాన్వెంట్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి ఈనెల 5 నుంచి 7తేదీ వరకు 106 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేలా అధికారులు అనుమతులిచ్చారు.
సీజ్ చేసిన ఇసుకను తరలించేందుకు అనుమతులు పొందిన ఇసుక మాఫియా కొన్నాళ్ల నుంచి రాత్రిళ్లు అక్రమ డంపింగ్‌ల దందాను మొదలుపెట్టింది. అనుమతి ముసుగులో రాత్రికి రాత్రే వాగులో యంత్రాల సహాయంతో ఇసుకను తీసుకొచ్చి అనుమతి ఉన్న డంప్‌ల వద్ద నిల్వచేసి జేసీబీలతో లారీలను నింపుతున్నారు. నిత్యం రాత్రిళ్లు 20 నుంచి 40 లారీల వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అయితే అధికారులు మొదట సీజ్ చేసిన ఇసుక స్థానంలో ఇప్పటికీ డంప్‌లు ఉండటం విశేషం. తాజాగా హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు వద్ద నిర్మాణాల నిమిత్తం ఐదువేల క్యూబిక్ మీటర్ల సీజ్ చేసిన ఇసుక తరలించే విధంగా అనుమతులు రావడం గమనార్హం.
సరిహద్దులో నిద్రపోతున్న నిఘా!
పెద్దవాగులో దుబ్బపల్లి వద్ద మరో దందా సాగుతోంది. ఇక్కడ పొన్నకల్‌కు చెందిన ట్రాక్టర్లతో స్థానికులు ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇటీవల పోలీసులు అక్కడ రాత్రి వేళలో ఇసుకను నింపుకుంటున్న ఎనిమిది లారీలను పట్టుకుని కేసులు నమోదుచేసినా.. అక్రమదందా కొనసాగుతూనే ఉంది.
అదేవిధంగా కొమిరెడ్డిపల్లి, కందూర్, పొన్నకల్ గ్రామాల శివారులోని పెద్దవాగులో చిన్న డీసీఎంలు, టిప్పర్ల ద్వారా వందల ట్రిప్పుల ఇసుక రాత్రివేళలో నిత్యం తరలిపోతోంది. తిమ్మాపూర్, తాళ్లగడ్డ, మూసాపేట, నిజాలాపూర్, సంకలమద్ది, కొమిరెడ్డిపల్లి, కందూర్, పొన్నకల్, రాచాల గ్రామల రైతులు వ్యవసాయం చేసుకోవడానికి పెద్దవాగే ప్రధాన ఆధారం. ఇక్కడి నుంచి ఇసుక యథేచ్ఛగా తరలుతోంది. అలాగే కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి నేరుగా హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుకను తరలిస్తుండటంతో వాటిని అడ్డుకట్ట వేసేందుకు యర్రవల్లి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.
మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రయత్నించిన తహశీల్దార్లు మునెప్ప, సురేష్‌బాబులపై దాడులకు పాల్పడటంతో అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించినా తహశీల్దార్లకు జిల్లా అధికారులు పూర్తిగా అండదండలు ఇవ్వలేకపోయారు. తుంగభద్ర, కృష్ణానదుల నుంచి రాజోలి, తూర్పుగార్లపాడు, తుమ్మలపల్లి, బుడమొర్సు, తుమ్మిళ్ల, చిన్నధన్వాడ, పెద్ద ధన్వాడ, మాన్‌దొడ్డిల, మానవపాడు, బీచ్‌పల్లి మీదుగా ఇసుకఎల్లలు దాటుతోంది. అధికారులు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ఇసుక దొరకడం కష్టంగా మారనుంది.
కుప్పేసి కుమ్మేస్తున్నారు
Published Mon, Oct 21 2013 3:24 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement