మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా కృత్రిమకల్లు దొరకని ఊరంటూ ఉండదు. అక్రమమార్గంలో లెసైన్స్‌లు పొందిన కొందరు వ్యాపారులు కృత్రిమకల్లును యథేచ్ఛగా తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. క్లోరల్ హైడ్రేట్(సీహెచ్), డైజోఫాం, అల్ఫాజోలం వంటి విష రసాయనాలతో కల్లును తయారుచేస్తున్నారు. తాటి, ఈతచెట్లు లేని గ్రామాల్లో కూడా ఈ కల్లు ఏరులైపారుతోంది. వీటిని ఎంత ఎక్కువమోతాదులో కలిపితే అంతమత్తు ఉంటుంది. చిటికెడు సీహెచ్‌తో లీటర్ కల్లును తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో క్లోరల్‌హైడ్రేట్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది.
అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకుల అండదండలతో జిల్లాలో కొందరు వ్యాపారులు పొరుగురాష్ట్రాల నుంచి క్లోరల్‌హైడ్రేట్‌ను భారీగా అక్రమ పద్ధతుల్లో రవాణా చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు జరిపిన దాడుల్లో మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో సుమారు రూ.10లక్షల విలువచేసే 20 క్వింటాళ్ల సీహెచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో కొన్నేళ్లుగా ఈ వ్యాపారం మూడుపూలు ఆరుకాయలుగా కొనసాగుతోంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎక్సైజ్ అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యహరిస్తున్నారు. ఎవరో సమాచారమిస్తే తప్ప దాడులకు ఉపక్రమించడం లేదు. గద్వాల పట్టణానికి చెందిన అన్వర్ అనే వ్యక్తికి మల్దకల్ మండలం నీలిపల్లిలో వ్యవసాయపొలం ఉంది. అయితే అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు వాటి వెనక ఎవరి హస్తం ఉందనే విషయాన్ని బయట పెట్టలేకపోతున్నారు.
నీలిపల్లి కేంద్రంగా బడా వ్యాపారం
ధరూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి కొంతమందిని నియమించుకుని వారి ద్వారా వ్యాపారం చేసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్లోరల్ హైడ్రేట్‌ను అక్రమంగా నిల్వ ఉంచినట్లు ఎక్సైజ్ అధికారులకు తెలిసినా వారు మిగతా ప్రాంతాలకు వెళ్లడం లేదు. క్లోరల్ హైడ్రేట్ వ్యాపారానికి నీలిపల్లి ఎప్పటి నుంచో కేంద్రబిందువుగా మారింది. 2003లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి అప్పట్లో భారీగా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా గద్వాలకు సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక నుంచి సీహెచ్‌ను నిత్యం దిగుమతి చేసుకుంటూ కల్లు తయారీకి జిల్లా అంతటా ఉపయోగిస్తున్నారు.
అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు, నారాయణపేట, కొడంగల్, లింగంపల్లి, నవాబ్‌పేట, కొత్తూరు, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా కల్లును తయారుచేసి లక్షలు గడిస్తున్నారు. కల్తీ కల్లును నిరోధించి, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఈడిగ కులస్తులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న దాఖల్లేవు. బుధవారం ఎక్సైజ్ సీఐ నాగార్జున్‌రెడ్డి సీహెచ్ పట్టుకున్న వ్యవసాయ పొలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. షెడ్డు పరిసరపొలాల్లో సోదాలు జరిపారు. పొలం ఎవరి ఉంది.. రైతు ఎవరనే విషయమై వీఆర్‌ఓ వెంకోబరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితుని పట్టుకుంటామని సీఐ తెలిపారు.
నేతల అండదండలతో..
Published Thu, Nov 21 2013 2:56 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement