ధర దడ
మహబూబ్‌నగర్ వ్యవసాయం : కూరగాయల ధరలు ఆకాశన్నంటాయి. సామాన్యులు వాటివైపు చూడడానికే భయపడుతున్నారు. గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో భారీగా ధరలు పెరిగాయి. టమాట ధర మరీ దారుణమైంది. టమాట కిలో 60 రూపాయలకు చేరడంతో వినియోగదారులు వాటిని కొనడమే మానేశారు. ఒక చిన్న కుటుంబానికి వారానికి సరిపోయే కూరగాయలు కొనాలంటే వెయ్యి రూపాయలకు తక్కువ కావడం లేదు. వీటిని అదుపులో పెట్టాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దళారులు కూరగాయల ధరలను అమాంతం పెంచేస్తున్నారు.
తగ్గిన టమాట దిగుబడి....
జిల్లాలో 2011-12లో 3,905 హెక్టార్లలో టమాట పంట సాగైంది. 2012-13లో 3,875 హెక్టార్లు, 2013-14లో 4,296 హెక్టార్లలో సాగైంది. అయితే, ఎండలు ఎక్కువగా ఉండడం, సమయానికి వర్షాలు కురవక పోవడంతో ఈ ఏడాదిలో నాలుగున్నర నెలలు గడిచినా 400 హెక్టార్లకు మించి దిగుబడి రాలేదు. అక్కడక్కడా పండిన పంట కూడా వివిధ తెగుళ్ల బారిన పడి నాశనమైంది. జిల్లాలో బీర్నిస్, చామగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి సాగు గతేడాది కంటే తగ్గిపోయిందని ఉద్యానవనశాఖ అధికారులు తెలుపుతున్నారు. టమాట దిగుబడి ఎక్కడిక్కడ ఆగిపోవడంతో రోజురోజుకు టమాట ధరల్లో వ్యత్యసం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఈ నెల 8న రూ.30 పలికిన కిలో టమాట వారం రోజుల కాలవ్యవధిలో రూ.60 పలుకుతుంది.
పంటలకు తెగుళ్లు సోకి
దిగుబడి రావడం లేదు
నేను 20గుంటల పొలంలో రెండు నెలల క్రితం టమాట పంట సాగు చేశాను.ఆ పంటకు తెగుళ్లు సోకి ఇప్పటి వరకు దిగుబడి రావడం లేదు. ఎన్ని మందులు కొట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈ సారి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండొచ్చు
-ప్రశాంతి, మహిళా రైతు,పెర్కివీడు,
కోయిలకొండ మండలం
వాతావరణం
అనుకూలించడం లేదు
ఎండకాలం ఎండలు ఎక్కువగా కొట్టడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. మళ్లీ వానలు కూడా వరుసగా రావడంతో టమాట తోట దెబ్బతిన్నది. పంటకు తెగుళ్లు కూడా సోకుతున్నాయి. దిగుబడి చాలావరకు తగ్గిపోయింది.
- శివమ్మ, మహిళా రెతు,
కాకర్లపాడు