తాడిపత్రి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం కింద అనంతపురం జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు తాగునీరు సరఫరా కాకుండా అడ్డుపడితే.. మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నుంచి పులివెందుల బ్రాంచి కాలువ(పీబీసీ)కు చుక్క నీరు కూడా పోనివ్వమని తాడిపత్రి మునిసిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.
మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గండికోట రిజర్వాయర్ నుంచి ‘అనంత’కు తాగునీటి ని వదలకుండా ఆ ప్రాంత రైతులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్చెల్సీ ద్వారా పులివెందులకు వెళ్లే నీరు తాడిపత్రి ప్రాంతం నుంచే వెళుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇదే కాలువ ద్వారా తాడిపత్రి బ్రాంచి కెనాల్ (టీబీసీ)కు వ చ్చే నీటితో 30 వేల ఎకరాలు కూడా తడవడం లేదన్నారు. అయినా తమ దిగువన ఉన్న వైఎస్సార్ జిల్లాకు నీరు సరఫరా చేస్తున్నా ఇన్నాళ్లూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తమకు తాగునీరు వదలకుండా అడ్డుపడితే ఊరుకోమని చెప్పారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 14 నుంచి తుంపర డీప్ కట్ వద్ద ఆందోళన చేపడుతామన్నారు. పులివెందులకు చుక్క నీరు కూడా పోనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ‘అనంత’ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికే తాము ఇలా చేయాల్సి వస్తోందన్నారు. వచ్చే ఏడాది శింగనమల, పుట్లూరు, నారాయణపల్లి, సుబ్బరాయసాగర్, కోమటికుంట్ల, గరుగుచింతల, బొప్పేపల్లి చెరువులను నింపిన తర్వాతే నీరు వదిలేలా అధికారులపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
పులివెందులకు చుక్క నీరు పోనివ్వం
Published Wed, Jan 8 2014 3:54 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement