సాక్షి ప్రతినిధి, అనంతపురం : పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) కోటాపై ప్రభుత్వ ద్వంద్వ వైఖరి.. అదనపు కోటాపై మంత్రుల నిర్లక్ష్యం వేసవిలో తాగునీటి గొడవలకు దారితీస్తుందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనంతపురం జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లా పులివెందుల, జమ్ములమడుగు తాగునీటి అవసరాల కోసం హెచ్చెల్సీ కోటాలో 8.50 టీఎంసీలను ఐఏబీ సమావేశం కేటాయించింది. టీబీ డ్యామ్ నుంచి మరో 6.99 టీఎంసీల నీటిని విడుదల చేస్తే హెచ్చెల్సీ కోటా పూర్తవుతుంది.
ఇందులో ప్రవాహ నష్టాలు పోను మన జిల్లా సరిహద్దుకు నాలుగు టీఎంసీలు మించి చేరే అవకాశాలు లేవని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. ప్రస్తుతం పీఏబీఆర్‌లో 1.465 టీఎంసీలు, ఎంపీఆర్‌లో 1.150, సీబీఆర్‌లో 1.056 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీ ప్రధాన కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, ఎంపీఆర్ ఉత్తర, దక్షిణ కాలువల కింద సాగుచేసిన పంటలకు డిసెంబర్ రెండో వారం వరకూ నీళ్లందించాల్సి ఉంది. పులివెందుల, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు ఇంకా నీళ్లందించాల్సి ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. తాగునీటికి 2.5 టీఎంసీలకు మించి దక్కే అవకాశాలు లేవని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ నీళ్లు వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడానికి ఏ మాత్రం సరిపోవని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఏబీఆర్ కోట, టీబీ డ్యామ్ నుంచి అదనపు కోటా నీటిని జిల్లాకు రప్పించకపోతే తాగునీటి యుద్ధాలు తప్పవని.. ఇది శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుందని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఇప్పటికే సర్కారుకు నివేదిక పంపారు. కానీ.. సర్కారు మాత్రం స్పందించడం లేదు. జిల్లాకు ఏకైక సాగు, తాగునీటి వనరు హెచ్చెల్సీ మాత్రమే. టీబీ డ్యామ్‌లో ఈ ఏడాది 150 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన టీబీ బోర్డు.. హెచ్చెల్సీకి 22.995 టీఎంసీలను కేటాయించింది. ఇందులో తాగునీటికి 8.5 టీఎంసీలు, నీటి ప్రవాహ, ఆవిరి రూపంలో వృథా అయ్యే జలాలు పోను 9.745 టీఎంసీలతో 90 వేల ఎకరాలకు నీళ్లందించాలని ఐఏబీలో అధికారులు నిర్ణయించారు.
ఆ నిర్ణయాలను అమలు చేయడంలో భాగంగా హెచ్చెల్సీ ప్రధాన కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, ఎంపీఆర్ ఉత్తర, దక్షిణ కాలువల ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. పులివెందుల, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు లేట్ రబీ పంటలకు నీళ్లందించాల్సి ఉంది. ఇక హెచ్చెల్సీ కోటాలో బుధవారం నాటికి 16 టీఎంసీలను టీబీ బోర్డు విడుదల చేసింది. మరో 6.99 టీఎంసీలను టీబీ డ్యామ్ నుంచి విడుదల చేస్తే హెచ్చెల్సీ కోటా పూర్తవుతుంది. రిజర్వాయర్‌లలో మొత్తం 3.671 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. హెచ్చెల్సీ కోటాలో అనంతపురం జిల్లాకు దక్కే నాలుగు టీఎంసీలను కలుపుకుంటే.. 7.671 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి.
ఇందులో హెచ్చెల్సీ ప్రధాన కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, ఎంపీఆర్ ఉత్తర, దక్షిణ కాలువల కింద సాగు చేసిన పంటలు రైతుల చేతికందాలంటే మరో 2.50 టీఎంసీలు అవసరం. ఇక తాడిపత్రి, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడానికి కనీసం 2.60 టీఎంసీలు అవసరమని అధికారులు తేల్చి చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. తాగునీటి అవసరాల కోసం కేవలం 2.57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ నీళ్లు ఏమూలకు సరిపోవు. ఫిబ్రవరి ఆఖరు వరకు సరిపోతాయి.
మార్చి నుంచి జూలై వరకు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ పీఏబీఆర్ కోటాను డిసెంబర్ నుంచి విడుదల చేసేలా టీబీ బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వాన్ని కోరుతూ నివేదిక పంపారు. టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో అదనపు కోటా కోసం ఒత్తిడి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. పీఏబీఆర్ కోటా విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇవ్వడం లేదు. పోనీ.. విడుదల చేయమని కూడా సర్కారు చెప్పడం లేదు. ఇక అదనపు కోటా జలాలు టీబీ బోర్డు మంజూరు చేస్తుందో లేదో సర్కారుకే ఎరుక.
పానీ పాట్లు తప్పవు!
Published Sat, Nov 16 2013 3:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement