గుక్కెడు నీటి కోసం గ్రామాలు తల్లడిల్లుతున్నాయి. ఇంటిల్లిపాది కూలి కెళితే గానీ పూట గడవని ఎందరో నిరుపేదలు నీటి కోసమే ఒకరు పని మానుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రతి ఏటా వేసవిలో తాగునీటి సమస్య జఠిలమవుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భూగర్బ జలాలు అడుగంటిపోతే మేమేం చేస్తామంటూ దబాయిస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే చెప్పండి.. ట్యాంకర్లు పంపిస్తామంటున్నారు. ఆ ట్యాంకర్లూ సక్రమంగా రాకపోవడంతో జనం జల యుద్ధం చేయాల్సి వస్తోందని జిల్లా వ్యాప్తంగా ‘న్యూస్‌లైన్ విజిట్’లో వెల్లడైంది.
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : తాగునీటి ఎద్దడి నివారణ కోసం అధికారులు పంపుతున్న వేసవి ప్రణాళికలు బుట్టదాఖలు అవుతున్నాయి. రూ.కోట్లు కావాలని అడిగిన చోట.. రూ.లక్షలను కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో వేసవిలో జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు దాహార్తితో తల్లడిల్లిపోతున్నారు.
నిధులు మంజూరు కాకపోతే మేమేం చేస్తామంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతేడాది వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.31 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 160 ఎస్సీ కాలనీలలో తాగునీటి పనులు చేపట్టడానికి రూ.23.63 కోట్లు, 96 ఎస్టీ కాలనీలకు రూ.16.46 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం కేవలం రూ.5 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది వేసవి యాక్షన్ ప్లాన్ కింద రూ.5.50 కోట్లు, జాతీయ విపత్తు నివారణ పథకం (సీఆర్‌ఎఫ్) కింద రూ.16 కోట్ల మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. గతేడాది డిసెంబర్‌లోనే జిల్లా పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించినా నిధులు మంజూరు చేయడంలో తాత్సారం చేస్తున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు
జిల్లాలో భూగర్బ జలాలు అడుగంటి పోతుండడంతో బోరు బావులు ఒట్టిపోతున్నాయి. బావులలో కనీసం చూసేందుకు కూడా నీరు కనిపించడం లేదు.
తాగునీటికి సంబంధించిన బోర్లు సుమారు 4 వేలకు పైగా పనిచేయడం లేదు. ఇందులో 80 శాతం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతోనే సమస్య జఠిలమైందని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలో ఏడాది పొడువునా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన గ్రామాలు దాదాపు 60కు పైగా ఉన్నాయి. తక్కువ వర్షపాతం నమోదయ్యే యల్లనూరు, పుట్లూరు, అమడగూరు తదితర మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ప్రస్తుతం 142 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. యల్లనూరు, పుట్లూరు, ఒడిస్సి, ఆమడగూరు, అనంతపురం రూరల్ తదితర మండలాల్లో ట్యాంకర్లతో సరఫరా చేయాల్సి వస్తోంది.
వీటితో పాటు వేసవిలో జిల్లాలో 773 ఆవాస ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని గుర్తించారు. ప్రతి ఏటా 60-80 గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి స్థానికంగా ఉన్న రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకుంటున్నారు. ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తున్నా ప్రజలకు శాశ్వతంగా మాత్రం దాహార్తి సమస్యను తీర్చలేకపోతున్నాయి.
కార్యాచరణ
రూపొందిస్తున్నాం
ఈ ఏడాది జాతీయ విపత్తు పథకం (సీఆర్‌ఎఫ్) నిధులు రూ. 16 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వారం రోజుల క్రితం రూ.5 కోట్లు సీఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల ద్వారా ట్రాన్స్‌పోర్టేషన్‌కు సంబంధించిన బిల్లుల చెల్లింపు, చెడిపోయిన బోర్ల మరమ్మత్తు, ప్లషింగ్ తదితర కార్యక్రమాలను చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం.
- ప్రభాకర్‌రావు,
ఎస్‌ఈ,ఆర్‌డబ్ల్యూఎస్
ప్రజల కష్టాలు
Published Sat, May 31 2014 2:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM