Rupes crores
-
భక్తజనంలో కలకలం !
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం భక్తజనంలో కలకలం రేపుతోంది. ఆలయాల పవిత్రతకు భంగం వాటిల్లే చర్యలకు తెలుగుదేశం పార్టీ తెరతీస్తుందనే భయాన్ని వ్యక్తం చేస్తోంది. రూ.కోటికి పైగా ఆదాయం వచ్చే ప్రతి ఆలయానికి పాలకమండలిని నియమించాలని తీసుకున్న నిర్ణయం వెనక రాజకీయ దృకోణం దాగివుందని విమర్శిస్తోంది. భక్తి, ముక్తి ప్రదాయినులుగా నిలిచే ఆలయాలకు రాజకీయ రంగు అంటే ప్రమాదం లేకపోలేదని భావిస్తోంది. అందరి దేవుడనే భావన భక్త జనం మది నుంచి మాయం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేస్తోంది. సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం తమ పార్టీ నాయకులకు రాజకీయ ఉపాధి కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు వీలున్న అన్ని దారులను వెతుకుతోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలకు పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రూ. కోటికి పైగా ఆదాయం ఉన్న ప్రతి ఆలయానికి తొమ్మిది మంది సభ్యుల తో కూడిన పాలక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రూ. కోటికి పైగా ఆదాయం వచ్చే దేవాలయాలు జిల్లాలో కొన్ని ఉన్నాయి. ఇందులో అమరేశ్వరాలయం(అమరావతి), త్రికోటేశ్వర ఆలయం(కోటప్పకొండ), గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం (పెదకాకాని), లక్ష్మీనరసింహస్వామి ఆలయం(మంగళగిరి), కనకదుర్గమ్మ ఆలయం(కంఠంరాజు కొండూరు), లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం(వైకుంఠపురం), సహస్రలింగేశ్వరస్వామి ఆలయం, భావన్నారాయణస్వామి దేవాలయం (పొన్నూరు)ఉన్నాయి. వీటిలో త్రికోటేశ్వరస్వామి ఆలయం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కనకదుర్గమ్మ ఆలయాలకు ఇప్పటివరకు పాలకమండళ్లు లేవు.ఈ ఆలయాల కోసం గతంలో భూ ములు దానం చేసిన శాశ్వత ధర్మకర్తలే వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. తమ పూర్వీకులు భూములు దానం చేసిన ఆలయాలు కావడంతో వా రు బాధ్యతాయుతం గా ఉంటూ ఆల యాల పవిత్రతను కాపాడుతూ వస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ మూడు ఆలయాలకూ పాలకమండళ్లు రానున్నాయి. అయితే వీటిని టీడీపీ నాయకగణం తో భర్తీ చేస్తే మాత్రం ఆలయాలకూ రాజకీయ రంగు అంటుకోనుందనే విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాలో భక్తులు అధికంగా వచ్చే దేవాలయాలు కావడంతో వీటిని రాజకీయ నేతల చేతికి అప్పగిస్తే పవిత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవి కాక దేవాదాయ శాఖ పరిధిలో చిన్న చిన్న దేవాలయాలు సుమారు 200 వరకు ఉన్నాయి. వీటికి కూడా పాలక మండళ్లను నియమించేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకే.. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో పదవుల కోసం ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్లకు ఆలయ కమిటీలు రాజకీయ ఉపాధి మార్గంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పాలక మండళ్లు లేని దేవాలయాలకు సైతం కమిటీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనక రాజకీయ కోణం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. మార్కెట్ యార్డులు, కార్పొరేషన్లలో రాజకీయ నాయకులకు పదవు లు కల్పించినా పర్వాలేదనీ, కోటప్పకొండ, మంగళగిరి వంటి ఆలయ పాలక మండళ్లలో చోటు కలిస్తే మాత్రం దేవాలయాలకూ రాజకీయరంగు పులిమినట్టు అవుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి భక్తుల రద్దీ అధికంగా ఉండే దేవాలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేయకుండా అధికారుల కనుసన్నల్లో నడిచేలా నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
ప్రజల కష్టాలు
గుక్కెడు నీటి కోసం గ్రామాలు తల్లడిల్లుతున్నాయి. ఇంటిల్లిపాది కూలి కెళితే గానీ పూట గడవని ఎందరో నిరుపేదలు నీటి కోసమే ఒకరు పని మానుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రతి ఏటా వేసవిలో తాగునీటి సమస్య జఠిలమవుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భూగర్బ జలాలు అడుగంటిపోతే మేమేం చేస్తామంటూ దబాయిస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే చెప్పండి.. ట్యాంకర్లు పంపిస్తామంటున్నారు. ఆ ట్యాంకర్లూ సక్రమంగా రాకపోవడంతో జనం జల యుద్ధం చేయాల్సి వస్తోందని జిల్లా వ్యాప్తంగా ‘న్యూస్‌లైన్ విజిట్’లో వెల్లడైంది. అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : తాగునీటి ఎద్దడి నివారణ కోసం అధికారులు పంపుతున్న వేసవి ప్రణాళికలు బుట్టదాఖలు అవుతున్నాయి. రూ.కోట్లు కావాలని అడిగిన చోట.. రూ.లక్షలను కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో వేసవిలో జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు దాహార్తితో తల్లడిల్లిపోతున్నారు. నిధులు మంజూరు కాకపోతే మేమేం చేస్తామంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతేడాది వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.31 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 160 ఎస్సీ కాలనీలలో తాగునీటి పనులు చేపట్టడానికి రూ.23.63 కోట్లు, 96 ఎస్టీ కాలనీలకు రూ.16.46 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం కేవలం రూ.5 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది వేసవి యాక్షన్ ప్లాన్ కింద రూ.5.50 కోట్లు, జాతీయ విపత్తు నివారణ పథకం (సీఆర్ఎఫ్) కింద రూ.16 కోట్ల మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. గతేడాది డిసెంబర్లోనే జిల్లా పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించినా నిధులు మంజూరు చేయడంలో తాత్సారం చేస్తున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు జిల్లాలో భూగర్బ జలాలు అడుగంటి పోతుండడంతో బోరు బావులు ఒట్టిపోతున్నాయి. బావులలో కనీసం చూసేందుకు కూడా నీరు కనిపించడం లేదు. తాగునీటికి సంబంధించిన బోర్లు సుమారు 4 వేలకు పైగా పనిచేయడం లేదు. ఇందులో 80 శాతం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతోనే సమస్య జఠిలమైందని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలో ఏడాది పొడువునా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన గ్రామాలు దాదాపు 60కు పైగా ఉన్నాయి. తక్కువ వర్షపాతం నమోదయ్యే యల్లనూరు, పుట్లూరు, అమడగూరు తదితర మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ప్రస్తుతం 142 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. యల్లనూరు, పుట్లూరు, ఒడిస్సి, ఆమడగూరు, అనంతపురం రూరల్ తదితర మండలాల్లో ట్యాంకర్లతో సరఫరా చేయాల్సి వస్తోంది. వీటితో పాటు వేసవిలో జిల్లాలో 773 ఆవాస ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని గుర్తించారు. ప్రతి ఏటా 60-80 గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి స్థానికంగా ఉన్న రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకుంటున్నారు. ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తున్నా ప్రజలకు శాశ్వతంగా మాత్రం దాహార్తి సమస్యను తీర్చలేకపోతున్నాయి. కార్యాచరణ రూపొందిస్తున్నాం ఈ ఏడాది జాతీయ విపత్తు పథకం (సీఆర్ఎఫ్) నిధులు రూ. 16 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వారం రోజుల క్రితం రూ.5 కోట్లు సీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల ద్వారా ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన బిల్లుల చెల్లింపు, చెడిపోయిన బోర్ల మరమ్మత్తు, ప్లషింగ్ తదితర కార్యక్రమాలను చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. - ప్రభాకర్‌రావు, ఎస్ఈ,ఆర్డబ్ల్యూఎస్