గోడ ప్రమాద జాడ
సాక్షి, విజయవాడ :
పుష్కర పనుల పుణ్యమా అని అధికారులు ఇతర ముఖ్యమైన పనులకు తిలోదకాలు ఇస్తున్నారు. పుష్కరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల కోసం రెవెన్యూ అధికారులు తీసుకున్న ఒక నిర్ణయం జలరవాణా కోసం ఇప్పటికే చేపట్టిన పనులకు ఎసరు పెట్టగా, ఆ పక్కనే నిర్మించిన గోడ ప్రమాదకరంగా మారింది.
కృష్ణానదిలో నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన ఉన్న రైవస్, ఏలూరు, బందరు కాలువలకు నీరు వదిలేందుకు కృష్ణా మెయిన్ కెనాల్ ఉంది. గతంలో కెనాల్ రోడ్డులో ఈ మెయిన్ కాలువ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ తరువాత దానికి మరమ్మతులు చేసి వినియోగిస్తున్నారు. ఈ కాలువనే బ్రిటీష్ కాలంలో జల రవాణా కోసం ఉపయోగించేవారు. దీనికోసం కెనాల్‌రోడ్డు నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్లే మార్గంలో ఒక వంతెన నిర్మించి దాని కింద రెగ్యులేటర్లను ఏర్పాటు చేశారు. ఈ వంతెన, లాకులు పాడవడంతో ఇరిగేషన్ అధికారులు కాలువలో దిగువకు 110 మీటర్ల తరువాత మరో వంతెనను నిర్మించి రెగ్యులేటర్లు ఏర్పాటుచేశారు.
జలరవాణా వాల్ క్లోజ్
ఈ ఏడాది చివరి నాటికి ప్రకాశం బ్యారేజీ నుంచి జల రవాణా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా కెనాల్‌లోనూ జలరవాణా మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే 1000 టన్నుల బోట్లు ఈ కాలువ ద్వారానే ఏలూరు కాలువలోకి వెళ్తాయి. ఈ నేపథ్యంలో కృష్ణా కెనాల్‌లో ఒక గోడను ఇరిగేషన్ అధికారులు నిర్మించారు.
సుమారు 90 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తు,
రెండు మీటర్ల వెడల్పులో ఈ గోడ నిర్మించారు. ఒకవైపు కెనాల్ రోడ్డు, మరోవైపు ఈ గోడ ఉండటంతో దీని మధ్యలో జలరవాణాకు కావాల్సిన నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు.
కాలువను పూడ్చేస్తున్న రెవెన్యూ
కేవలం జలరవాణా కోసం నిర్మించుకున్న గోడను ఇప్పుడు రోడ్డుకు రిటైనింగ్ వాల్‌గా మారుస్తున్నారు. పాత వంతెన, కొత్తవంతెన మధ్య కెనాల్‌రోడ్డు వెడల్పు చాలా తక్కువగా ఉండటం వల్ల పుష్కరాలకు వచ్చే భక్తుల తొక్కిసలాట జరుగుతుందని రెవెన్యూ అధికారులు భావించారు. దీంతో అక్కడ రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జలరవాణా కోసం నిర్మించిన గోడను ఖరారు చేసుకుని రోడ్డును విస్తరిస్తున్నారు. 90 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తులో ఉన్న గోడ నిండే వరకూ మట్టితో ఫిల్లింగ్ చేస్తున్నారు. వారం రోజుల్లో ఫిల్లింగ్ పూర్తిచేసి తారురోడ్డు వేయాలని భావిస్తున్నారు. దీనివల్ల రోడ్డు వెడల్పు అవుతుందని నిర్ణయించారు.
మట్టిలోడు గోడ భరిస్తుందా?
కేవలం జలరవాణా కోసం నిర్మించుకున్న గోడను రిటైటింగ్ వాల్‌గా వినియోగించడంపై ఇంజినీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 15 మీటర్ల ఎత్తులో ఉన్న గోడ వద్ద టన్నుల కొద్దీ మట్టిని నింపుతున్నారని, ఇక్కడ భక్తుల రద్దీ పెరిగినపుడు మట్టి ఒత్తిడి పెరిగి గోడ కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే, పుష్కరాలు ముగిశాక తిరిగి ఆ మట్టిని తీసేసి జలరవాణాకు సిద్ధం చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. పుష్కరాల పనులను హడావుడిగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఇవేమీ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడేకంటే ఆ ప్రదేశంలో బందోబస్తు ఏర్పాటు చేసి క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటే సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. l