
బారీ తిమింగలం అస్థిపంజరం లభ్యం
సొర్లగొంది సముద్ర తీరంలో 3నెలలు క్రితం వెలుగుచూసిన వైనం
నాగాయలంక నదిఒడ్డుకు చేర్చి భద్రపర్చిన కేజ్ కల్చరిస్ట్ రఘుశేఖర్ బృందం
నాగాయలంక : మండలంలోని సొర్లగొంది సముద్రతీర ప్రాంతంలో మూడునెలల క్రితం లభ్యమైన యాభై అడుగులకుపైగా (15మీటర్లు) ఉన్న భారీ తిమింగలానికి(వేల్) సంబంధించిన అస్థిపంజరం నాగాయలంకలో శనివారం వెలుగు చూసింది. పీతలవేట సాగించే యానాదుల నుంచి సమాచారం తీసుకున్న కేజ్‌కల్చరిస్ట్, ఔత్సాహిక యువ ఆక్వా శాస్త్రవేత్త తలశిల రఘుశేఖర్, గాలి బసవదేవుడు తదితర తన బృంద సభ్యులతో వీటిని సేకరించారు.
తిమింగలం సైజ్ భారీగా ఉండడంతో అస్థిపంజరం శకలాలను పడవద్వారా నాగాయలంక కృష్ణానది ఒడ్డున ఉన్న తమ కేజ్‌కల్చర్ ప్రాంతానికి చేర్చారు. ఈప్రాంతం వన్యప్రాణి అభయారణ్యం కావడంతో ఈ విషయం స్థానికంగా వెల్లడి చేస్తే చిక్కులు వస్తాయనే అభిప్రాయంతో వైల్డ్‌లైప్ ఉన్నతాధికారులకు తెలిపి శకలాలను దాచారు.
రాజమండ్రి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో రాక
రాజమహేంద్రవరం వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో వి.ప్రభాకరరావు, స్వామినాథన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.రామసుబ్రహ్మణ్యం శనివారం ఇక్కడికి రావడంతో అస్థిపంజరం వెలుగు చూసింది. దీని శకలాలను డీఎఫ్‌వో పరిశీలించారు. తిమింగలం డెత్‌బాడీ పొడవు 15 మీటర్లకు, వెడల్పు రెండు మీటర్లకు పైబడి ఉండటంతో వాస్తవ తిమింగలం సైజ్ మరింత పెచ్చు ఉండే అవకాశం ఉందని ఆయన విలేకరులకు చెప్పారు.
ఇది మరణించి అయిదారు నెలల సమయం కావచ్చున్నారు. అస్థిపంజరం భావితరాల అధ్యయనానికి వినియోగపడేరీతిలో మ్యూజియం లేదా మెరైన్ పార్క్‌కు తరలించేందుకు చర్యలు తీసుంటామని డీఎఫ్‌వో చెప్పారు. నాగాయలంక సముద్రతీరంలో లభ్యమైనందున తిమింగలం అస్థిపంజరాన్ని దివిసీమలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఈప్రాంతవాసులు కోరడంతో పరిశీలిస్తామన్నారు.
అరుదైన అంశం
నాగాయలంక సముద్ర తీరంలో తిమింగలానికి చెందిన భారీ అస్థిపంజరం లభ్యం కావడం అరుదైన అంశం. భద్రతకారణాల దృష్ట్యానే ఇప్పటి వరకు బయట పెట్టలేదు. సంబంధిత అభ్యాసకులు, భవితరాలకు ఇది అధ్యయనంగా ఉపయోగపడుతుంది. కేంద్రప్రభుత్వం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - వి.ప్రభాకరరావు,
వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో, రాజమహేంద్రవరం
దివిసీమలో ఏర్పాటు చేయాలి
సముద్రతీరప్రాంతంలో అరుదైన వాటిని సేకరించాలనే అభిలాష ఎంతోకాలంగా ఉంది. తిమింగలపు అస్థిపంజరం సమాచారం దొరకడం అదృష్టం. వ్యయప్రయాసలతో సహచర బృందం సహకారంతో నాగాయలంక చేర్చగలిగాను. దివిసీమలోనే ఏర్పాటుచేస్తే బాగుంటుంది.
- తలశిల రఘుశేఖర్, ఔత్సాహిక కేజ్‌కల్చరిస్ట్,ఆక్వా శాస్త్రవేత్త,నాగాయలంక