ప్రక్షాళన .. గిరిజనశాఖ లక్ష్యం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి అజ్మీరా చందూలాల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రణాళికాబద్ధంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నామన్నారు. మంత్రి చందూలాల్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. హాస్టళ్లను రీమోడల్ చేసి విద్యార్థులకు 1 ప్లస్ 1 బెడ్లు, ఆర్‌ఓ వాటర్‌ప్లాంట్‌లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో(2015-16)ఏ నెలలో ఏయే పనులను పూర్తిచేయాలి అన్నదానిపై దృష్టిసారించినట్లు చెప్పారు.
స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభమయ్యేలోగా విద్యార్థులకు బట్టలు,పుస్తకాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కొందరు అధికారుల్లో నిర్లిప్తత, సరైన దృక్పథంతో పనిచేయకపోవడం వల్ల గత ఏడాది రూ.150 కోట్ల మేర స్కాలర్‌షిప్ నిధులు మురిగిపోయాయని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇకముందు అలా జరగనివ్వమన్నారు. హాస్టళ్లలోని విద్యార్థినులకు కాస్మోటిక్‌చార్జీలను రూ.75 నుంచి రూ.200లకు, అబ్బాయిలకు రూ. 50 నుంచి రూ.150కు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు.
గిరిజన ఇంజనీర్లను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం...
ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన గిరిజన విద్యార్థులకు హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్‌లో ప్రత్యేక శిక్షణను అందించి వారు కాంట్రాక్టర్లుగా ఎదిగేలా కృషి చేయనున్నట్లు మంత్రి చందూలాల్ తెలిపారు. జిల్లాల్లో ఉన్న 3,4 యూత్ హాస్టళ్లను బడిమానేసిన, చదువుకు దూరమైన గిరిజన బాల,బాలికలకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా రూపొందించాలనే యోచిస్తున్నామన్నారు.పది, ఇంటర్ చదివిన పిల్లలకు ఆయా వృత్తుల్లో శిక్షణ, ఇతరత్రా నైఫుణ్యాల పెంపుదలలో శిక్షణనిస్తామన్నారు. దీనిని ఈ జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.
వచ్చే ఏడాది వంద శాతం సాధించేలా ప్రణాళికలు...
గిరిజన గురుకులాల విద్యార్థులు ఇంటర్‌లో 84.37 శాతం ఫలితాలను సాధించారని, వచ్చే ఏడాది వందశాతం ఫలితాలను సాధించేలా ప్రత్యేక చర్యలను చేపడతామన్నారు. అరకొరగా టీచర్లున్నా, అంతగా సదుపాయాలు లేకపోయినా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా సంబంధిత అధికారులు, సిబ్బంది కృషిచేశారని అభినందించారు. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యేలా, అన్నిజిల్లాల్లో ప్రత్యేకశిక్షణను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇతర శాఖల్లో పనిచేస్తున్న తమ శాఖ అధికారుల డిప్యుటేషన్లను రద్దుచేసినట్లు మంత్రి వెల్లడించారు.సీఆర్‌టీ కింద 2 వేల మంది టీచర్లు నెలకు రూ.5 వేల వేతనంతో పనిచేస్తున్నారని, వీరి సర్వీసులను క్రమబద్దీకరించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిం చినట్లు మంత్రి చందూలాల్ తెలియజేశారు.