Backlog posts Replacement
-
బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి మోక్షమెప్పుడో..!
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ కాకుండా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఉత్సాహంగా పనిచేసిన అర్బన్ జిల్లా యంత్రాంగానికి కోర్టు కళ్లెం వేసింది. కొన్ని స్థాయిల్లో అధికారులు తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణంగా మారాయి. న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు నియామకాల విషయంలో అడుగు ముందుకు పడే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రం ఉద్యోగాల భర్తీ కోసం కొండకెదురు చూసినట్లుగా చూస్తున్నారు. అధికారుల తప్పిదాలు ? బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో మినిస్టీరియల్ సర్వీస్ నిబంధనలు తెలియక కొన్ని పొరపాట్లు చేశారు. ముఖ్యంగా బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకాల నిబంధనల ప్రకారం అటెండర్(ఆఫీస్ సబార్డినేట్) పోస్టులు సం బంధిత శాఖ ఉన్నతాధికారులే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్–4 ఉద్యోగాలుగా ఉండే జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో పోస్టులు కలెక్టర్ చైర్మన్‌గా నియామక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. అయితే గతంలో అటెండర్ పోస్టుల నియామకాల విషయంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో ఈ సారి వాటిని కూడా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో నింపేందుకు ప్రకటన ఇచ్చారు అయితే నిబంధనల ప్రకారం ఇది ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు అటెండర్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హతగా నిబంధనలు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం 10వ తరగతి విద్యార్హతగా ప్రకటించారు. ఇదికూడా సాంకేతికంగా ఇబ్బందిరకంగా మారింది. విద్యార్హతలు 10వ తరగతిగా మార్చాలంటూ ప్రభుత్వానికి జిల్లా అధికారులు లేఖ రాశారు. ఈ విషయంలో ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి రాలేదు. దీనికి తోడు జిల్లాలో 19 మార్చి, 2017 నాటికి ఉన్న బ్యాక్లాగ్ ఖాళీలన్నింటిని 30 జూన్, 2018 నాటికి భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కానీ జిల్లా స్థాయిలో మాత్రం నోటిఫికేషన్‌నే 28 జూన్ 2018న ఇచ్చారు. ఆ తర్వాత పోస్టుల భర్తీ ప్రకియను తాము సెప్టెంబర్ 2018లోగా పూర్తి చేసుకునేలా అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంలోనూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం ఇప్పటి వరకు రాలేదు. దీంతో అధికారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కోర్టుకు చేరిన పంచాయితీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో అధికారులు మొదట 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితి అన్నారు. తర్వాత సడలించి 44 ఏళ్లకు పెంచారు. అయితే పెంచిన విషయం గమనించని కొందరు అభ్యర్థులు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలంటూ కోర్టును ఆశ్రయించారు. మరికొందరు దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచాలని కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు విషయాల్లో జిల్లా యంత్రాంగానికి సానుకూల తీర్పు కోర్టు నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయినా ఇతర సమస్యలపైనా మరికొందరు కోర్టులను ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తద్వారా మొత్తం వ్యవహారం పెండింగ్‌లో పడే అవకాశాలే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వ్యవహారం నిరుద్యోగుల పాలిట ఎండమావిలా తయారైంది. అధికారుల అసహనం ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో అర్బన్ జేసీ దయానంద్ ప్రత్యేక చొరవ చూపారు. మొత్తం ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేసేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు 15 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్యోగులను ఉరుకులుపరుగులు పెట్టించారు. కానీ ఉన్నతాధికారుల నిర్ణయాలు, కోర్టు కేసులతో ప్రతిబం«ధకాలు ఏర్పడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. అయితే ఇప్పటికైనా కోర్టు పంచాయితీ, ఎన్నికల హడావిడి ముగిస్తే ప్రక్రియ వేగంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని జేసీ దయానంద్ అంటున్నారు. 106 పోస్టులు.. 17,169 దరఖాస్తులు మొత్తం 106 పోస్టులు ఖాళీ ఉండగా 17,169 దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ ద్వారా మొత్తం 19,432 మంది దరఖాస్తులు చేయగా, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో మాత్రం 17,169దరఖాస్తులు మాత్రమే అందాయి. వీటిని మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. కేటగిరీలవారీగా వచ్చిన దరఖాస్తులు.. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 6 ఉండగా 2,489 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 4 పోస్టులు ఉండగా 1400 దరఖాస్తులు.. మొత్తంగా 3,889 దరఖాస్తులు అందాయి. టైపిస్ట్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 11 ఉండగా 612 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు ఉండగా 283 దరఖాస్తులు.. మొత్తంగా 895 దరఖాస్తులు అందాయి. షరాఫ్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 2 ఉండగా 2,471దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో ఒకటి ఉండగా 1,074 దరఖాస్తులు.. మొత్తంగా 3,545 దరఖాస్తులు అందాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 56 ఉండగా 5,665 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 23 పోస్టులు ఉండగా 3,175 దరఖాస్తులు.. మొత్తం 8,840దరఖాస్తులు అందాయి. మొత్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 106 పోస్టులకుగాను ఎస్సీ కేటగిరీలో ఉన్న 75 పోస్టులకు 11,237 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 31 పోస్టులకు 5,932 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తులు 17,169 అందాయి. -
శుభవార్త
అనంతపురం ఎడ్యుకేషన్: జీఓలు 23, 99 అమలులో భాగంగా డీఎస్సీ దివ్యాంగుల కేటగిరీలో(పీహెచ్) బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా 2014 డీఎస్సీ ఎస్జీటీ కేడర్‌లో మిగిలిపోయిన 17 పీహెచ్ పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులైన అభ్యర్థులకు సమాచారం అందించారు. శుక్రవారం సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఎంపికైన వారి వికలత్వ ధ్రువీకరణ పత్రాలను విశాఖపట్నంలోని కింగ్జాన్స్ ఆస్పత్రికి పంపనున్నారు. అక్కడి నుంచి వికలత్వ శాతం ధ్రువీకరణ వచ్చిన తర్వాత పోస్టులు ఇవ్వనున్నారు. ఆ మూడు డీఎస్సీ వివరాలు పంపండి 98, 2008, 2012 సంవత్సరాల డీఎస్సీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈనెల 19లోగా పంపాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు వివరాలు పంపే పనిలో నిమగ్నమయ్యారు. -
‘కళ్లు’ మూసుకుంటున్నారు..!
సాక్షి, విశాఖపట్నం: అంధ దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అనర్హులు అడ్డదారుల్లో వైకల్యం సర్టిఫికెట్లు పొంది అర్హులకు దక్కకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ నిర్వహిస్తున్న ‘సదరం’ శిబిరాలు వేదికలవుతున్నాయన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు కారణమని తెలుస్తోంది. వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఈ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో సంబంధిత అధికారులు ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి లక్ష వరకు ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అంధులైన దివ్యాంగుల నాలుగో తరగతి (క్లాస్–4) ఉద్యోగాల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆయా జిల్లా యంత్రాంగాలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఇలా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో వాచ్మెన్, అటెండర్లు, వాషర్మెన్, ఆఫీస్ సబార్డినేట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు వెరసి 60 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. విశాఖపట్నం జిల్లాలో 52 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనా దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కాలేదు. వైద్యారోగ్యశాఖ అధికారులు చాన్నాళ్లుగా ఇదిగో, అదిగో అంటూ వాయిదాలేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ నెలాఖరున అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తామని చెబుతున్నారు. ఇలా విశాఖ జిల్లాలో ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో పలువురు అర్హులు కాని వారు ఉన్నట్టు తెలుస్తోంది. వారిని మరోసారి వైద్య పరీక్షలకు పంపాలని ఫిర్యాదులందడంతో వీటి భర్తీ ప్రక్రియలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది బ్యాక్లాగ్ పోస్టులున్నాయి. వీటికి కొంతమంది అనర్హులు కూడా దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. వీరు గతంలో సదరం క్యాంపుల్లో వైద్యులపై ప్రజాప్రతినిధులతో ఒత్తిళ్లు తెచ్చి అంధత్వం ఉన్నట్టు ధ్రువపత్రాలు పొందారని, వాటి ఆధారంగా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారని అసలైన అంధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు సోమవారం విశాఖలోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో కొంతమంది గతంలో సదరం క్యాంపులో ఇచ్చిన సర్టిఫికెట్లను సమర్పించారు. ఇద్దరు అభ్యర్థులు వేలిముద్రలు వేయగా, నలుగురు సంతకాలు చేసినట్టు తెలిసింది. అంధులైతే సంతకాలు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ పుట్టుకతో కాకుండా మధ్యలో అంధత్వం వచ్చి ఉంటే గైడ్ సాయంతో సంతకాలు పెట్టిస్తారు. కానీ గైడ్ల సాయం లేకుండానే సంతకాలు చేశారని చెబుతున్నారు. ఈ కంటి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు సదరం శిబిరంలో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ ఎనిమిది పోస్టులకు దాదాపు 500 మంది అంధులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 1ః2 నిష్పత్తిలో కంటి పరీక్షలకు పంపాల్సి ఉండగా కేవలం ఏడుగురినే పంపడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డదారుల్లో అంధత్వ వైకల్యం సర్టిఫికెట్లు పొంది వాటితో ఉద్యోగాలు తన్నుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల తమలాంటి వారికి అన్యాయం జరుగుతోందని అసలైన అంధులు ఆవేదన చెందుతున్నారు. మా నివేదిక అధికారులకు పంపుతాం.. సోమవారం శ్రీకాకుళం జిల్లా నుంచి ఏడుగురు బ్యాక్‌పోస్టుల అభ్యర్థులు కంటి పరీక్షలకు ఈ ఆస్పత్రికి వచ్చారు. వారి వద్ద ఉన్న సదరం సర్టిఫికెట్లను పరిశీలించాం. వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించాం. వాటిని నివేదిక రూపంలో ఆ జిల్లా అధికారులకు పంపిస్తాం. –డాక్టర్ సూర్యనారాయణ, కంటి వైద్యుడు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖ -
ప్రక్షాళన .. గిరిజనశాఖ లక్ష్యం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రణాళికాబద్ధంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నామన్నారు. మంత్రి చందూలాల్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. హాస్టళ్లను రీమోడల్ చేసి విద్యార్థులకు 1 ప్లస్ 1 బెడ్లు, ఆర్ఓ వాటర్ప్లాంట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో(2015-16)ఏ నెలలో ఏయే పనులను పూర్తిచేయాలి అన్నదానిపై దృష్టిసారించినట్లు చెప్పారు. స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభమయ్యేలోగా విద్యార్థులకు బట్టలు,పుస్తకాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కొందరు అధికారుల్లో నిర్లిప్తత, సరైన దృక్పథంతో పనిచేయకపోవడం వల్ల గత ఏడాది రూ.150 కోట్ల మేర స్కాలర్షిప్ నిధులు మురిగిపోయాయని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇకముందు అలా జరగనివ్వమన్నారు. హాస్టళ్లలోని విద్యార్థినులకు కాస్మోటిక్చార్జీలను రూ.75 నుంచి రూ.200లకు, అబ్బాయిలకు రూ. 50 నుంచి రూ.150కు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. గిరిజన ఇంజనీర్లను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం... ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన గిరిజన విద్యార్థులకు హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్‌లో ప్రత్యేక శిక్షణను అందించి వారు కాంట్రాక్టర్లుగా ఎదిగేలా కృషి చేయనున్నట్లు మంత్రి చందూలాల్ తెలిపారు. జిల్లాల్లో ఉన్న 3,4 యూత్ హాస్టళ్లను బడిమానేసిన, చదువుకు దూరమైన గిరిజన బాల,బాలికలకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా రూపొందించాలనే యోచిస్తున్నామన్నారు.పది, ఇంటర్ చదివిన పిల్లలకు ఆయా వృత్తుల్లో శిక్షణ, ఇతరత్రా నైఫుణ్యాల పెంపుదలలో శిక్షణనిస్తామన్నారు. దీనిని ఈ జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది వంద శాతం సాధించేలా ప్రణాళికలు... గిరిజన గురుకులాల విద్యార్థులు ఇంటర్లో 84.37 శాతం ఫలితాలను సాధించారని, వచ్చే ఏడాది వందశాతం ఫలితాలను సాధించేలా ప్రత్యేక చర్యలను చేపడతామన్నారు. అరకొరగా టీచర్లున్నా, అంతగా సదుపాయాలు లేకపోయినా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా సంబంధిత అధికారులు, సిబ్బంది కృషిచేశారని అభినందించారు. ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యేలా, అన్నిజిల్లాల్లో ప్రత్యేకశిక్షణను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న తమ శాఖ అధికారుల డిప్యుటేషన్లను రద్దుచేసినట్లు మంత్రి వెల్లడించారు.సీఆర్టీ కింద 2 వేల మంది టీచర్లు నెలకు రూ.5 వేల వేతనంతో పనిచేస్తున్నారని, వీరి సర్వీసులను క్రమబద్దీకరించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిం చినట్లు మంత్రి చందూలాల్ తెలియజేశారు.