సాక్షి, విశాఖపట్నం: అంధ దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అనర్హులు అడ్డదారుల్లో వైకల్యం సర్టిఫికెట్లు పొంది అర్హులకు దక్కకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ నిర్వహిస్తున్న ‘సదరం’ శిబిరాలు వేదికలవుతున్నాయన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు కారణమని తెలుస్తోంది. వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఈ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో సంబంధిత అధికారులు ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి లక్ష వరకు ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అంధులైన దివ్యాంగుల నాలుగో తరగతి (క్లాస్–4) ఉద్యోగాల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆయా జిల్లా యంత్రాంగాలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఇలా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో వాచ్‌మెన్, అటెండర్లు, వాషర్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు వెరసి 60 బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
విశాఖపట్నం జిల్లాలో 52 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనా దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కాలేదు. వైద్యారోగ్యశాఖ అధికారులు చాన్నాళ్లుగా ఇదిగో, అదిగో అంటూ వాయిదాలేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ నెలాఖరున అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తామని చెబుతున్నారు. ఇలా విశాఖ జిల్లాలో ఈ బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో పలువురు అర్హులు కాని వారు ఉన్నట్టు తెలుస్తోంది. వారిని మరోసారి వైద్య పరీక్షలకు పంపాలని ఫిర్యాదులందడంతో వీటి భర్తీ ప్రక్రియలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది బ్యాక్‌లాగ్ పోస్టులున్నాయి. వీటికి కొంతమంది అనర్హులు కూడా దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. వీరు గతంలో సదరం క్యాంపుల్లో వైద్యులపై ప్రజాప్రతినిధులతో ఒత్తిళ్లు తెచ్చి అంధత్వం ఉన్నట్టు ధ్రువపత్రాలు పొందారని, వాటి ఆధారంగా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారని అసలైన అంధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు సోమవారం విశాఖలోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
వీరిలో కొంతమంది గతంలో సదరం క్యాంపులో ఇచ్చిన సర్టిఫికెట్లను సమర్పించారు. ఇద్దరు అభ్యర్థులు వేలిముద్రలు వేయగా, నలుగురు సంతకాలు చేసినట్టు తెలిసింది. అంధులైతే సంతకాలు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ పుట్టుకతో కాకుండా మధ్యలో అంధత్వం వచ్చి ఉంటే గైడ్ సాయంతో సంతకాలు పెట్టిస్తారు. కానీ గైడ్ల సాయం లేకుండానే సంతకాలు చేశారని చెబుతున్నారు. ఈ కంటి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు సదరం శిబిరంలో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ ఎనిమిది పోస్టులకు దాదాపు 500 మంది అంధులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 1ః2 నిష్పత్తిలో కంటి పరీక్షలకు పంపాల్సి ఉండగా కేవలం ఏడుగురినే పంపడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డదారుల్లో అంధత్వ వైకల్యం సర్టిఫికెట్లు పొంది వాటితో ఉద్యోగాలు తన్నుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల తమలాంటి వారికి అన్యాయం జరుగుతోందని అసలైన అంధులు ఆవేదన చెందుతున్నారు.
మా నివేదిక అధికారులకు పంపుతాం..
సోమవారం శ్రీకాకుళం జిల్లా నుంచి ఏడుగురు బ్యాక్‌పోస్టుల అభ్యర్థులు కంటి పరీక్షలకు ఈ ఆస్పత్రికి వచ్చారు. వారి వద్ద ఉన్న సదరం సర్టిఫికెట్లను పరిశీలించాం. వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించాం. వాటిని నివేదిక రూపంలో ఆ జిల్లా అధికారులకు పంపిస్తాం. –డాక్టర్ సూర్యనారాయణ, కంటి వైద్యుడు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖ
Comments
Please login to add a commentAdd a comment