హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ కాకుండా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఉత్సాహంగా పనిచేసిన అర్బన్ జిల్లా యంత్రాంగానికి కోర్టు కళ్లెం వేసింది. కొన్ని స్థాయిల్లో అధికారులు తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణంగా మారాయి. న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు నియామకాల విషయంలో అడుగు ముందుకు పడే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రం ఉద్యోగాల భర్తీ కోసం కొండకెదురు చూసినట్లుగా చూస్తున్నారు.
అధికారుల తప్పిదాలు ?
బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో మినిస్టీరియల్ సర్వీస్ నిబంధనలు తెలియక కొన్ని పొరపాట్లు చేశారు. ముఖ్యంగా బ్యాక్‌లాగ్ ఉద్యోగాల నియామకాల నిబంధనల ప్రకారం అటెండర్(ఆఫీస్ సబార్డినేట్) పోస్టులు సం బంధిత శాఖ ఉన్నతాధికారులే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్–4 ఉద్యోగాలుగా ఉండే జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో పోస్టులు కలెక్టర్ చైర్మన్‌గా నియామక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. అయితే గతంలో అటెండర్ పోస్టుల నియామకాల విషయంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో ఈ సారి వాటిని కూడా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో నింపేందుకు ప్రకటన ఇచ్చారు
అయితే నిబంధనల ప్రకారం ఇది ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు అటెండర్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హతగా నిబంధనలు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం 10వ తరగతి విద్యార్హతగా ప్రకటించారు. ఇదికూడా సాంకేతికంగా ఇబ్బందిరకంగా మారింది. విద్యార్హతలు 10వ తరగతిగా మార్చాలంటూ ప్రభుత్వానికి జిల్లా అధికారులు లేఖ రాశారు. ఈ విషయంలో ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి రాలేదు. దీనికి తోడు జిల్లాలో 19 మార్చి, 2017 నాటికి ఉన్న బ్యాక్‌లాగ్ ఖాళీలన్నింటిని 30 జూన్, 2018 నాటికి భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కానీ జిల్లా స్థాయిలో మాత్రం నోటిఫికేషన్‌నే 28 జూన్ 2018న ఇచ్చారు. ఆ తర్వాత పోస్టుల భర్తీ ప్రకియను తాము సెప్టెంబర్ 2018లోగా పూర్తి చేసుకునేలా అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంలోనూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం ఇప్పటి వరకు రాలేదు. దీంతో అధికారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
కోర్టుకు చేరిన పంచాయితీ
బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ విషయంలో అధికారులు మొదట 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితి అన్నారు. తర్వాత సడలించి 44 ఏళ్లకు పెంచారు. అయితే పెంచిన విషయం గమనించని కొందరు అభ్యర్థులు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలంటూ కోర్టును ఆశ్రయించారు. మరికొందరు దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచాలని కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు విషయాల్లో జిల్లా యంత్రాంగానికి సానుకూల తీర్పు కోర్టు నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయినా ఇతర సమస్యలపైనా మరికొందరు కోర్టులను ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తద్వారా మొత్తం వ్యవహారం పెండింగ్‌లో పడే అవకాశాలే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వ్యవహారం నిరుద్యోగుల పాలిట ఎండమావిలా తయారైంది.
అధికారుల అసహనం
ముఖ్యంగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ విషయంలో అర్బన్ జేసీ దయానంద్ ప్రత్యేక చొరవ చూపారు. మొత్తం ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేసేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు 15 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్యోగులను ఉరుకులుపరుగులు పెట్టించారు. కానీ ఉన్నతాధికారుల నిర్ణయాలు, కోర్టు కేసులతో ప్రతిబం«ధకాలు ఏర్పడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. అయితే ఇప్పటికైనా కోర్టు పంచాయితీ, ఎన్నికల హడావిడి ముగిస్తే ప్రక్రియ వేగంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని జేసీ దయానంద్ అంటున్నారు.
106 పోస్టులు.. 17,169 దరఖాస్తులు
మొత్తం 106 పోస్టులు ఖాళీ ఉండగా 17,169 దరఖాస్తులు అందాయి. ఆన్‌లైన్ ద్వారా మొత్తం 19,432 మంది దరఖాస్తులు చేయగా, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో మాత్రం 17,169దరఖాస్తులు మాత్రమే అందాయి. వీటిని మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు.
కేటగిరీలవారీగా వచ్చిన దరఖాస్తులు..
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 6 ఉండగా 2,489 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 4 పోస్టులు ఉండగా 1400 దరఖాస్తులు.. మొత్తంగా 3,889 దరఖాస్తులు అందాయి.
- టైపిస్ట్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 11 ఉండగా 612 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు ఉండగా 283 దరఖాస్తులు.. మొత్తంగా 895 దరఖాస్తులు అందాయి.
- షరాఫ్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 2 ఉండగా 2,471దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో ఒకటి ఉండగా 1,074 దరఖాస్తులు.. మొత్తంగా 3,545 దరఖాస్తులు అందాయి.
- ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 56 ఉండగా 5,665 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 23 పోస్టులు ఉండగా 3,175 దరఖాస్తులు.. మొత్తం 8,840దరఖాస్తులు అందాయి.
- మొత్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 106 పోస్టులకుగాను ఎస్సీ కేటగిరీలో ఉన్న 75 పోస్టులకు 11,237 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 31 పోస్టులకు 5,932 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తులు 17,169 అందాయి.
Comments
Please login to add a commentAdd a comment