unemplyed
-
114 స్కూళ్లకు మంగళం..?
కరీంనగర్‌ఎడ్యుకేషన్: అంతా ఊహించినట్లే జరుగుతోంది.. పాఠశాలలను హేతుబద్ధీకరణ చేయాలనే ప్రభుత్వం నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. తద్వారా గ్రామీణ పేద పిల్లలకు విద్య అందని ద్రాక్షగా మారనుంది. స్కూళ్లు మూతపడి మిగులుబాటుగా మారే ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళం కానుంది. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ దిశగా కృషి చేయకుండా విద్యార్థులు రావడం లేదన్న సాకుతో రేషనలైజేషన్‌లో పాఠశాలలను మూసి ప్రభుత్వ విద్యకు మంగళం పాడేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలలు కనుమరుగు కానుండగా, ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లోకి, వేరే ప్రభుత్వ శాఖల్లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జిల్లా విద్యాశాఖ అధికారులతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈ నెల 11న డీఈవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ గురించి వివరిస్తూనే ఉన్న ఫలంగా సమాచారాన్ని పంపించాలని కోరడంతో మళ్లీ పాఠశాలల హేతుబద్ధీకరణ అంశం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేస్తూ తక్కువగా ఉన్న పాఠశాలల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉంటాయో.. ఎన్ని మూతపడుతాయో తెలియని గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరుగా ఉత్తర్వులు జారీ అయితే జిల్లాలో 114 పాఠశాలలు మూతబడనున్నాయి. బడిబాట కార్యక్రమం ముగిసేలోగా పక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావించడంతో జూన్ 19లోగా పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయి ఒకే గ్రామంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అదే గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 650 ఉన్నాయి. 37,773 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పదిలోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 60 వరకు ఉన్నట్లు యుడైస్ నివేదికలో వెల్లడయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 20లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు 16 వరకు ఉన్నాయి. 30లోపు విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలు 16 నుంచి 20 వరకు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలే చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేస్తే జిల్లాలో 114 పాఠశాలలు మూతపడుతాయి. యూపీఎస్‌లలో సైతం 30మంది లోపు ఉన్న వాటిని సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని బాలికలు సమీప ఉన్నత పాఠశాలల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపక చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దీంతో బాలికల విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో వేసవి సెలవుల్లో రేషనలైజేషన్ పేరిట చేసిన సంస్కరణల్లో ఇప్పటికే జిల్లాలో 850 మంది ఎస్జీటీలు మిగులుగా ఉండి డీఈఓ ఆధీనంలో ఉండడంతో వారిని జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ సర్దుబాటు చేసి ఈ విద్యా సంవత్సరం మమ అనిపించారు. తాజాగా మళ్లీ 114 స్కూళ్లు మూతపడితే మిగులుబాటుగా ఉండే ఎస్జీటీలను ఎలా సర్దుబాటు చేస్తారో ప్రభుత్వమే తెల్చాల్సి ఉంది. నిరుద్యోగుల ఆశలు ఆడియాశలే... టీచర్ పోస్టు కొట్టాలనుకుంటున్న నిరుద్యోగుల్లో బడుల హేతుబద్ధీకరణ నిర్ణయం నిరాశ వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకొని టీచర్ జాబ్‌కొట్టాలనే టీఆర్టీ అభ్యర్థుల భవిష్యుత్ ప్రశ్నార్థకమైంది. రేషనలేజేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత చాలామంది ఉపాధ్యాయులు మిగులే పరిస్థితి ఉంటుందనే భావన అందరిలో ఉండడంతో టీఆర్టీ అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఉత్తర్వులు అందలేదు... ఇటీవల జరిగిన వీడియో కాన్పరేన్స్లో పాఠశాలల హేతుబద్ధీకరణ విషయంపై చర్చ జరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలు అందాల్సి ఉంది. గతంలో సూచించిన విధంగా జిల్లాలో విద్యార్థుల, పాఠశాలల పరిస్థితిని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అందజేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామనే భరోసాను తల్లిదండ్రులకు కల్పించాల్సి ఉంది. అందుకు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా సహకరిస్తే సాధ్యమవుతుంది. రేషనలైజేషన్ జీవో అందాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – వెంకటేశ్వర్లు, డీఈవో ప్రభుత్వ నిర్ణయం గర్హనీయం సంస్కరణల పేరిట విద్యారంగాన్ని అథోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగం నుంచి తప్పుకునేందుకే తహతహలాడుతోంది. గ్రామీణ పేద విద్యార్థుల కోసం విద్యాహక్కు చట్టంలో ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించాల్సిన ప్రభుత్వం చట్టానికి తూట్లు పొడుస్తోంది. తరగతి గదికో ఉపాధ్యాయుని నియమించి, బోధన, బోధనేతర, పర్యవేక్షణ సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం విద్యార్థులు లేరని సాకుతో బడులను మూసివేయడం మంచి పరిణామం కాదు – గవ్వ వంశీధర్‌రెడ్డి, ఏఐఎస్బీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకం ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ఎస్టీయూ వ్యతిరేకం. విద్యాహక్కు చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. బడుల మూసివేత వల్ల పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకోంది. రేషనలైజేషన్ ప్రక్రియను నిలిపివేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసి ప్రభుత్వ బడులను సంస్కరించాల్సిందిపోయి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా వ్యవహరించడం బాధాకరం. – కటుకం రమేశ్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పేద విద్యార్థులకు పెనుశాపం... పాఠశాలల మూసివేత పేద విద్యార్థులకు పెనుశాపంగా మారనుంది. స్వరాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంగా ఉన్నామని ప్రకటించిన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. తక్షణమే రేషనలైజేషన్ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. – కరివేద మహిపాల్‌రెడ్డి, ఎస్జీటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి -
ఎంతపనాయే కొడుకా..!
బెల్లంపల్లి: కుమారుడికి మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో అమెరికా పంపించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ఆ కుమారుడు సైతం బాగానే చదువుకుంటున్నాడు. సుమారు నాలుగేళ్లుగా అక్కడే విద్యాబోధన చేస్తున్నాడు. త్వరలో మంచి ఉద్యోగం సాధిస్తాడని, ఇక తమ కష్టాలు తీరుతాయని తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. కానీ.. వారి ఆనందం అంతలోనే ఆవిరి అయ్యింది. ఉన్నత చదువుల కోసం అందనంత దూరం వెళ్లి.. అక్కడి నుంచే అటే ఈ లోకాన్నే విడిచాడన్న వార్త వారిని శోక‘సంద్రం’లో ముంచింది. సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లిన ఆ యువకుడు అక్కడే ఈత కొట్టేందుకు సముద్రంలోకి దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన బెల్లంపల్లిలోని అతడి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అయ్యో కొడుకా.. ఎంత పనాయే అంటూ రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరమూ కావడం లేదు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి అశోక్‌నగర్‌బస్తీకి చెందిన రెడ్డి రాజం, మాలతి దంపతుల చిన్న కుమారుడు శ్రావణ్ (27) అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం రిచ్మండ్లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. హైదరాబాద్‌లో బీఫార్మసీ పూర్తి చేసిన శ్రావణ్ అమెరికాలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) చేయడానికి 2014లో వెళ్లాడు. 2016లోనే ఎంఎస్ పూర్తి చేసినా.. డబుల్ ఎంఎస్ కోసం అక్కడే ఉండిపోయాడు. ఈస్టర్ సందర్భంగా ఈనెల 19న (భారత కాలమాన ప్రకారం 20వ తేదీ) స్నేహితులతో కలిసి ఫ్లోరిడా ప్రాంతంలోని డెస్టిన్ బీచ్‌కు వెళ్లాడు. సరదా కోసం సముద్రంలో దిగగా.. అలల వేగానికి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో అక్కడి పోలీసులు శ్రావణ్ గల్లంతైనట్లు ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫోన్‌చేసి శ్రావణ్ చనిపోయినట్లు నిర్ధారించారు. అదే చివరి ఫోన్‌కాల్.. రాజం రెండో కొడుకు రవికుమార్ వరంగల్‌లో ఇరిగేషన్ శాఖలో డీఈగా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె సాత్విక పుట్టినరోజు కావడంతో రాజం, మాలతి మూడురోజుల క్రితం వరంగల్‌కు వెళ్లారు. శ్రావణ్ తన తల్లిదండ్రులతో ఆదివారం ఉదయం ఫోన్లో మాట్లాడాడు. యోగా క్షేమాలు తెలుసుకున్నాడు. కొన్ని గంటల వ్యవధిలోనే శ్రావణ్ విగతజీవి అయ్యాడన్న వార్త విని పించగానే.. వారి శోకానికి అంతులేకుండా పోయింది. శ్రావణ్ మృతిచెందాడన్న వార్తతో అశోక్‌నగర్‌లో తీవ్రవిషాదఛాయలు అలుముకున్నాయి. మూడురోజుల తరువాతే చివరిచూపు శ్రావణ్ మృతదేహం బెల్లంపల్లికి చేరుకోవడానికి మరోమూడు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా లీగల్ వ్యవహారాలు పూర్తయ్యాకే శవాన్ని భారత్‌కు పంపనున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని అక్కడి ఆస్పత్రిలో భద్రపర్చి ఉంచినట్లు సమాచారం. కొడుకు మృతదేహం కోసం ఆతల్లిదండ్రలు, కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. -
అ‘లక్ష’మేలనో?
ఖమ్మం మయూరిసెంటర్: సబ్సిడీ రుణాలు పొంది ఆర్థికంగా బలోపేతం అవుదామని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) నిరుద్యోగులు, పేదలకు నిరాశే ఎదురవుతోంది. వరుస ఎన్నికలతో లోన్లు మంజూరు కాక అలక్ష్యం నెలకొంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ముఖ్యంగా రూ.లక్ష రుణం తీసుకునేందుకు ఎక్కువ యూనిట్లు ఉంటున్న కారణంగా అధికంగా దరఖాస్తు చేసుకుంటుంటారు. ఈసారి మొత్తం యూనిట్లను గతేడాదితో పోలిస్తే.. సగానికి తగ్గించేయడంతో ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత సంవత్సరం జిల్లాకు 1595 స్వయం ఉపాధి పథకం యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా..ఇందులో 900 యూనిట్లు రూ.లక్ష గ్రాంటు ఉన్నవి కావడం విశేషం. ప్రభుత్వం ఈ సంవత్సరం ఆ సంఖ్యను సగానికి తగ్గించి మొత్తం యూనిట్లనే 670తో సరిపెట్టింది. 2018–19లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని ఉపాధి పొందాలని జిల్లాలో 20వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 670 యూనిట్లలో పురుషులకు 447, మహిళలకు 223 యూనిట్లు ఉన్నాయి. అదనంగా వికలాంగులకు మరో 34 యూనిట్లను కేటాయించారు. ఇందులో రూ.లక్ష లోను అందే యూనిట్లు 318 ఉన్నాయి. వీటి ద్వారా లబ్ధి పొందాలని ఎక్కువ మంది చూస్తున్నారు. మొత్తం 20వేల దరఖాస్తుల వరకు రాగా..వీటిల్లో రూ.లక్ష, ఆలోపు యూనిట్లకే ఎక్కువ వచ్చాయి. అయితే..ఈ సారి యూనిట్లు బాగా తగ్గిపోవడం, నిధులు మంజూరు కాకపోవడం లబ్ధిదారులకు ఇబ్బందిగా మారింది. ఇంకా రూ.2 లక్షల యూనిట్లు 255, రూ.7లక్షల యూనిట్లు 97 ఉన్నాయి. గత సంవత్సరం జిల్లాకు 1595 యూనిట్లను లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం 670 యూనిట్లను మాత్రమే కేటాయించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మొత్తాన్ని మున్సిపాలిటీలకు, మండలాలకు ఎలా కేటాయిస్తారని చర్చించుకుంటున్నారు. మార్గదర్శకాలు లేక, కోడ్ తొలగక చిక్కులు.. సీఎం ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ డెవలెప్ ప్రోగ్రాం(సీఎంఈడీపీ) పథకం ద్వారా సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ మార్గదర్శకాలు రాలేదు. ఈ పథకం ద్వారా రూ.12 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించేందుకు నిర్ణయించింది. బ్యాంక్ లింకేజీ ద్వారా ఇచ్చే ఈ లోన్లకు సంబంధించి జిల్లాకు మొత్తం 93 యూనిట్లు కేటాయించిన ప్రభుత్వం రూ.12 లక్షల యూనిట్లు 47, రూ.25 లక్షల యూనిట్లు 31, రూ.50 లక్షల యూనిట్లు 15 కేటాయించింది. అయితే ఈ యూనిట్లకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో యూనిట్ల ఏర్పాటు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలో తెలియక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. తక్షణమే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తే దరఖాస్తులు చేసుకునే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టులోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. 2018 డిసెంబర్ వరకు అధికారులు జిల్లాలో పథకానికి అర్హులైన వారిని గుర్తించి జిల్లాకు కేటాయించిన యూనిట్ల లోబడి ఎంపిక చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో వరుస ఎన్నికలు రావడంతో ఇప్పటి వరకు పథకం ముందుకు కదలట్లేదు. మొదటగా శాసనసభ ఎన్నికల కోడ్ రావడం, డిసెంబర్ వరకు ఆ ఎన్నికల్లో అధికారులు నిమగ్నమవడం, అనంతరం పంచాయతీ ఎన్నికల కోడ్ కూయడంతో పథకానికి బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా పథకం ముందుకు కదులుతుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. -
అయోమయంలో డీఎస్సీ అభ్యర్థులు
డీఎస్సీ అభ్యర్థుల్లో అలజడి..రోజురోజుకు మారుతున్న షెడ్యూల్‌తో అనుమానాలు...మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు వాయిదాల పర్వం సాగిస్తున్న నేపథ్యంలో అసలు డీఎస్సీ నిర్వహిస్తారా...లేక ఏదైనా సాకు చూపి ఎత్తేస్తారా అనేసందేహాలు వస్తున్నాయి. ఉపాధ్యాయ అభ్యర్థులు కూడా ఒకింత అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సాక్షి కడప: జిల్లాలో డీఎస్సీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి నేటి వరకు పరీక్ష విధానంపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పరీక్ష విధానం ఆన్లైన్లో ఉంటుందా...ఆఫ్‌లైన్‌లో ఉంటుందా...అనేది ప్రభుత్వం నిర్ధారించలేదు. ఆన్లైన్లోనే ఉంటుందని ముందు ప్రకటించారు. ఈ విధానం వల్ల అభ్యర్థులకు సంబంధించి పేపర్ కొందరికి సులువుగా వస్తే, మరికొందరికి కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఆఫ్‌లైన్‌లో అయితే అందరికీ ఒకే విధానంలో పరీక్ష ఉంటుంది. కష్టమైనా, సులువైనా ఒకేలా పేపర్ ఉండడం సబబని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ విధానం ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది డీఎస్సీ అభ్యర్థులు దీనివల్ల తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని...అలా కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రిని కోరారు.దీంతో ప్రభుత్వం సందిగ్దంలో పడింది. అయితే పరీక్షల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో పరీక్షా విధానాన్ని కూడా వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. పరీక్ష షెడ్యూల్లో మార్పులు: జిల్లాలో డీఎస్సీకి సంబంధించి భారీగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 198 పోస్టులకుగాను 30,246 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ ప్రకటన విడుదల అనంతరం పరీక్షల తేదీలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. డిసెంబరు 6వ తేదీ నుంచి 2019 జనవరి 2వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. సమయం చాలదని....గడువు పెంచాలని అభ్యర్థల నుంచి వచ్చిన నేపథ్యంలో షెడ్యూల్‌ను వాయిదా వేసి బుధవారం మళ్లీ ప్రకటించారు. అయితే షెడ్యూల్లో మార్పులు, చేర్పుల నేపథ్యంలో డిసెంబరు 19వ తేదీ నుంచి పరీక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 6వ తేదీలోగా పరీక్షల ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల్లో అలజడి వెంటాడుతోంది. మొదట్లో దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపడంలో సర్వర్ సమస్యలు వెంటాడాయి. తర్వాత పరీక్షల ప్రిపరేషన్‌కు గడువు తక్కువ ఉండడంతో ఆందోళనకు గురయ్యారు.. భారీగా దరఖాస్తులు: జిల్లాలో డీఎస్సీకి సంబంధించి భారీగా దరఖాస్తులు వచ్చాయి. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రాలేదని పలువురు పేర్కొంటున్నారు. కేవలం 198 పోస్టులకుగాను 30 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయంటే ఉపాధ్యాయ పోస్టులకు ఏ మేరకు పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా డీఎస్సీ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం రోజుకో ప్రకటన జారీ చేస్తుండడం పట్ల నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. -
దరఖాస్తుల వెల్లువ
ఆదిలాబాద్‌రూరల్: వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు అంతంత మాత్రంగానే జారీ కావడంతో స్వయం ఉపాధిపై యువత మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వివిధ కార్పొరేషన్ల రాయితీ రుణాల కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ రాయితీ రుణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొదటగా ఈ నెల 7 వరకు ముగిసిన గడువును రెండవసారి 10వ తేదీకి పెంచారు. అనంతరం నవంబర్ 2 వరకు ప్రభుత్వం గడువును పొడిగించింది. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని 18 మండలాలకు కేటాయించిన రుణ యూనిట్లకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. సమాజంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఎస్సీలకు రాయితీ రుణాలను అందించడానికి ప్రతి ఏటా ప్రభుత్వం రుణ ప్రణాళిక విడుదల చేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక విడుదల చేసి వాటికి కావాల్సిన బడ్జెట్‌ను కూడా తయారు చేసింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి అర్హత గల ఎస్సీ లబ్ధిదారుల నుంచి ఆగస్టులో దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. జీవనోపాధికే ప్రాధాన్యం.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించడానికి రాయితీ యూనిట్లను ప్రభుత్వం అందిస్తోంది. యూనిట్ల విలువలను బట్టీ రాయితీ కల్పిస్తోంది. రూ.50వేలు విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ, రూ.లక్ష విలువైన యూనిట్‌కు 80 శాతం, రూ.2లక్షలకు 70 శాతం, రూ.3లక్షలకు 60 శాతం, రూ.5 లక్షలకు 50 శాతం రాయితీని అందిస్తోంది. కిరాణం, మొబైల్ దుకాణాలు, కూరగాయల వ్యాపారం, వీడియో, ఫొటోగ్రఫీ, చెప్పుల దుకాణం, ఫ్యాన్సీ, గాజుల వ్యాపారం, కొబ్బరి బోండాలు, చికెన్, మటన్ దుకాణం, సప్లయ్ సామగ్రి, పాన్‌షాప్, ఆటో మొబైల్, మెడికల్ షాపు, హోటల్, పాల వ్యాపారం, ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్లు, చేపల పెంపకం, పండ్ల వ్యాపారం, మెకానిక్ తదితర యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ రుణాలు ఇస్తోంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, తదితర వాటికి కూడా రాయితీలను అందిస్తారు యూనిట్ల మార్పునకు అవకాశం ముందుగా దరఖాస్తు చేసిన దానిలో నమోదు చేసిన యూనిట్ మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎన్నికల దృష్ట్యా ఎంపీడీవోల దగ్గర లాగిన్‌లో మార్చుకోవడానికి అవకాశం ఉండదు. దరఖాస్తు దారులు సమీపంలోని మీ సేవ కేంద్రాల ద్వారా మార్చుకోవచ్చు. ఈ అవకాశం కూడా వచ్చే నెల 2వ తేదీ ఉంది. యూనిట్లు.. బడ్జెట్ జిల్లాలోని 18 మండలాలకు స్వయం ఉపాధి రుణాల అందించేందుకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆయా మండలాలకు 631 యూనిట్లను కేటాయించారు. వీటికి రూ.19 కోట్ల 40లక్షల 44వేలు అంచనా వేశారు. వీటిలో రూ.50వేలలోపు 276 యూనిట్లు కాగా వీటికి 3.80లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.లక్షలోపు 117 యూనిట్లు ఉండగా 11.70 లక్షలు, రూ.2లక్షల 86 యూనిట్లు ఉండగా దీనికి రూ.17.20 లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.7లక్షల యూనిట్లు 34 ఉండగా రూ.23.80 లక్షలు కేటాయించారు. రూ.12లక్షల యూనిట్లు 13 ఉండగా రూ.15.60 లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.25లక్షల యూనిట్లు 9 ఉండగా రూ.22.50 లక్షలు, రూ.50లక్షల యూనిట్లు 5 ఉండగా రూ. 25లక్షలు అందజేయనున్నారు. ఓనర్ కం డ్రైవర్ 28 యూనిట్లు ఉండగా రూ.22.40 లక్షలు ఖర్చు చేయనున్నారు. టూ విల్లర్ 18 యూనిట్లు ఉండగా రూ.18 లక్షలు ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ అనుబంధ యూనిట్లు 38 ఉండగా వీరికి రూ.15.20 లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం 6,740 దరఖాస్తులు వచ్చిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.. ఎస్సీ రాయితీ రుణాల కోసం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నాం. వారికి అనువుగా ఉన్న యూనిట్లను ఎంపిక చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది వరకే దరఖాస్తు చేసిన వారు తమ యూనిట్లను, ఇతర వాటిని మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశాన్ని ప్రభుత్వం అనుమతినిచ్చింది. – శంకర్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, ఆదిలాబాద్ -
బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి మోక్షమెప్పుడో..!
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ కాకుండా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఉత్సాహంగా పనిచేసిన అర్బన్ జిల్లా యంత్రాంగానికి కోర్టు కళ్లెం వేసింది. కొన్ని స్థాయిల్లో అధికారులు తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణంగా మారాయి. న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు నియామకాల విషయంలో అడుగు ముందుకు పడే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రం ఉద్యోగాల భర్తీ కోసం కొండకెదురు చూసినట్లుగా చూస్తున్నారు. అధికారుల తప్పిదాలు ? బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో మినిస్టీరియల్ సర్వీస్ నిబంధనలు తెలియక కొన్ని పొరపాట్లు చేశారు. ముఖ్యంగా బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకాల నిబంధనల ప్రకారం అటెండర్(ఆఫీస్ సబార్డినేట్) పోస్టులు సం బంధిత శాఖ ఉన్నతాధికారులే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్–4 ఉద్యోగాలుగా ఉండే జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో పోస్టులు కలెక్టర్ చైర్మన్‌గా నియామక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. అయితే గతంలో అటెండర్ పోస్టుల నియామకాల విషయంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో ఈ సారి వాటిని కూడా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో నింపేందుకు ప్రకటన ఇచ్చారు అయితే నిబంధనల ప్రకారం ఇది ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు అటెండర్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హతగా నిబంధనలు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం 10వ తరగతి విద్యార్హతగా ప్రకటించారు. ఇదికూడా సాంకేతికంగా ఇబ్బందిరకంగా మారింది. విద్యార్హతలు 10వ తరగతిగా మార్చాలంటూ ప్రభుత్వానికి జిల్లా అధికారులు లేఖ రాశారు. ఈ విషయంలో ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి రాలేదు. దీనికి తోడు జిల్లాలో 19 మార్చి, 2017 నాటికి ఉన్న బ్యాక్లాగ్ ఖాళీలన్నింటిని 30 జూన్, 2018 నాటికి భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కానీ జిల్లా స్థాయిలో మాత్రం నోటిఫికేషన్‌నే 28 జూన్ 2018న ఇచ్చారు. ఆ తర్వాత పోస్టుల భర్తీ ప్రకియను తాము సెప్టెంబర్ 2018లోగా పూర్తి చేసుకునేలా అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంలోనూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం ఇప్పటి వరకు రాలేదు. దీంతో అధికారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కోర్టుకు చేరిన పంచాయితీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో అధికారులు మొదట 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితి అన్నారు. తర్వాత సడలించి 44 ఏళ్లకు పెంచారు. అయితే పెంచిన విషయం గమనించని కొందరు అభ్యర్థులు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలంటూ కోర్టును ఆశ్రయించారు. మరికొందరు దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచాలని కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు విషయాల్లో జిల్లా యంత్రాంగానికి సానుకూల తీర్పు కోర్టు నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయినా ఇతర సమస్యలపైనా మరికొందరు కోర్టులను ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తద్వారా మొత్తం వ్యవహారం పెండింగ్‌లో పడే అవకాశాలే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వ్యవహారం నిరుద్యోగుల పాలిట ఎండమావిలా తయారైంది. అధికారుల అసహనం ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో అర్బన్ జేసీ దయానంద్ ప్రత్యేక చొరవ చూపారు. మొత్తం ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేసేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు 15 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్యోగులను ఉరుకులుపరుగులు పెట్టించారు. కానీ ఉన్నతాధికారుల నిర్ణయాలు, కోర్టు కేసులతో ప్రతిబం«ధకాలు ఏర్పడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. అయితే ఇప్పటికైనా కోర్టు పంచాయితీ, ఎన్నికల హడావిడి ముగిస్తే ప్రక్రియ వేగంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని జేసీ దయానంద్ అంటున్నారు. 106 పోస్టులు.. 17,169 దరఖాస్తులు మొత్తం 106 పోస్టులు ఖాళీ ఉండగా 17,169 దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ ద్వారా మొత్తం 19,432 మంది దరఖాస్తులు చేయగా, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో మాత్రం 17,169దరఖాస్తులు మాత్రమే అందాయి. వీటిని మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. కేటగిరీలవారీగా వచ్చిన దరఖాస్తులు.. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 6 ఉండగా 2,489 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 4 పోస్టులు ఉండగా 1400 దరఖాస్తులు.. మొత్తంగా 3,889 దరఖాస్తులు అందాయి. టైపిస్ట్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 11 ఉండగా 612 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు ఉండగా 283 దరఖాస్తులు.. మొత్తంగా 895 దరఖాస్తులు అందాయి. షరాఫ్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 2 ఉండగా 2,471దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో ఒకటి ఉండగా 1,074 దరఖాస్తులు.. మొత్తంగా 3,545 దరఖాస్తులు అందాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో 56 ఉండగా 5,665 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 23 పోస్టులు ఉండగా 3,175 దరఖాస్తులు.. మొత్తం 8,840దరఖాస్తులు అందాయి. మొత్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 106 పోస్టులకుగాను ఎస్సీ కేటగిరీలో ఉన్న 75 పోస్టులకు 11,237 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 31 పోస్టులకు 5,932 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తులు 17,169 అందాయి. -
కొలువుల.. కోలాహలం
నల్లగొండ : జిల్లాలో పంచాయతీ కొలువుల కోలాహలం మొదలైంది. 661 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. పో స్టుల విషయంలో స్థానికులకే అవకాశం కల్పించడంతో జిల్లాలో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. తమకే ఉద్యోగాలు వస్తాయన్న ఆనందం వారిలో కనిపిస్తోంది ‘‘దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామం అభివృద్ధి చెందాలి, గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు’’ అన్న నానుడికి అనుగుణంగా సర్కార్ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. ఇన్నాళ్లూ పంచాయతీల్లో అధికారులు లేక పాలన పడకేసింది. ఒక్కొక్కరు రెండునుంచి నాలుగు పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. దీంతో వారు విధుల ఒత్తిడితోపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపడుతుండడంతో పంచాయతీల్లో పాలన సజావుగా సాగే అవకాశాలు కనిపస్తున్నాయి.కొత్తగా జిల్లాకు మంజూరైన కొలువులు రాష్ట్రప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి పూనుకుంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేíసన విషయం తెలిసిందే. జిల్లాకు 661 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసింది. వీటిని శాఖ పరంగా భర్తీ చేస్తుండడంతో త్వరితగతిన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం పంచాయతీలు 844 జిల్లాలో మొత్తం 844 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో పాత గ్రామపంచాయతీలు 502 ఉన్నాయి.ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా తం డాలను, గూడాలను పంచాయతీలుగా చేసింది. దీంతో కొత్తగా 349 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఉన్న కార్యదర్శులు 185మందేజిల్లాలో కొత్త, పాత కలిపి మొత్తం గ్రామ పంచాయతీలు 844 ఉండగా, కార్యదర్శులు 185 మంది మాత్రమే ఉన్నారు. దీంతో గ్రామాల్లో పాలన గాడి తప్పింది. ఉన్న వారి విధులు పంచడంతో ఒక్కొక్కరికి రెండు నుంచి నాలుగు పంచాయతీల అదనపు బాధ్యతలు అప్పగించారు. వారు రోజుకో పంచాయతీకి వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ ఏ పంచాయతీపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. అటు సమస్యలు పరిష్కారం కాక, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు కార్యదర్శులు పనిభారం ఎక్కువై సతమతమయ్యేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పోస్టులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు కొత్తగా 661 పోస్టులను మంజూరు చేసింది. పాత సిబ్బంది 185 మందితోపాటు కొత్తగా 661 మంది వస్తే 846 మంది అవుతారు. అయితే మనకు ఉన్న ఉన్నది 844 పంచాయతీలు. అంటే ఇద్దరు మిగులుతున్నారు. వీరిలో ఒకరు పదోన్నతిపై యాదాద్రి జిల్లాకు వెళ్తుండగా, మరొకరు చిట్యాల మున్సిపాలిటీకి వెళ్తారు. దీంతో 844 మంది అవుతారు. ప్రతి గ్రామానికీ ఒక కార్యదర్శి ఉంటారు. కొత్త పోస్టులు భర్తీ అయితే ఇబ్బందులు తొలగడంతోపాటు పంచాయతీ పాలన పరుగులు పెట్టే అవకాశం ఉంది. -
ఎంత చదివినా.. ఉద్యోగం రాలేదు..
ఇద్దరూ చదువుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా జీవితం బాగు పడుతుందనుకున్నారు.. ఎంత శ్రమించినా ఒకరికి కూడా రాలేదు.. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. రాయచోటి టౌన్(వైఎస్సార్ కడప) : ‘నేను ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదు. నాకు సొంత జీవితం లేదు. అలాంటప్పుడు నేను చచ్చినా.. బతికినా ఒక్కటే. అందుకే నాకు నేను ఆత్మహత్య చేసుకొంటున్నాను’ అని రాయచోటి పట్టణంలో నివాసం ఉంటున్న కుసుమ అనే నిరుద్యోగ మహిళ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. నా చావుతో నా తల్లిదండ్రులు, భర్తకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకొంటున్నానంటూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. రాయచోటి పట్టణ పరిధిలోని బోస్ నగర్లో నివాసం ఉండే మురళీకృష్ణ భార్య కుసుమ (27) ఆదివారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంబేపల్లె మండలం బొగ్గలవారిపల్లెకు చెందిన వెంకటరమణ, నాగ రత్నమ్మకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు మురళీకృష్ణ, రెండో కుమారుడు శివ. మురళీకృష్ణ ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశాడు. ఆయనకు అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన కుసుమతో వివాహం జరిగింది. ఆమె కూడా బీకాం పూర్తి చేసింది. వీరు కొన్నేళ్లు అన్యోన్యంగా జీవనం సాగించారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ.. ఇద్దరూ కలసి రాయచోటి పట్టణానికి వచ్చి ప్రైవేట్ సంస్థలలో పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మురళీకృష్ణ ముందుగా ఓ విద్యాసంస్థలో పని చేస్తుండే వాడు. వేతనం చాలకపోవడంతో మరో విద్యాసంస్థలో చేరాడు. ఆమె కొన్నాళ్లు ప్రైవేట్ సంస్థలలో పని చేసింది. ఇలా తక్కువ వచ్చే జీతాలతో ఎలా కాపురం సాగించాలంటూ బ్యాంక్ కోచింగ్ చేస్తూనే.. ఆర్ఆర్బీకి సిద్ధం అవుతోంది. దీనికోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంటిలోనే ఉంటూ ఎంతో శ్రద్ధగా చదివేది. ఇలా గంటల కొద్దీ చదివితే ఎలా అంటూ భర్త అనేక సార్లు వారించినా వినేది కాదు. ఎలాగైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే తపనతో మరింత కఠోరంగా శ్రమించేది. నిర్వేదానికి లోనై.. గత పోటీ పరీక్షలలో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయింది. తీవ్ర నిర్వేదానికి లోనైంది. ప్రతి చిన్న విషయానికి కోపగించుకొనేది. ఇలా ఉండటంతో పది రోజుల క్రితం అనంతపురం జిల్లాలోని పుట్టింటికి తీసుకెళ్లి మానసిక వైద్యుడితో చికిత్స చేయించుకొని వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన భర్తతో కొంత వాగ్విదానికి దిగింది. చాలా పొద్దుపోయే వరకు ఇద్దరూ గొడవ పడటంతో.. నీతో వాదించలేనంటూ మురళీకృష్ణ పక్క దగిలోకి వెళ్లి పడుకొన్నాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. ఇక పడుకొంటుందిలే అనుకొని నిద్రపోయాడు. ఈ సమయంలో ఆమె తనకు తానుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. తెల్లవారుజామున నిద్ర లేచి చూసే సరికి ఫ్యాన్‌కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే బంధువులకు విషయాన్ని తెలిపాడు. అంతలోనే పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆస్పత్రిలో అధికారులు ఎవరూ లేకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. మధ్యాహ్నం సమయానికి కుసుమ పుట్టింటి వారు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే అల్లుడు మురళీకృష్ణ తీవ్ర నిర్వేదంలో రోదిస్తుండగా వారు ఆయన వద్దకు చేరుకున్నారు. ‘చాలా మంచి వాడివని, నా కూతురికి దొరికిన దేవుడవని సంతోషించాం కదా నాయనా.. ఇలా ఎందుకు జరిగింది’ అంటూ రోదించారు. వారు మురళీకృష్ణను పట్టుకొని బోరున విలపించారు. -
ప్రభుత్వం మెడలు వంచుతం!
కరీంనగర్/టవర్‌సర్కిల్: నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరు చేపట్టి కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు సాధించుకునేందుకు నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం అంటూ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై, ప్రభుత్వం వైఖరిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగడట్టాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ గర్జన సభకు ఆయ న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయకుండా పూటకో మాట మాట్లాడుతూ కాలం వెల్లదీసి, ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారనే సంకేతాలి వ్వడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లక్ష ఉద్యోగాలతోపాటు నాలుగేళ్లలో పదవీ విరమణ పొందిన మరో 50 వేల ఉద్యోగాలతో కలిపి మొత్తం లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతకాని వ్యవస్థలా తయారైందని పేరుకే పబ్లిక్ కమిషన్‌గా ఉందని, నియామకాల ఊసేలేదని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 12 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా, 19 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టు ద్వారా రద్దయ్యాయని తెలిపారు. టీపీఎస్సీ కేవలం లక్షల వేతనాలు పొందే వ్యవస్థగా మారిందని ఆరోపించారు. లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు లక్ష ఉద్యోగాలు భర్తీచేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. నిధులు, నీళ్లు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఏమిచ్చారని ప్రశ్నించారు. రూ.3 లక్షల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. నాలుగున్నరేళ్లలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, నిధుల కేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టులకే రీ డిజైనింగ్ చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టి ప్రాజెక్టులు ఏమీ లేవని అన్నారు. ముందస్తు ఎన్నికల పేరిట ప్రజలను మరోమారు మోసం చేయడానికే సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సొంత ఎజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు ఒంటి చెత్తో అధికారంలోకి తెచ్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటో పెట్టుకోవడానికి జంకుతున్న కాంగ్రెస్ నేతలు.. సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకుని.. చంద్రబాబు బొమ్మ పెట్టుకొని ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన టీఆర్ఎస్ నేతలు.. మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అద్యక్షుడు సంతోష్ ఆద్వర్యంలో పలువురు యువకులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ విగ్రహంతో ర్యాలీ.. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహంతో వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి స్వాగతం పలికి ప్రతిమ క్రాసింగ్ నుంచి కలెక్టరేట్ వరకు డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభాస్థలి స్టేజీపై ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభా ప్రారంభానికి ముందు నుంచే సాంస్కృతిక బృందం కళాకారులతో దివంగత వైఎస్సార్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరిస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాడిన పాటలు సభికులను అలరించాయి. నిరుద్యోగ గర్జనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్లకుమార్‌రెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు కట్ట శివ, పి.రాము, పి.గోవర్ధన్‌శాస్త్రి, సుధీర్, శ్రీనివాస్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సందమల్ల గణేష్, మహిళా విభాగం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, మహిళా విభా గం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు మోకెనపెల్లి రాజమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుంటక సంప త్, కరీంనగర్ నగర అధ్యక్షుడు ఇంజినీర్ సాన రాజన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఎండీ షాహెన్షా, కరీంనగర్ జిల్లా కార్యదర్శులు దీటి సుధాకర్, కేతిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సోషల్ మీడి యా ఇన్చార్జి ఎండీ వలీయోద్దీన్ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని గద్దె దించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి చెప్పేదొకటి, చేసేదొకటిలా ఉంది. మంత్రి వర్గంలో మహిళలకు స్థానం లేదు. దళిత గిరిజనులకు వాగ్దానాలే తప్ప ఆచరణలో చేసిందేమీ లేదు. –సంజీవరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరుద్యోగులకు బాసటగా నిలుద్దాం నామమాత్రపు నోటిఫికేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు బాసటగా నిలుద్దాం. నాలుగేళ్లుగా నెరవేర్చని హామీలను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. – బెజ్జంకి అనిల్‌కుమార్,వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి -
సేవ ముసుగులో కుచ్చుటోపి
కరీంనగర్ క్రైం: కేసీఆర్ సేవాదళం స్వచ్ఛందసంస్థ పేరిట సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుని, పలువురికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కట్కోజుల రమేశ్‌చారితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ కమిషనరేట్‌లో బుధవారం సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌కు చెందిన కట్కోజుల రమేశ్‌చారి ఇంటర్‌వరకు చదువుకున్నాడు. పీజీ చేశానని చెప్పుకుంటూ నకిలీ సర్టిఫికెట్లతో చలామణి అయ్యాడు. మూడేళ్ల క్రితం కేసీఆర్ సేవాదళం పేరుతో ఉన్న స్వచ్ఛంద సంస్థ లో చేరాడు. దానికి ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటూ పలు సామాజిక సేవలు చేస్తున్నట్లు ఫొటోలు దిగి.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్నాడు. తనకు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించుకొచ్చాడు. ఇలా మూడేళ్లలో కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలలో సుమారు 40మంది నుంచి రూ.85 లక్షలు వసూలు చేశాడు. వారిని నమ్మించడానికి చెక్కులు, ప్రామీసరి నోట్లు రాసిచ్చేవాడు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని... జయశంకర్ భూపాపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమెలపల్లి గ్రామానికి చెందిన సిద్దిజు రమేశ్‌చారిని ఏజెంటుగా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు వçసూలు చేసి ఇద్దరూ పంచుకున్నారు. అదే విధంగా నాంపెల్లి రాజ్‌కుమార్ ఐఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని రమేశ్‌చారితో కలిసి మోసాలకు పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి రూ.6 లక్షలు వసూలు చేసి ఇద్దరు పంచుకున్నారు. చొప్పదండి మండలం వెదురుగట్ల గ్రామానికి చెందిన అమరిశెట్టి రామచంద్రం రమేశ్‌చారికి రూ.12 లక్షలు వసూలు చేసిఇచ్చి, రూ.2లక్షలు కమీషన్‌గా తీసుకున్నాడు. జగిత్యాలకు చెందిన మహ్మద్ జునైద్ రమేశ్‌చారితో కలిసి రూ.10లక్షల వరకు నిరుద్యో గుల నుంచి వసూలు చేశాడు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన అంజనేయులుతో కలిసి రూ.4.50 లక్షలు వసూలు చేశాడు. వీటిలో అంజనేయులు రూ.3లక్షలు తీసుకున్నాడు. హుస్నాబాద్‌కు చెందిన నూనే శ్రీనివాస్ రూ. 4.80లక్షలు వసూలు చేసి రూ.2లక్షలు కమీషన్‌గా తీసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్ నిరుద్యోగల నుంచి రూ. 25 లక్షలు వసూలు చేసి రమేశ్‌చారికి ఇచ్చాడు. ప్రస్తుతం రామచంద్రం, జునైద్, అంజనేయులు, నూనే శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్ పరారీలో ఉన్నారు. తొమ్మిది కేసులు నమోదు కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో సుమారు 40 మంది వరకూ బాధితులు ఉండగా కరీంనగర్లో 7, హుస్నాబాద్‌లో ఒకటి, వరంగల్‌లో ఒక కేసు నమోదైంది. మరికొంత మంది బాధితులు బయటకు వస్తే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని సీపీ వెల్లడించారు. పక్కా సమాచారంతో పట్టివేత కొంతకాలంగా రమేశ్‌చారిపై వరంగల్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం సాగోతోంది. బాధితులు సైతం ఒక్కరొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్లో పలుకేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన టాస్క్‌ఫోర్స్, చొప్పదండి పోలీసులు రమేశ్‌చారి కదిలికలపై నిఘా పెట్టారు. బుధవారం వేకువజామున చొప్పదండికి రాగా పక్కాగా సమాచారంతో రమేశ్‌తో పాటు సిద్జోజు రమేశ్‌చారి, నాంపల్లి రాజ్‌కుమార్‌ను పట్టుకున్నారు. వారి నుంచి పలు ఖాళీ ప్రామిసరీ నోట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని , నిందితులను రిమాండ్ చేశారు. మోసగాళ్లను నమ్మొద్దు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అటెండర్‌నుంచి ఉన్నతపోస్టు వరకు ఎవరిని నియమించాలన్నా ఓ పద్ధతి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగులను నియమించుకుంటారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉంది. – కమలాసన్‌రెడ్డి, సీపీ, కరీంనగర్ -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
కామారెడ్డి టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసగిస్తూ, ప్రజావ్యతిరేఖ విధానాలతో పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గంజువర్తక సంఘంలో జరిగిన సీపీఐ జిల్లా ముఖ్య కార్యకర్తల జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఎం నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అంటూ చస్తున్న భారత్‌గా తయారు చేస్తున్నారని ఆరోపించారు. కూడు, గుడ్డ, నీడ, పేదల హక్కు అని, కానీ దేశంలో ఓటు హక్కు మాత్రమే అమలవుతుందని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదన్నారు. నల్లధనం అంతం చేస్తామని చెప్పి అవీనీతి ప్రభుత్వంగా కేంద్రం మారిందన్నారు. దళితులు, ముస్లింలపై దాడులు అగడం లేదని ఆరోపించారు. నిరుద్యోగుల కోసం 2కోట్ల ఉద్యోగాలు, 10లక్షలకోట్ల క్రాఫ్ లోన్స్ హామీ ఎమైందన్నారు. నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మోడి ప్రభుత్వాన్ని మించి మాటల గారడి చేస్తుందన్నారు. 1200 ఆత్మబలిదాన వల్ల తెలంగాణ వస్తే వాటి ఫలితాలు అనుభవిస్తుంది కేసీఆర్ కుటుంభం అనుభవిస్తుందన్నారు. ఎన్నికల ముందు లక్షా 30వేల ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి కేవలం 30వేల ఉద్యోగాలు మాత్రమే వేయడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ. 38,500 కోట్ల అంచనా వేసి 46వేల కోట్లు ఖర్చు చేసి, ఇంకా నిధులు కావాలని ప్రభుత్వం కోరడంపై మండి పడ్డారు. ఒక లక్షా 80వేల కోట్ల అప్పు చేసి ప్రజల్ని మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుందని, అప్పులు తెలంగాణ అని విమర్శించారు. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చిన్నప్పుడే తెలంగాణ ప్రజల్ని మోసగించడం ప్రారంభమైందన్నారు. ఉద్యోగాలులేవు, నీళ్లు రావు, విద్యా, వైద్యం లేదు ఇక తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఓటు రాజకీయం పాల్పడుతున్నారన్నారు. భూప్రక్షాలతో రెవెన్యూ శాఖ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. రైతు బందు పథకం కాదని, ఉన్నోడికి కోసం పెట్టిన పథకం అన్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకతపై పోరాటాలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. పల్లె పల్లెకు, ప్రజల మద్యకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. సీపీఐ పెదోళ్ల కడుపు విచారింటే పార్టీ అన్నారు. ప్రజా సమస్యలపై సమరం సాగిస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు కశ్వపద్మ, జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహరెడ్డి, నాయకులు దశరత్, బాలరాజు, దుబాసిరాములు, సుదీర్, పృధ్విరాజ్, గణేష్, భూదవ్వ, రాజమ్మ, నర్సింలు, లింగం, రాజగౌడ్, రాజశేకర్ తదితరులు పాల్గొన్నారు. -
దా‘రుణం’..!
కార్పొరేషన్ రుణాలు అందని ద్రాక్షగా మారాయి. లోన్లు తీసుకుని స్వయం ఉపాధి పొందొచ్చని ఆశించిన నిరుద్యోగులకు ఏటా నిరాశే ఎదురవుతోంది. దరఖాస్తు చేసుకుని ఏళ్లుగడుస్తున్నా మొండిచెయ్యే మిగులుతోంది. ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ విడుదల చేసినా లబ్ధిదారులకు అందించడంలో అధికారులు, బ్యాంకర్లు విఫలమవుతున్నారు. దీంతో వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయడం తప్పడంలేదు. దురాజ్‌పల్లి (సూర్యాపేట) : నిరుద్యోగ యువత, కుల, చేతివృత్తిదారులు, చిరువ్యాపారులకు ఆర్థి కంగా చేయూతనందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ప్రభుత్వం రుణాలు మంజూరు చే స్తోంది. 50శాతం నుంచి 80శాతం వరకు సబ్సి డీపై ఈ లోన్లు అందజేస్తోంది. గతంలో 20 శాతం నుంచి 50 శాతం వరకే ఉన్న సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం 80 శాతం వరకు పెంచింది. దీంతో కార్పొరేషన్ రుణాల కోసం యువకులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తి దారులు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. 2015–16లో దరఖాస్తులు చేసుకొని ఎంపికైన లబ్ధిదారుల్లో కొంత మందికి నేటికీ రుణాలు అందలేదు. ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ విడుదల చేసినా పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు, బ్యాం కర్లు.. లబ్ధిదారులకు అందించడంలో విఫలం అవుతున్నారు. దీంతో లబ్ధిదారులు సంబంధిత శాఖ, బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 254మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సి డీ విడుదల చేయగా ఇప్పటి వరకు కేవలం 157 మందికి మాత్రమే రుణాలు అందించగలిగారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 161మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయగా 83 మందికి మాత్రమే పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,770మంది లబ్ధిదారులకు సబ్సిడీ విడుదల కాగా 1,629 మందికి మాత్రమే ఇచ్చారు. 2015–16లో ఇంకా 123 మందికి... బీసీ కార్పొరేషన్ రుణాలకు 2015–16లో 5,216 మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ, ఇంటర్వ్యూ, గ్రామసభల ద్వారా 552 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ 552 మంది లబ్ధిదారులకు రూ.49,86,60,000 సబ్సిడీ అందించాల్సి ఉండగా ప్రభుత్వం 254 మందికి రూ.196.93 లక్షల సబ్సిడీని అందించాల్సి ఉండగా 157 మందికి రూ.124 లక్షలు అందించారు. ఇంకా 123 మందికి సుమారు రూ. 72 లక్షల సబ్సిడీని అందించాల్సి ఉంది. అయితే దరఖాస్తులు చేసుకున్న మూడు సంవత్సరాలకు గాను ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేస్తే అందించడంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులు విఫలం అవుతున్నారు. బ్యాంకర్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. అదే విధంగా ఇతర ఖాతాల్లో సబ్సిడీ జమ అయినట్లుగా సంబంధిత అధికారులకు 16 ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2016–17, 2017–18లో దరఖాస్తులే ఆహ్వానించలేదు. గిరిజన సంక్షేమశాఖలోనూ అదే పరిస్థితి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరానికి 161 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకు సబ్సిడీని విడుదల చేసింది. అయితే ఇందులో 161 మందికి రూ. 165 లక్షల సబ్సిడీ అందించాల్సి ఉండగా కేవలం 81 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. పూర్తిగా అందించామని గ్రౌండింగ్ కాకపోవడంతో ఆన్లైన్లో చూపడం లేదని అధికారులు చెబుతున్నా ఇంకా కొంత మందికి రుణాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక 2016–17లో ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా అందించే రుణాలకు దరఖాస్తులు స్వీకరించలేదు. కానీ 2017–18 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 633 మందిని ఎంపిక చేశారు. వీరికి రూ. 695.96 లక్షల సబ్సిడీ అందించాల్సి ఉంది. ప్రభుత్వం బడ్జెట్ రిలీజు చేయలేదు. అందరికీ ఇచ్చామంటున్న అధికారులు ఏస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16లో 1,770 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయగా 1,629 మందికి అందించినట్లుగా లెక్కలు చూపుతున్నాయి. కానీ అధికారులు మాత్రం అందరికీ అందాయని చెబుతున్నారు. అయితే తమకు రుణాలు అందించలేదని, బ్యాంకు ఖాతా నంబర్లు మారినందున బ్యాంకర్లు ఇవ్వడం లేదని సంబంధిత శాఖలకు 15 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2016–17 ఆర్థిక సంవత్సరంలో 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం 524 మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేశారు. ఇందులో 132 మందికి సబ్సిడీ విడుదల కాగా నేటికీ ఒక్కరికి కూడా అందించలేదు. త్వరలోనే అందిస్తాం 2015–16 సంవత్సర బీసీ కార్పొరేషన్ ద్వారా విడుదలైన సబ్సిడీని లబ్ధిదారులకు త్వరలోనే అందిస్తాం.లబ్ధిదారులు.. బ్యాంకర్లకు యూసీలు అందించకపోవడం వల్ల గ్రౌండింగ్ కాక పెండింగ్ చూపిస్తున్నాయి. కొన్ని చోట్ల బ్యాంకర్ల బిజీగా ఉండటంతో లబ్ధిదారులకు అందించలేక పోయారు. అదే విధంగా ఇతర ఖాతాల్లో కొంత సబ్సిడీ పడటంతో ప్రభుత్వానికి నివేదికలు పంపాం. త్వరలోనే అందరికీ అందిస్తాం. -
ఉద్యోగాలిప్పిస్తామంటూ వాట్సప్‌లో ఎర
ఓర్వకల్లు : సోలార్ పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ ద్వారా నిరుద్యోగులకు ఎరవేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ మధుసూదన్‌రావు వివరాలు వెల్లడించారు. బనగానపల్లెకు చెందిన పరమేష్, కోవెలకుంట్లకు చెందిన మమబూబ్ ఉశేని, అదే మండలం, బిజినివేములకు చెందిన రాజశేఖరచౌదరి, ఆళ్లగడ్డకు చెందిన రామోజీరావు, చాగలమర్రికి చెందిన ప్రసాద్ ముఠాగా ఏర్పడి శకునాల వద్దనున్న సోలార్ పరిశ్రమలోని గ్రీన్కో కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వాట్సప్ ద్వారా ఈ నెల 17న నిరుద్యోగులకు సందేశాలు పంపారు. ఈక్రమంలో గ్రీన్కో కంపెనీ సెక్యూరిటీ సూపర్వైజర్ కోటేశ్వరరావు తన తమ్ముడికి ఉద్యోగం కావాలని సదరు యువకులను ఫోన్లో సంప్రదించాడు. అందుకు మొదట రూ.10 వేలు డిపాజిట్, మరో రూ.2 వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆయన విషయాన్ని గ్రీన్కో కంపెనీ డిప్యూటీ మేనేజర్ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత డిప్యూటీ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం హుశేనాపురంలోని గడివేముల బస్టాండ్ వద్ద ముగ్గురు నిందితులు ఉండగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యువతకు అండగా కాంగ్రెస్
యాదగిరిగుట్ట : యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఏఐసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో వివిధ పార్టీలకు చెందిన యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. యువనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు, నిరుద్యోగ భృతిని అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమ్మడి మాధవిరాంరెడ్డి, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యాక్షుడు చీర శ్రీశైలం, పార్టీ మండల అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, పాలసంఘం చైర్మన్ భాస్కర్‌రెడ్డి, యాదాద్రి దేవస్థానం మాజీ ధర్మకర్త పెల్లిమెల్లి శ్రీధర్‌గౌడ్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ కానుగు బాలరాజు, గ్రామశాఖ అధ్యక్షులు శంకర్, ప్రభాకర్ తదితరులున్నారు. -
2147 మంది అభ్యర్థులకు ఉద్యోగ కల్పన
గణపవరం (నాదెండ్ల): ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో యువతకు ఉద్యోగ కల్పనకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖా మాత్యులు నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని చుండి రంగనాయకులు ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం మెగా జాబ్‌మేళా ముగిసింది. రెండోరోజు స్థానికేతరులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 7 వేల మంది హాజరుకాగా, 1200 మంది ఎంపికయ్యారు. రెండ్రోజుల్లో కలిపి 52 బహుళజాతి కంపెనీల ద్వారా మొత్తం 2147 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జేఎన్టీయూ కాకినాడ వీసీ వీఎస్ఎస్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కాకినాడ వికాస ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఆరేళ్లలో పది జాబ్‌మేళాలు నిర్వహించి 17400 మందికి పైగా ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా స్వర్ణాం్ర«ధ ఫౌండేషన్ కృషి చేస్తుందని చెప్పారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ భవిష్యత్తులో వికాస సంస్ధ అన్ని జిల్లాల్లో విస్తరించి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాల కల్పనకు పనిచేయాలని కోరారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. నియామకాల్లో పాల్గొన్న 52 కంపెనీల ప్రతినిధులను సత్కరించారు. జాబ్‌మేళాలో విధులు నిర్వహించిన నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐలు శోభన్‌బాబు, సురేష్‌బాబు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందిని కళాశాల యాజమాన్యం, స్వర్ణాంధ్ర ఫౌండేషన్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో వికాస పీడీ డాక్టర్ వీఎన్‌రావు, స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కార్యదర్శి పేర్ని వీరనారాయణ, కళాశాల సెక్రటరీ చుండి వేణుగోపాల్, అధ్యక్షుడు విజయసారధి, గ్రామ సర్పంచ్ పెనుమల జాన్‌బాబు, మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి, మార్కెట్‌యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, ఆర్డీవో జి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.