ఖమ్మం మయూరిసెంటర్: సబ్సిడీ రుణాలు పొంది ఆర్థికంగా బలోపేతం అవుదామని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) నిరుద్యోగులు, పేదలకు నిరాశే ఎదురవుతోంది. వరుస ఎన్నికలతో లోన్లు మంజూరు కాక అలక్ష్యం నెలకొంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ముఖ్యంగా రూ.లక్ష రుణం తీసుకునేందుకు ఎక్కువ యూనిట్లు ఉంటున్న కారణంగా అధికంగా దరఖాస్తు చేసుకుంటుంటారు. ఈసారి మొత్తం యూనిట్లను గతేడాదితో పోలిస్తే.. సగానికి తగ్గించేయడంతో ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గత సంవత్సరం జిల్లాకు 1595 స్వయం ఉపాధి పథకం యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా..ఇందులో 900 యూనిట్లు రూ.లక్ష గ్రాంటు ఉన్నవి కావడం విశేషం. ప్రభుత్వం ఈ సంవత్సరం ఆ సంఖ్యను సగానికి తగ్గించి మొత్తం యూనిట్లనే 670తో సరిపెట్టింది. 2018–19లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని ఉపాధి పొందాలని జిల్లాలో 20వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 670 యూనిట్లలో పురుషులకు 447, మహిళలకు 223 యూనిట్లు ఉన్నాయి.
అదనంగా వికలాంగులకు మరో 34 యూనిట్లను కేటాయించారు. ఇందులో రూ.లక్ష లోను అందే యూనిట్లు 318 ఉన్నాయి. వీటి ద్వారా లబ్ధి పొందాలని ఎక్కువ మంది చూస్తున్నారు. మొత్తం 20వేల దరఖాస్తుల వరకు రాగా..వీటిల్లో రూ.లక్ష, ఆలోపు యూనిట్లకే ఎక్కువ వచ్చాయి. అయితే..ఈ సారి యూనిట్లు బాగా తగ్గిపోవడం, నిధులు మంజూరు కాకపోవడం లబ్ధిదారులకు ఇబ్బందిగా మారింది. ఇంకా రూ.2 లక్షల యూనిట్లు 255, రూ.7లక్షల యూనిట్లు 97 ఉన్నాయి. గత సంవత్సరం జిల్లాకు 1595 యూనిట్లను లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం 670 యూనిట్లను మాత్రమే కేటాయించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మొత్తాన్ని మున్సిపాలిటీలకు, మండలాలకు ఎలా కేటాయిస్తారని చర్చించుకుంటున్నారు.
మార్గదర్శకాలు లేక, కోడ్ తొలగక చిక్కులు..
సీఎం ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ డెవలెప్ ప్రోగ్రాం(సీఎంఈడీపీ) పథకం ద్వారా సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ మార్గదర్శకాలు రాలేదు. ఈ పథకం ద్వారా రూ.12 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించేందుకు నిర్ణయించింది. బ్యాంక్ లింకేజీ ద్వారా ఇచ్చే ఈ లోన్లకు సంబంధించి జిల్లాకు మొత్తం 93 యూనిట్లు కేటాయించిన ప్రభుత్వం రూ.12 లక్షల యూనిట్లు 47, రూ.25 లక్షల యూనిట్లు 31, రూ.50 లక్షల యూనిట్లు 15 కేటాయించింది. అయితే ఈ యూనిట్లకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో యూనిట్ల ఏర్పాటు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలో తెలియక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు.
తక్షణమే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తే దరఖాస్తులు చేసుకునే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టులోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. 2018 డిసెంబర్ వరకు అధికారులు జిల్లాలో పథకానికి అర్హులైన వారిని గుర్తించి జిల్లాకు కేటాయించిన యూనిట్ల లోబడి ఎంపిక చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో వరుస ఎన్నికలు రావడంతో ఇప్పటి వరకు పథకం ముందుకు కదలట్లేదు. మొదటగా శాసనసభ ఎన్నికల కోడ్ రావడం, డిసెంబర్ వరకు ఆ ఎన్నికల్లో అధికారులు నిమగ్నమవడం, అనంతరం పంచాయతీ ఎన్నికల కోడ్ కూయడంతో పథకానికి బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా పథకం ముందుకు కదులుతుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment