BC loans
-
అ‘లక్ష’మేలనో?
ఖమ్మం మయూరిసెంటర్: సబ్సిడీ రుణాలు పొంది ఆర్థికంగా బలోపేతం అవుదామని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) నిరుద్యోగులు, పేదలకు నిరాశే ఎదురవుతోంది. వరుస ఎన్నికలతో లోన్లు మంజూరు కాక అలక్ష్యం నెలకొంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ముఖ్యంగా రూ.లక్ష రుణం తీసుకునేందుకు ఎక్కువ యూనిట్లు ఉంటున్న కారణంగా అధికంగా దరఖాస్తు చేసుకుంటుంటారు. ఈసారి మొత్తం యూనిట్లను గతేడాదితో పోలిస్తే.. సగానికి తగ్గించేయడంతో ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత సంవత్సరం జిల్లాకు 1595 స్వయం ఉపాధి పథకం యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా..ఇందులో 900 యూనిట్లు రూ.లక్ష గ్రాంటు ఉన్నవి కావడం విశేషం. ప్రభుత్వం ఈ సంవత్సరం ఆ సంఖ్యను సగానికి తగ్గించి మొత్తం యూనిట్లనే 670తో సరిపెట్టింది. 2018–19లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని ఉపాధి పొందాలని జిల్లాలో 20వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 670 యూనిట్లలో పురుషులకు 447, మహిళలకు 223 యూనిట్లు ఉన్నాయి. అదనంగా వికలాంగులకు మరో 34 యూనిట్లను కేటాయించారు. ఇందులో రూ.లక్ష లోను అందే యూనిట్లు 318 ఉన్నాయి. వీటి ద్వారా లబ్ధి పొందాలని ఎక్కువ మంది చూస్తున్నారు. మొత్తం 20వేల దరఖాస్తుల వరకు రాగా..వీటిల్లో రూ.లక్ష, ఆలోపు యూనిట్లకే ఎక్కువ వచ్చాయి. అయితే..ఈ సారి యూనిట్లు బాగా తగ్గిపోవడం, నిధులు మంజూరు కాకపోవడం లబ్ధిదారులకు ఇబ్బందిగా మారింది. ఇంకా రూ.2 లక్షల యూనిట్లు 255, రూ.7లక్షల యూనిట్లు 97 ఉన్నాయి. గత సంవత్సరం జిల్లాకు 1595 యూనిట్లను లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం 670 యూనిట్లను మాత్రమే కేటాయించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మొత్తాన్ని మున్సిపాలిటీలకు, మండలాలకు ఎలా కేటాయిస్తారని చర్చించుకుంటున్నారు. మార్గదర్శకాలు లేక, కోడ్ తొలగక చిక్కులు.. సీఎం ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ డెవలెప్ ప్రోగ్రాం(సీఎంఈడీపీ) పథకం ద్వారా సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ మార్గదర్శకాలు రాలేదు. ఈ పథకం ద్వారా రూ.12 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించేందుకు నిర్ణయించింది. బ్యాంక్ లింకేజీ ద్వారా ఇచ్చే ఈ లోన్లకు సంబంధించి జిల్లాకు మొత్తం 93 యూనిట్లు కేటాయించిన ప్రభుత్వం రూ.12 లక్షల యూనిట్లు 47, రూ.25 లక్షల యూనిట్లు 31, రూ.50 లక్షల యూనిట్లు 15 కేటాయించింది. అయితే ఈ యూనిట్లకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో యూనిట్ల ఏర్పాటు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలో తెలియక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. తక్షణమే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తే దరఖాస్తులు చేసుకునే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టులోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. 2018 డిసెంబర్ వరకు అధికారులు జిల్లాలో పథకానికి అర్హులైన వారిని గుర్తించి జిల్లాకు కేటాయించిన యూనిట్ల లోబడి ఎంపిక చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో వరుస ఎన్నికలు రావడంతో ఇప్పటి వరకు పథకం ముందుకు కదలట్లేదు. మొదటగా శాసనసభ ఎన్నికల కోడ్ రావడం, డిసెంబర్ వరకు ఆ ఎన్నికల్లో అధికారులు నిమగ్నమవడం, అనంతరం పంచాయతీ ఎన్నికల కోడ్ కూయడంతో పథకానికి బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా పథకం ముందుకు కదులుతుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. -
బీసీ రుణాలు పంపిణీ చేసేనా?
నల్లగొండ : బీసీ రుణాలకు ఎన్నికల దెబ్బ పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఒక్కసారి అదీ అంతంత మాత్రంగానే రుణాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత 2015–16, 2016–17 సంవత్సరాల్లోనూ రుణాలివ్వలేదు. తిరిగి 2017–18 సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇవ్వలేదు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం అన్ని కార్పొరేషన్ల ద్వారా అందరికీ రుణాలు ఇస్తామని చెప్పడంతో నిరుద్యోగులు బీసీ కార్పొరేషన్‌ను కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 16,659 దరఖాస్తులు రాగా అందరికీ రుణాలు అనడంతో 11,564 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 28వేల దరఖాస్తులు వచ్చాయి. రూ.లక్ష మొదలుకొని రూ.12 లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు. ఇందులో వ్యక్తిగత రుణాలతోపాటు 11 ఫెడరేషన్ల పరంగానూ రుణాలు అందించాల్సి ఉంది. బీసీ రుణాలకు మొదట అసెంబ్లీ కోడ్ దెబ్బ తగిలి మూడు మాసాలు వెనుకబడి పోయాయి. గత జూలై మాసంలో మండలాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అంతకుముందు ఇస్తామన్న రుణాలు కాకుండా నూటికి నూరుశాతం సబ్సిడీ కింద రూ.లక్ష రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి విడతగా రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పట్లో ఆగస్టు 15 సందర్భంగా అప్పటికప్పుడు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పరేడ్‌గ్రౌండ్‌లోనే వారికి రుణాలను అందజేశారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో కోడ్ వచ్చి రుణాల పంపిణీ ఆగిపోయింది. మూడు నెలల పాటు ఎదురుచూపులు తప్పలేదు. ప్రస్తుతం అధికారులు ప్రభుత్వంనుంచి వచ్చిన రూ.6.35 కోట్లకు సంబంధించి ఆగస్టు 15న అందజేసిన వారికి మినహా మిగతా లబ్ధిదారులకు ఇచ్చేందుకు చెక్కులు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. 888 చెక్కులు సిద్ధం.... రూ.50వేల చొప్పున పూర్తి సబ్సిడీ కింద లబ్ధిదారులకు ఇచ్చేందుకు చెక్కులను సిద్ధం చేశారు. మొత్తం 888 చెక్కులపై కలెక్టర్ సంతకం కూడా చేశారు. వాటన్నింటినీ లబ్ధిదారులకు అందించేందుకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. నేడు ఎంపీడీఓలకు అందించే అవకాశం... సిద్ధం చేసిన చెక్కులన్నింటినీ లబ్ధిదారులకు అందించేందుకు గురువారం ఎంపీడీఓలకు అందించనున్నారు. వారు ఆయా మండలాల వారీగా లబ్ధిదారులతో సమావేశం నిర్వహించో... సమాచారం ఇచ్చి అందించాల్సి ఉంది. ఎంపీడీఓలకు రిజర్వేషన్ బాధ్యతలు అప్పగింత ప్రస్తుతం ఎంపీడీఓలు పంచాయతీ ఎన్నికల బిజీలో ఉన్నారు. గ్రామాల్లో రిజర్వేషన్ల వారీగా ఆయా కేటగిరీలను ఎంపిక చేసే బాధ్యతను సంబంధిత ఆర్డీఓ, ఎంపీడీఓలకు అప్పగించారు. ఈనెల 29 వరకు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంది. ఈ పనుల్లోనే ఎంపీడీఓలంతా తలమునకలయ్యారు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన చెక్కును ఏ మేరకు పంపిణీ చేస్తారనేది అర్థం కాని పరిస్థితి. ఆలస్యమైతే అంతే... పంచాయతీ ఎన్నికల కోడ్ వచ్చే లోపు పంపిణీ చేస్తే సరే.. లేదంటే అంతే సంగతులు. మళ్లీ వరుస ఎన్నికలతో నెలల కొద్ది ఆలస్యం కాకతప్పని పరిస్థితి నెలకొంది. దీంతో రాసి పెట్టిన చెక్కుల గడువు కూడా పూర్తయ్యే అవకాశం లేకపోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే చెక్కులు అందించాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. -
సామాజిక అన్యాయం
సాక్షి, అమరావతి: అక్షరాలా 12 కార్పొరేషన్లు, 11 బీసీ ఫెడరేషన్లు.. వీటికి బడ్జెట్ కేటాయింపులు రూ.3,746.8 కోట్లు. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3.30 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటిదాకా ఎంతమందికి, ఎన్ని రుణాలు ఇచ్చారో చూస్తే.. కనిపించేది పెద్ద గుండుసున్నా. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు తదితర సామాజిక వర్గాల సంక్షేమం పట్ల నాలుగున్నరేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త డ్రామాకు శ్రీకారం చుడుతోంది. ఆన్లైన్ దరఖాస్తులకు మోక్షమెప్పుడో? లబ్ధిదారులకు రుణాలు విడిగా ఇవ్వకుండా ఎన్నికల ముందు మేళాలు నిర్వహించి, ప్రచారం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా పైసా కూడా రుణాలు ఇవ్వకుండా దగా చేసిన సర్కారు తీరుపై లబ్ధిదారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నెలకోసారి రుణమేళాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. వచ్చే నెల నుంచి రుణమేళాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కొన్ని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. ఈ దరఖాస్తులకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గతంలో ఏడు కార్పొరేషన్లు ఉండేవి. కొత్తగా ఎంబీసీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, దూదేకుల ముస్లిం కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీసీల్లో వెనుకబడిన కులాల కోసం 11 ఫెడరేషన్లు ఉన్నాయి. ఒక్కో ఫెడరేషన్లకు రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు కేటాయించారు. రజక, కల్లుగీత కార్మిక ఫెడరేషన్లకు మాత్రం రూ.70 కోట్లు కేటాయించారు. ఈ అరకొర నిధులతో ఎక్కువ మందికి రుణాలు దక్కే అవకాశం లేదని బీసీ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారికి, టీడీపీ కార్యకర్తలకే రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. బీసీల్లో అన్ని వర్గాలనూ మోసం చేశారు ‘‘వెనుకబడిన తరగతుల్లో అన్ని వర్గాల వారినీ తెలుగుదేశం పార్టీ మోసం చేసింది. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజమైన లబ్ధిదారులకు రుణాలు అందడం లేదు. రుణమేళాలు పెట్టి అధికార పార్టీ కార్యకర్తలకు రుణాలు ఇవ్వాలని చూస్తున్నారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీ కులాలకు టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. పైగా బీసీ సబ్‌ప్లాన్ అంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. – జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రుణమేళాల పేరుతో మరో గిమ్మిక్కు ‘‘గత ఏడాది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కేవలం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి, అధికార పార్టీ నేతల బినామీలకే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చారు. ఇప్పుడు రుణమేళాల పేరుతో ప్రభుత్వం మరో గిమ్మిక్కు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచింది. ఇప్పటిదాకా ఇవ్వని రుణాలను ఎన్నికల ముందు ఇస్తామని చెబుతున్నారంటే ప్రభుత్వ పెద్దల కుట్రను అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి చేతులు దులుపుకుంటే సరిపోదు. – ఆండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేత -
బీసీ రుణాలకు బ్రేక్
ఆదిలాబాద్‌రూరల్: స్వయం ఉపాధి పథకంలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే రుణాలకు మోక్షం కలగడం లేదు. రుణాల పంపిణీ ప్రారంభం అయినట్లే అయి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. కార్పొరేషన్ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలను అందించేందుకు ఎన్నికల కమిషన్ నిరాకరించింది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు 2వేలకుపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం 472 మందికి మాత్రమే అందజేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 15,800 మంది స్వయం ఉపాధి రుణాల కోసం వివిధ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. అందని ద్రాక్షే.. బీసీ కార్పొరేషన్ రుణాలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు తీసుకుందామని ఆశించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నరేళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు రెండు సార్లు మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. మొదటగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అందులో కొందరికి మాత్రమే రూ.లక్ష రుణాలు అందజేసింది. వీటికి సంబంధించిన సబ్సిడీని 2018 మార్చిలో విడుదల చేసింది. జిల్లాలో సుమారు 472 మందికి రూ.80 వేల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అనంతరం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. తదుపరి 2017–18లో దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల లబ్ధిదారులు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరడంతో ఆ తర్వాత ఏప్రిల్ 21 వరకు గడువు పొడిగించి దరఖాస్తులను స్వీకరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 2,70,321 మంది బీసీ జనాభా ఉండగా కార్పొరేషన్, ఫెడరేషన్ ద్వారా 15,800 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులను స్వీకరించకపోవడంతో నిరుద్యోగ బీసీ లబ్ధిదారులు ఆందోళన చెందారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి 13వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని అర్హులుగా ఎంపీడీవోలు గుర్తించారు. 750 మందికి పంపిణీ.. జిల్లాలో కార్పొరేషన్ ద్వారా 15,800 లబ్ధిదారులు వివిధ రుణాలకు ఫెడరేషన్, కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇందులో 13వేల మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో రూ.లక్ష లోపు యూనిట్లను కేటగిరి–1, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు యూనిట్లను కేటగిరి–2, రూ.2లక్షలకుపై యూనిట్లను కేటగిరి–3గా నిర్ణయించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో లబ్ధిదారులను గుర్తించేలోపు ఆగస్టు 15న రూ.50వేల యూనిట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆగస్టు 15న 100 మందికి రూ.50 వేల వంద శాతం సబ్సిడీపై చెక్కులను పంపిణీ చేశారు. రూ.లక్ష యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి వారిని 50 యూనిట్లలోనికి మార్చి జిల్లా వ్యాప్తంగా 750 మందికి చెక్కులను పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఇంతలోనే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. సబ్సిడీ రుణాల పంపిణీ నిలిచిపోయింది. మళ్లీ ఎప్పుడు రుణాలు అందిస్తారో తెలియక లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్‌తో నిలిపి వేశాం.. జిల్లాలో వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం 15,800 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మంది అర్హులుగా గుర్తించి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లబ్ధిదారుల జాబితాను పంపించారు. ఇందులో ఆసక్తి గల వారికి రూ.50వేలు వంద శాతం సబ్సిడీపై 750 మందికి అందజేశాం. మిగతా వారికి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిలిపి వేశాం. – ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి, ఆదిలాబాద్ -
4 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక రుణ ప్రణాళిక
సిద్దిపేట జోన్: ‘కుల వృత్తులను వీడి ఇతర వృత్తులు, మార్గాల్లో జీవనం సాగిస్తున్న బడుగు, బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో తీపి కబురు అందించనుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల కోసం ప్రత్యేక రుణ పథకాన్ని అమలు చేయనున్నారు’అని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. జిల్లా పద్మశాలి మహాసభలో మాట్లాడారు. ప్రపంచీకరణ మార్పులతో కుల వృత్తులకు దూరమైన బీసీ వర్గాల కోసం రూ.4 వేల కోట్లతో రుణ పథకాన్ని సీఎం కేసీఆర్ త్వరలో అమలు చేయనున్నారని తెలిపారు. ఇందు లో రూ.2,000 కోట్లు ప్రభుత్వం, మరో రూ.2,000 కోట్లు బ్యాంకుల ద్వారా సేకరిస్తామన్నారు. లక్ష మందికి రూ.50 వేల చొప్పున, మరో లక్ష మందికి రూ.75 వేల చొప్పున మొత్తంగా 2 లక్షల మందికి బ్యాంక్ గ్యారంటీ, ష్యూరిటీ లేకుండా వంద శాతం సబ్సిడీతో రుణాన్ని అందించే పథకం రానుందన్నారు. మరో 60 వేల మందికి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాన్ని కల్పించే పథకానికి రూపకల్పన జరుగుతోందని మంత్రి వెల్లడించారు. ఎంబీసీల కోసం రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. మండలానికో బీసీ గురుకులం ఏర్పాటుకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చేనేతకు చేయూత.. ప్రభుత్వం చేనేత కులవృత్తులపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తోందని హరీశ్ పేర్కొన్నారు. రూ.700 కోట్లతో చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసి నేత కార్మికుడికి చేతి నిండా పని కల్పిస్తుందన్నారు. రూ.11 కోట్లతో చేయూత పథకంతోపాటు చేనేత మిత్ర కింద నూలు, రంగుల్లో 50 శాతం సబ్సిడీ అందిస్తున్నామన్నారు. వరంగల్‌లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే 1,200 ఎకరాల భూ సేకరణ జరిగిందని, ఇటీవలే కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా లభించాయని వెల్లడించారు. రూ.1,000 కోట్లతో వ్యవసాయంపై ఆధారపడిన బీసీ వర్గాలకు పశుసంపద అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ముఖ్యమంత్రి సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు. -
బీసీల పట్ల టీఆర్ఎస్ వివక్ష చూపుతోంది: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసిన బీసీలందరికీ రుణాలు ఇవ్వాలని, 500 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న కలెక్టరేట్లను ముట్టడించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం జరిగిన బీసీ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల విపక్ష చూపుతోందని ఆరోపించారు. కొన్ని కులాలకు పూర్తి ఫీజు చెల్లించి, బీసీ విద్యార్థులకు మాత్రం అనేక ఆంక్షలు పెట్టి విద్యనభ్యసించకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా..గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించలేదన్నారు. 0బీసీ కార్పొరేషన్లు, 11 కుల ఫెడరేషన్లకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులు, బీసీలను అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సమావేశంలో బీసీ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రుణాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు
బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఏప్రిల్‌లో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. కమ్మర్పల్లి(బాల్కొండ) : బీసీ కార్పొరేషన్ 2018–19 సంవత్సరానికి గాను రుణాల మంజూరు కోసం ఏప్రిల్ 4 నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా, జిల్లాలో 11,542 మంది నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తు ఫారం, సంబంధిత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీల మూడు సెట్లను అభ్యర్థులు స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో సమర్పించాలని, గ్రామసభల తీర్మానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ వారం రోజుల కిత్రం అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టారు. ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా లేని, అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. వివరాలను మండల పరిషత్తు కార్యాలయంలో ఆన్లైన్ చేశారు. అయితే గ్రామస్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక మాత్రం చేపట్టలేదు. దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను పంపాలని మార్గదర్శకాలు జారీ అయినప్పటికీ, గ్రామస్థాయి అధికారులు అవేమీ పరిగణనలోకి తీసుకోలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడితే లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్న దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. గతంలో సాధారణంగా దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తికాగానే వాటి ని పరిశీలించి 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఎంపిక కోసం మౌఖిక పరీక్షలు(ఇంటర్వ్యూలు) నిర్వహించేవారు. ప్రస్తుతం నెలలు గడుస్తున్నా ఇంటర్వ్యూలు నిర్వహించిన దాఖలాలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన హడావుడిలో ఉన్న అధికారం యంత్రాంగం కార్పొరేషన్ రుణాల ఎంపిక కోసం మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అందని రాయితీ రుణాలు.. 2015–16 సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతీ యువకులకు పూర్తిస్థాయిలో రాయితీ రుణాలు అందలేదు. 80 శాతం రాయితీ ప్రకటించడంతో దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. మండల స్థాయిలో ఎంపీడీఓ, బీసీ కార్పొరేషన్, బ్యాంక్, ఎంప్లాయిమెంట్, ఇతర అధికారులు కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సంక్షేమ రుణాల జారీలో అక్రమాలకు తావులేకుండా ప్రక్రియ అంతా బీసీ సంక్షేమ శాఖ ఆన్లైన్లోనే పూర్తి చేసింది. కాని ఎంపికైన లబ్ధిదారుల్లో కొంతమందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. చాలామంది అభ్యర్థులకు రాయితీ రుణాలు అందలేదు. రుణాలు మం జూరైన లబ్ధిదారులతో బ్యాంకు అధికారులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిపించడంతో పాటు, డాక్యూమెంట్ ప్రక్రియ పూర్తి చేయించారు. కాని రుణాలు మంజూరు కాకపోవడంతో అభ్యర్థులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి చాలించుకున్నారు. మరుసటి ఏడాదైనా రాకపోతాయా అని 2017–18 సంవత్సరంలో వేచి చూశారు. కాని ఆ సంవత్సరంలో రుణాల కోసం నోటిఫికేషన్ జారీ చేయలేదు. రెండేళ్ల నుంచి రాయితీ రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈయేడు బ్యాంకు అంగీకారం లేకుండానే లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించడంతో అభ్యర్థులు చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాయితీ పెంచడంతో డిమాండ్... కార్పొరేషన్ రుణాలకు రాయితీ పెంచడంతో డిమాండ్ విపరీతంగా ఏర్పడింది. రుణాలను మూడు కేటగిరిలుగా విభజించారు. 1వ కేటగిరిలో రూ. 1 లక్ష వరకు రుణ సదుపాయానికి 80 శాతం రాయితీ, 2వ కేటగిరిలో రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రుణ సదుపాయానికి 70 శాతం రాయితీ, 3వ కేటగిరిలో రూ. 2 లక్షల నుంచి 12 లక్షల వరకు రుణానికి 60 శాతం రాయితీ ప్రకటించారు. రుణాలకు రాయితీ అధికంగా ఉండడంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కులాల వారీగా, బీసీ ఫెడరేషన్ ప్రకారం యూనిట్ల కేటాయింపు ఉండే అవకాశం ఉందని ప్రచారం ఉండడంతో ఆశావహులు తమకు రుణాలు మంజూరవుతాయని నమ్మకంతో ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా..? రుణాల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుందనేది అయోమయం నెలకొంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి ఇంటర్వ్యూల కోసం తేదీని ప్రకటించి అధికార బృందం లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ మొదలు రుణాలు వచ్చే వరకు అంతా ఆన్లైన్ ప్రక్రియనే కొనసాగిస్తుండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇంతవరకు మండలానికి ఎన్ని యూనిట్లు కేటాయించారో స్పష్టంగా తెలియజేయలేదు. లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల తీర్మానం ద్వారానే చేపట్టాలని మార్గదర్శకాలు జారీ అయినప్పటికీ, గ్రామస్థాయిలో అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. ధ్రువీకరణ పత్రాలు సరిగ్గాలేని, ఆన్లైన్ చేయని దరఖాస్తులను తిరస్కరించి మిగతా అన్ని వాటితో లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఆన్లైన్ చేశారు. దరఖాస్తు చేసుకున్న అందరూ అర్హులైతే ఎంతమందికి రాయితీ రుణాలు అందుతాయో వేచి చూడాల్సిందే. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తారా అనే సంశయం నెలకొంది -
గడువు పొడిగింపు
విజయనగరం పూల్‌బాగ్ : జిల్లాలోని నిరుపేద ఎస్సీ, బీసీ, కాపు, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్, బీసీ ఫెడరేషన్ అభ్యర్థులు రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మే పదో తేదీ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్, సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసక్తి గల అభ్యర్థులు మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా గాని, మండల అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
బీసీ రుణాల దరఖాస్తు గడువు పెంచాలి
తాండూరు రూరల్: బీసీ రుణాల దరఖాస్తుల గడువు పెంచాలని ఆ సంఘం నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈనెల 4వ తేదీతో బీసీ రుణాల దరఖాస్తు ముగుస్తోందని తెలిపారు. సమయం తక్కువగా ఉండటంతో కులం, ఆదాయం సర్టిఫికెట్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంలో ఉన్నతాధికారులు దృష్టిసారించి దరఖాస్తుల గడువు పెంచాలని కోరారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓలకు వినతిపత్రాలు ఇచ్చేందుకు యత్నించగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డె కృష్ణ, అమ్రేష్, రమేష్, వెంకటేష్, నర్సింలు ఉన్నారు. -
‘బీసీ’ రుణాలకు దరఖాస్తు చేసుకోండి
యాలాల: బీసీ కార్పొరేషన్లో వ్యక్తిగత రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ సుధాకర్ గురువారం తెలిపారు. ఓబీఎంఎంఎస్ వెబ్సైట్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచి ంచారు. గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలకు రూ. 1.50 లక్షల వార్షిక ఆదాయం ఉండి 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వా రు అర్హులని చెప్పారు. మీసేవ ద్వారా పొంది న కుల, ఆదాయ పత్రాలతో పాటు ఆధార్ జి రాక్సుతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరిం చారు. వ్యవసాయ ఆధారిత, పాడి పశువులు, చిన్న నీటిపారుదల, వ్యక్తిగత స్వయం ఉపా ధి విభాగాల్లో రుణాల కోసం దరఖాస్తు చేసు కునే అవకాశం ఉందని తెలిపారు. యూనిట్ వి లువ రూ.1లక్ష అయి తే 80 శాతం, రూ.2 లక్షలు ఉంటే 70శాతం, రూ .2.1 నుంచి రూ.12లక్షల వరకు ఉంటే 60శా తం సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు. మండ ల పరిధిలోని బీసీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
బీసీ రుణాలకు బ్రేక్
మంజూరు దశలో ఉన్న బీసీ కార్పొరేషన్ రుణాలకు బ్రేక్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ రుణాలను ఉన్నపళంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలోని లబ్దిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రొసీడింగ్స్ సైతం తీసుకొని, డబ్బుల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులు సర్కారు ఇచ్చిన షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. నిధుల్లో కోత విధించడంతో పాటు యూనిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. దీంతో లబ్దిదారులను ఎలా కుదిస్తారనే విషయంపై అయోమయం నెలకొంది. పాత లబ్దిదారులకు రుణాలు వస్తాయా? లేక కొత్తగా ఎంపిక చేపడుతారా? మొత్తం ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలకు మార్గదర్శకాలు రావాల్సి ఉంది. కరీంనగర్ సిటీ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు చెందిన నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణం గా నిధులు విడుదల చేసి జిల్లాల వారీగా యూనిట్ల లక్ష్యాలను నిర్దేశించింది. యూనిట్లకు అనుగుణంగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు ల గడువు గత నెలలోనే ముగిసింది. జిల్లావ్యాప్తంగా బ్యాంకర్లు, ఎంపీడీఓలు కలిసి లబ్దిదారులను ఎంపిక చేశారు. చాలా మంది లబ్దిదారులు రుణ మంజూరీకి సంబంధించి ప్రొసీడింగ్స్ సైతం అందుకున్నారు. ఈ దశలో రుణాల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేయడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. 1783కు తగ్గిన యూనిట్లు బీసీ కార్పొరేషన్ రుణాలకు కేటాయించిన నిధుల్లో ప్రభుత్వం భారీగా కోత విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్‌ను రూ.115 కోట్ల నుంచి రూ.30 కోట్లకు కుదించినట్లు సమాచారం. దీనికి అనుగుణంగానే ఆయా జిల్లాలకు కేటాయించిన యూనిట్లలోనూ కోత పడింది. జిల్లాకు సంబంధించి గతంలో అర్బన్, రూరల్ కేటగిరీల్లో 5922 యూనిట్లు కేటాయించారు. రూరల్‌లో 4335లక్ష్యం కాగా 3050, అర్బన్‌లో 1587 లక్ష్యానికి 1053, మొత్తంగా 5922 యూనిట్లకు 4103 దరఖాస్తులు వచ్చాయి. అరుుతే జిల్లాకు కేటారుుంచి న 5922 యూనిట్ల నుంచి 1783 యూనిట్లకు కుదిం చారు. దీంతో ఇప్పటికే ఎంపిక చేసిన లబ్దిదారులను యూనిట్ల సంఖ్యకు అనుగుణంగా ఎలా కుదించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆందోళనల్లో లబ్దిదారులు ‘రూ.2లక్షల రుణం మంజూరైంది. ఆ డబ్బుతో యూనిట్ పెట్టుకొని ఉపాధి పొందొచ్చని సంబరపడ్డ. మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ చేతికంది గంటలు కూడా గడవకముందే రుణాలు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఇస్తారో లేదో కూడా చెప్పడం లేదు. నోటి కాడి బుక్కను సర్కారు లాక్కున్నట్లయింది’ అంటూ కరీంనగర్ రాంనగర్‌కు చెందిన మల్లేశం అనే లబ్దిదారుడు వాపోయాడు. బ్యాంకర్ల నుంచి కాన్సెంట్ తీసుకొని, అధికారులు చుట్టూ తిరిగి, నానా కష్టాలు పడి రుణాలకు ఎంపికైతే చివరిక్షణంలో షాక్ ఇవ్వడాన్ని లబ్దిదారులు తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ రుణాలు వస్తాయో రావో కూడా అధికారులు చెప్పలేకపోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. నిధుల్లో కోత వద్దు ఏ శాఖలోనూ లేనివిధంగా బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన నిధుల్లో కోత విధించడం పట్ల బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రొసీడింగ్స్ దశలో రుణాలు నిలిపివేయడంపై మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బీసీ బడ్జెట్ సరిపోవడం లేదని, మరింత పెంచాలని డిమాండ్ చేస్తుంటే, ఉన్న నిధుల్లో కోత విధించడమేమిటని ప్రశ్నిస్తున్నారుు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నా, బీసీ కార్పొరేషన్‌కు సంబంధించిన యూనిట్లను మాత్రమే కుదించడం పట్ల బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. నిధుల్లో కోత లేకుండా, యూనిట్లను కుదించకుండా పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. -
రుణమాఫీ అమలులో విఫలం
బొబ్బిలి :ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను నిర్వీర్యం చేసేలా టీడీపీ ప్రభుత్వం కమిటీలు వేసి ఎస్సీ, బీసీ రుణాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని, వాటిని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. మంగళవారం ఆయన బొబ్బిలి కోటలో విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి స్థాయి, స్థోమత లేనివారితో కమిటీలు వేసి పబ్బం గడిపేస్తున్నారన్నారు. పచ్చచొక్కాలకే పథకాలు ఇవ్వడానికి ఇటువంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి కమిటీల వల్ల ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ లేకుండాపొతుందన్నారు. ఎన్నికల హామీగా ఇచ్చిన రుణమాఫీని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యవసా య రుణాలను మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు పంట రుణాలు మాఫీ చేసే ప్రక్రియను ప్రారంభించారన్నారు. గ్రామాల్లో సదస్సులు పెట్టి పత్రాలు ఇ స్తున్నా.. రైతుల ఖాతాల్లోకి రూపాయి కూడా జమ కావడం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే విధంగా ప్రశ్నిస్తామని తెలిపారు. జిల్లాల్లో అనేక పరిశ్రమలు రకరకాల కారణాల వల్ల మూతపడుతున్నాయని, దీని వల్ల రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నారు. పరిశ్ర మలను తెరిపించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడంతో ఈ దుస్థితి నెలకొందన్నారు. నిరుపేదలకు ఇచ్చే పింఛన్లలో కోత విధించి అర్హులకు అన్యా యం చేశారన్నారు. ఐదు రెట్లు పింఛన్లు పెంచామని గొప్పగా చెబుతూ వేలాది మందికి పింఛన్లు లేకుండా చేశారని ఆరోపించారు. అర్హత ఉన్నవారం దరికీ మళ్లీ పింఛన్లు మంజూరు చేయాలని, తప్పుడుగా తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుద్‌హుద్ తుపాను వచ్చి రెండు నెలలైనా ఎవరికీ సాయం అందలేదన్నారు. గృహాలు కోల్పోయి నిరుపేదలు రోడ్డున పడ్డారని, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో మత్య్సకా రులకు అపార నష్టం కలిగిందన్నారు. బోట్లు, వలలు, ఇళ్లు పాడైనా...వారికి ఎటువంటి సహాయం అందలేదన్నారు. రైతులకు ఒక్క అరటి పంటకు మాత్రమే పరిహారం ఇచ్చి వరి, చెరుకు రైతులకు అన్యాయం చేశారని తెలిపారు. గతంలో లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించామని, కానీ ఇప్పటికీ పరిస్థితి మారలేదన్నారు. కొత్త సీజన్ కష్టాలు, పాత బకాయిలు తీర్చకపోవడం వంటివి ఇంకా వెంటాడుతున్నాయ న్నారు. వీటిన్నింటి గురించి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. ఒప్పందాలు అమలయ్యేలా చూడండి పట్టణంలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మిల్లు యాజమాన్యం, కార్మిక సంఘ నాయకుల మధ్య జరిగిన ఒప్పందాలు అమలయ్యేలా చూడాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావును కార్మిక సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల నాయకులు కోటలో ఎ మ్మెల్యేను కలిశారు. ఇటీవల రెండు నెలల పాటు మిల్లును మూసేసిన సమయంలో కార్మికులు చేసిన పోరాటాలకు సంఘీభావం తెలిపి వారి వెన్కంటి ఉన్నందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల యాజమాన్యంతో జరిగిన చర్చలు.. ఆ తరువాత విధుల్లోకి వెళ్లడం వాటిని కూలానుకూషం గా వివరించారు. మిల్లు ప్రస్తుతం తిరుగుతున్నా ఇంకా బదిలీ కార్మికులకు సరైన పని కల్పించడం లేదని, దీని వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవు తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు వి. శేషగిరిరావు, ఎ. సింహాచలం, డి. శ్రీనివాసరావు, మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
రుణాల కోసం ఎదురుచూపులు
- కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు - మంత్రి పోచారంను కలిసి విన్నవించిన బీసీలు కలెక్టరేట్: వెనుకబడిన తరగతులను గత కాంగ్రెస్ ప్రభుత్వం మరింత వెనక్కునెట్టింది. బీసీలకు రుణాల విషయంలో చివరకు చేత్తులెత్తేసింది. ఇక కొత్త రాష్ట్రంలో.. కొత్త ప్రభుత్వం తప్పక అందిస్తుందని దరఖాస్తుదారులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. రుణాలు మంజూరు చేయాలంటూ నిరసనలు, ధర్నాలు చేసిన వారు ఇటీవల రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్నీ అందించారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ కూడా రుణాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆంక్షల జీవో జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 2,675 మందికి రుణాలు అందించాల్సి ఉంది. వాటిలో రూ.40వేలు మొదలుకుని రూ.రెండులక్షల వరకు రుణసౌకర్యం అందిస్తామని చెప్పారు. రూ.40వేలు రుణం పొందేవారికి రూ.20 వేలు, రూ.50వేలు రుణం పొందేవారికి రూ.25వేలు, రూ.లక్షకు 50వేలు, రూ.2లక్షలకు రూ.లక్ష సబ్సిడీగా ప్రభుత్వం పేర్కొంది. 50శాతం సబ్సిడీ కావడంతో ఎన్నడూ లేనంతగా దరఖాస్తుదారులు బీసీ ార్పొరేషన్ వద్ద క్యూకట్టారు. బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రుణాల సబ్సిడీని మరింత పెంచుతామంటూ అప్పటి పాలకులు గొప్పలు చెప్పారు. దీంతో దరఖాస్తుదారులు సంబురపడ్డారు. ఆ తర్వాత సర్కారు అసలు కథ మొదలు పెట్టింది. ఎప్పుడూ లేనివిధంగా రుణాల మంజూరుకు పలు నిబంధనలను విధిస్తూ జీవో నం.101ను విడుదల చేసింది. జీవోలో పేర్కొన్న నిబంధనలతో పాటు రుణాల సబ్సిడీలోనూ కోత విధించింది. లబ్ధిదారుల సంఖ్యనూ కుదించి, బీసీలపై వివక్ష చూపింది. జీవో నం. 101పై అప్పట్లో ఎన్నికల ముందు పెద్ద దూమారం లేసింది. బీసీలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పలు ఆంక్షలతో ఆర్థిక సంవత్సరం మరో వారంలో ముగుస్తుండగా.. రుణాల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రుణాలు అలాగే ఉండిపోయాయి. బీసీలకు ఒక్క పైసా అందలేదు. రుణాలపైనే ఆశలు వెనుకబడిన తరగతులకు చెందిన చాలామంది బీసీ కార్పొరేషన్ రుణాలపైనే ఆశలు పెట్టుకున్నారు. రుణాలు అందితే బతుకుదెరువుకు ఆసరా ఉంటుందంటున్నారు. సారీసెంటర్, బ్యాంగిల్స్టోర్, కిరాణ మర్చంట్, ఫొటోస్టూడియో, జిరాక్స్‌సెంటర్, గొర్రెల పెంపకం తదితర యూనిట్లకు రుణాలు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎంతోఆశతో దరఖాస్తుదారులు బ్యాంకర్ల కాళ్లావేళ్లా పడి బ్యాంకు అర్హత పత్రాలు తీసుకువచ్చి దరఖాస్తు చేసుకున్నారు. రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షల వరకు రుణాల కోసం బ్యాంకు అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సబ్సిడీ, లబ్ధిదారుని సీరియల్ నంబర్ కూడా అందించారు. కానీ చివరికి రుణాలు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిదారి పట్టింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి రుణాలను త్వరితగతిన అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.