సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని, స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసిన బీసీలందరికీ రుణాలు ఇవ్వాలని, 500 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న కలెక్టరేట్లను ముట్టడించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం జరిగిన బీసీ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల విపక్ష చూపుతోందని ఆరోపించారు.
కొన్ని కులాలకు పూర్తి ఫీజు చెల్లించి, బీసీ విద్యార్థులకు మాత్రం అనేక ఆంక్షలు పెట్టి విద్యనభ్యసించకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా..గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించలేదన్నారు. 0బీసీ కార్పొరేషన్లు, 11 కుల ఫెడరేషన్లకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులు, బీసీలను అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సమావేశంలో బీసీ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment