బకాయిలు చెల్లించే వరకూ వదలం
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ప్రభుత్వ తీరుపై ఆర్.కృష్ణయ్య ధ్వజం
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదని, విద్యార్థులు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత ఏడాది ఫీజు బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. గత ఏడాది రూ.1800 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదివారన్నారు. ఉస్మానియా వర్సిటీ హాస్టళ్ల ఏడు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి చేతులు రావడంలేదని అన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను, మెస్ ఛార్జీలను, పాకెట్ మనీ పెంచాలని, కళాశాల హాస్టళ్లకు స్వంత భవనాలు కట్టించి వసతులు కల్పించాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.