నల్లగొండ : బీసీ రుణాలకు ఎన్నికల దెబ్బ పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఒక్కసారి అదీ అంతంత మాత్రంగానే రుణాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత 2015–16, 2016–17 సంవత్సరాల్లోనూ రుణాలివ్వలేదు. తిరిగి 2017–18 సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇవ్వలేదు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం అన్ని కార్పొరేషన్ల ద్వారా అందరికీ రుణాలు ఇస్తామని చెప్పడంతో నిరుద్యోగులు బీసీ కార్పొరేషన్‌ను కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 16,659 దరఖాస్తులు రాగా అందరికీ రుణాలు అనడంతో 11,564 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.
మొత్తం 28వేల దరఖాస్తులు వచ్చాయి. రూ.లక్ష మొదలుకొని రూ.12 లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు. ఇందులో వ్యక్తిగత రుణాలతోపాటు 11 ఫెడరేషన్ల పరంగానూ రుణాలు అందించాల్సి ఉంది. బీసీ రుణాలకు మొదట అసెంబ్లీ కోడ్ దెబ్బ తగిలి మూడు మాసాలు వెనుకబడి పోయాయి. గత జూలై మాసంలో మండలాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అంతకుముందు ఇస్తామన్న రుణాలు కాకుండా నూటికి నూరుశాతం సబ్సిడీ కింద రూ.లక్ష రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి విడతగా రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
అప్పట్లో ఆగస్టు 15 సందర్భంగా అప్పటికప్పుడు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పరేడ్‌గ్రౌండ్‌లోనే వారికి రుణాలను అందజేశారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో కోడ్ వచ్చి రుణాల పంపిణీ ఆగిపోయింది. మూడు నెలల పాటు ఎదురుచూపులు తప్పలేదు. ప్రస్తుతం అధికారులు ప్రభుత్వంనుంచి వచ్చిన రూ.6.35 కోట్లకు సంబంధించి ఆగస్టు 15న అందజేసిన వారికి మినహా మిగతా లబ్ధిదారులకు ఇచ్చేందుకు చెక్కులు తయారు చేసి సిద్ధంగా ఉంచారు.
888 చెక్కులు సిద్ధం....
రూ.50వేల చొప్పున పూర్తి సబ్సిడీ కింద లబ్ధిదారులకు ఇచ్చేందుకు చెక్కులను సిద్ధం చేశారు. మొత్తం 888 చెక్కులపై కలెక్టర్ సంతకం కూడా చేశారు. వాటన్నింటినీ లబ్ధిదారులకు అందించేందుకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
నేడు ఎంపీడీఓలకు అందించే అవకాశం...
సిద్ధం చేసిన చెక్కులన్నింటినీ లబ్ధిదారులకు అందించేందుకు గురువారం ఎంపీడీఓలకు అందించనున్నారు. వారు ఆయా మండలాల వారీగా లబ్ధిదారులతో సమావేశం నిర్వహించో... సమాచారం ఇచ్చి అందించాల్సి ఉంది.
ఎంపీడీఓలకు రిజర్వేషన్ బాధ్యతలు అప్పగింత
ప్రస్తుతం ఎంపీడీఓలు పంచాయతీ ఎన్నికల బిజీలో ఉన్నారు. గ్రామాల్లో రిజర్వేషన్ల వారీగా ఆయా కేటగిరీలను ఎంపిక చేసే బాధ్యతను సంబంధిత ఆర్‌డీఓ, ఎంపీడీఓలకు అప్పగించారు. ఈనెల 29 వరకు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంది. ఈ పనుల్లోనే ఎంపీడీఓలంతా తలమునకలయ్యారు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన చెక్కును ఏ మేరకు పంపిణీ చేస్తారనేది అర్థం కాని పరిస్థితి.
ఆలస్యమైతే అంతే...
పంచాయతీ ఎన్నికల కోడ్ వచ్చే లోపు పంపిణీ చేస్తే సరే.. లేదంటే అంతే సంగతులు. మళ్లీ వరుస ఎన్నికలతో నెలల కొద్ది ఆలస్యం కాకతప్పని పరిస్థితి నెలకొంది. దీంతో రాసి పెట్టిన చెక్కుల గడువు కూడా పూర్తయ్యే అవకాశం లేకపోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే చెక్కులు అందించాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment