సిద్దిపేట జోన్: ‘కుల వృత్తులను వీడి ఇతర వృత్తులు, మార్గాల్లో జీవనం సాగిస్తున్న బడుగు, బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో తీపి కబురు అందించనుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల కోసం ప్రత్యేక రుణ పథకాన్ని అమలు చేయనున్నారు’అని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. జిల్లా పద్మశాలి మహాసభలో మాట్లాడారు.
ప్రపంచీకరణ మార్పులతో కుల వృత్తులకు దూరమైన బీసీ వర్గాల కోసం రూ.4 వేల కోట్లతో రుణ పథకాన్ని సీఎం కేసీఆర్ త్వరలో అమలు చేయనున్నారని తెలిపారు. ఇందు లో రూ.2,000 కోట్లు ప్రభుత్వం, మరో రూ.2,000 కోట్లు బ్యాంకుల ద్వారా సేకరిస్తామన్నారు. లక్ష మందికి రూ.50 వేల చొప్పున, మరో లక్ష మందికి రూ.75 వేల చొప్పున మొత్తంగా 2 లక్షల మందికి బ్యాంక్ గ్యారంటీ, ష్యూరిటీ లేకుండా వంద శాతం సబ్సిడీతో రుణాన్ని అందించే పథకం రానుందన్నారు.
మరో 60 వేల మందికి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాన్ని కల్పించే పథకానికి రూపకల్పన జరుగుతోందని మంత్రి వెల్లడించారు. ఎంబీసీల కోసం రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. మండలానికో బీసీ గురుకులం ఏర్పాటుకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
చేనేతకు చేయూత..
ప్రభుత్వం చేనేత కులవృత్తులపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తోందని హరీశ్ పేర్కొన్నారు. రూ.700 కోట్లతో చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసి నేత కార్మికుడికి చేతి నిండా పని కల్పిస్తుందన్నారు. రూ.11 కోట్లతో చేయూత పథకంతోపాటు చేనేత మిత్ర కింద నూలు, రంగుల్లో 50 శాతం సబ్సిడీ అందిస్తున్నామన్నారు.
వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే 1,200 ఎకరాల భూ సేకరణ జరిగిందని, ఇటీవలే కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా లభించాయని వెల్లడించారు. రూ.1,000 కోట్లతో వ్యవసాయంపై ఆధారపడిన బీసీ వర్గాలకు పశుసంపద అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ముఖ్యమంత్రి సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment