సామాజిక అన్యాయం | Social Injustice In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 9:05 AM | Last Updated on Fri, Nov 2 2018 9:11 AM

Social Injustice In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: అక్షరాలా 12 కార్పొరేషన్లు, 11 బీసీ ఫెడరేషన్లు.. వీటికి బడ్జెట్‌ కేటాయింపులు రూ.3,746.8 కోట్లు. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3.30 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటిదాకా ఎంతమందికి, ఎన్ని రుణాలు ఇచ్చారో చూస్తే.. కనిపించేది పెద్ద గుండుసున్నా. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు తదితర సామాజిక వర్గాల సంక్షేమం పట్ల నాలుగున్నరేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త డ్రామాకు శ్రీకారం చుడుతోంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మోక్షమెప్పుడో?
లబ్ధిదారులకు రుణాలు విడిగా ఇవ్వకుండా ఎన్నికల ముందు మేళాలు నిర్వహించి, ప్రచారం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా పైసా కూడా రుణాలు ఇవ్వకుండా దగా చేసిన సర్కారు తీరుపై లబ్ధిదారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నెలకోసారి రుణమేళాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. వచ్చే నెల నుంచి రుణమేళాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కొన్ని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. ఈ దరఖాస్తులకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

గతంలో ఏడు కార్పొరేషన్లు ఉండేవి. కొత్తగా ఎంబీసీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, దూదేకుల ముస్లిం కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీసీల్లో వెనుకబడిన కులాల కోసం 11 ఫెడరేషన్లు ఉన్నాయి. ఒక్కో ఫెడరేషన్‌లకు రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు కేటాయించారు. రజక, కల్లుగీత కార్మిక ఫెడరేషన్‌లకు మాత్రం రూ.70 కోట్లు కేటాయించారు. ఈ అరకొర నిధులతో ఎక్కువ మందికి రుణాలు దక్కే అవకాశం లేదని బీసీ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారికి, టీడీపీ కార్యకర్తలకే రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.

బీసీల్లో అన్ని వర్గాలనూ మోసం చేశారు
‘‘వెనుకబడిన తరగతుల్లో అన్ని వర్గాల వారినీ తెలుగుదేశం పార్టీ మోసం చేసింది. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజమైన లబ్ధిదారులకు రుణాలు అందడం లేదు. రుణమేళాలు పెట్టి అధికార పార్టీ కార్యకర్తలకు రుణాలు ఇవ్వాలని చూస్తున్నారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీ కులాలకు టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. పైగా బీసీ సబ్‌ప్లాన్‌ అంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
– జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు  

రుణమేళాల పేరుతో మరో గిమ్మిక్కు
‘‘గత ఏడాది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కేవలం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి, అధికార పార్టీ నేతల బినామీలకే ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చారు. ఇప్పుడు రుణమేళాల పేరుతో ప్రభుత్వం మరో గిమ్మిక్కు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచింది. ఇప్పటిదాకా ఇవ్వని రుణాలను ఎన్నికల ముందు ఇస్తామని చెబుతున్నారంటే ప్రభుత్వ పెద్దల కుట్రను అర్థం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి చేతులు దులుపుకుంటే సరిపోదు.  
– ఆండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement