సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కార్యక్రమాలు విస్తరించి, పటిష్టం చేసేందుకు ఆయా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే ఉమ్మడి జీసీసీ విభజనలో జాప్యం జరుగుతుండటంతో ఈ ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు, ఇక్కడి అటవీ ఫలసాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదని, అందుకే జీసీసీని బలోపేతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రెండు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఒకటి మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూర్ లేదా నల్లగొండలో, రెండోది మెదక్ జిల్లా నరసాపూర్‌లో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా పరిగి, మెదక్ జిల్లా నరసాపూర్, నల్లగొండ జిల్లా చందంపేట, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో 4 కొత్త సొసైటీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. గమ్‌కరాయ (తప్సిజిగురు), నక్స్‌వోమికా, మొహ్వా, పొంగుమా, వేప, చింతపండు తదితర అటవీ ఉత్పత్తుల కోసం అడవుల్లో మొక్కల పెంపకం వంటి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
8 కొత్త ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు..!
రాష్ర్టంలోని గిరిజన ప్రాంతాల్లో సేకరించిన అటవీ ఉత్పత్తుల నుంచి ఆయా వస్తువుల తయారీ, శుద్ధి చేసే కేంద్రాలు లేవు. ఇందుకోసం 8 తయారీ, శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వరంగల్ జిల్లా ములుగులో జిగురు శుద్ధి యూనిట్, వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో పసుపు పొడి కేంద్రం, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో సబ్బుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
అలాగే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో సోయా ప్రాసెసింగ్ యూనిట్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తేనె శుద్ధి కేంద్రం, మహబూబ్‌నగర్ జిల్లా కొండనాగులలో షాంపూ తయారీ కేంద్రం, మహబూబ్‌నగర్ జిల్లా కొండనాగులలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని భావిస్తోంది. గిరిజన సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులు పంపిణీ చేసేందుకు వీలుగాహైదరాబాద్‌లో వివిధ ఉత్పత్తుల నిలువకు కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను గతంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ విడుదల చేశారు.
త్వరలో ‘నిర్మల్’ సబ్బులు!
Published Fri, Nov 6 2015 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement
Advertisement