ఎస్సీ హాస్టల్ తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు, ఉప్మారవ్వలో పురుగులు ఉన్న దృశ్యం
హిందూపురం అర్బన్/అనంతపురం సెంట్రల్: జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో సౌకర్యాలపై బుధవారం రీజనల్ విజిలెన్స్ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి అనంతపురం, తాడిపత్రి, హిందూపురం తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు. అయితే అన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం వెలుగుచూసింది. పిల్లలకు నాసిరకం భోజనం వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బయోమెట్రిక్ మిషన్లు వినియోగించకుండా ఎక్కువ మంది విద్యార్థుల చూపిస్తూ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తేల్చారు. ఈ విషయాలన్నింటినీ గుర్తించి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు లేఖను పంపుతామని రీజనల్ విజిలెన్స్ అధికారి రామాంజనేయులు తెలిపారు.
తెల్లవారుజామునుంచే..
విజిలెన్స్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి బుధవారం తెల్లవారుజామునే హిందూపురం, పరిగి ప్రాంతాల్లో ఎస్సీ వసతి గృహాల్లో తనిఖీలు చేశారు. వసతులు, నిత్యావసర సరుకుల కొనుగోలు, వస్తువుల వినియోగం, పారిశుద్ధ్యం, విద్యార్థుల సంఖ్య ఇలా అన్ని కోణాల్లో తనిఖీలు చేశారు. రికార్డుల ప్రకారం నమోదు చేస్తున్న వివరాలు కూడా పరిశీలించారు. హిందూపురం హాస్టల్‌లో 42 మంది దాకా విద్యార్థులుండగా హాజరుపట్టికలో మాత్రం 108 మంది ఉన్నట్లు చూపారు. హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాసిరకం వస్తువులు వినియోగించి విద్యార్థులకు భోజనం పెడుతూ నిధులు స్వాహా చేసినట్లు అధికారులు గుర్చించారు. హాస్టల్‌లో నిల్వ చేసిన వేరుశనగ విత్తనాలు, పప్పు దినుసులు పుచ్చిపోయి పురుగులు కనిపిస్తున్నా...వాటితో చెట్నీ చేసి విద్యార్థులకు వడ్డించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక అన్ని వంటల్లో వినియోగించే ఉప్పు, నూనెలు కాలం తీరినవే ఉన్నాయి. అన్నం పూర్తిగా ముద్దగా మారడమే కాకుండా ఉంటలుగా కట్టి ఉంది. ఉదయం వండిన పులిహోర రుచి చూడగా జిగటలాగా అతుక్కుపోతోంది.
తాగునీరు..పారిశుద్ధ్యం అధ్వానం
హాస్టల్‌లో తాగునీటిని బయటనుంచి కొనుగోలు చేస్తుండగా... మరుగుదొడ్ల, బాత్‌రూంలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటిలో ఒకదానికి కూడా తలుపులు సరిగాలేవు. వీటిని శుభ్రం చేసే వారు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటకు వెళాల్సి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం హిందూపురం హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులతో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించారు.
నివేదికలు అందిస్తాం
హాస్టళ్ల పరిస్థితి..సౌకర్యాలు..అధికారుల తీరుపై ఓ నివేదికను ఉన్నతాధికారులకు పంపి చర్యలకు సిఫారసు చేస్తామని రీజనల్ విజిలెన్స్ అధికారి రామాంజనేయులు తెలిపారు. తనిఖీల్లో సీఐలు రెడ్డప్ప, విశ్వనాథ చౌదరి, శ్రీనివాసరెడ్డి, డీఈ రవీంద్రకుమార్, డీసీటీఓ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ రామకృష్టయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment