వసతి గృహాలపై విజిలెన్స్‌ దాడులు | Vigilance Attack On Hostels Chittoor | Sakshi
Sakshi News home page

వసతి గృహాలపై విజిలెన్స్‌ దాడులు

Published Fri, Sep 7 2018 11:33 AM | Last Updated on Fri, Sep 7 2018 11:33 AM

Vigilance Attack On Hostels Chittoor - Sakshi

మరుగుదొడ్ల వద్ద టిఫిన్‌ చేస్తున్న విద్యార్థులు

చిత్తూరు ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని వసతి గృహాలపై విజిలెన్స్‌ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 12 బృందాలుగా విడిపోయి  ఉదయం ఆరు గంటల నుంచే ముమ్మర తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని 12 ఎస్సీ వసతి గృహాల్లో ఒకేసారి విజిలెన్స్‌ దాడులు నిర్వహిం చారు.  చిత్తూరులోని సంజయ్‌గాంధీనగరలో ఉన్న బాలుర వసతి గృహం, పచ్చికాపల్లం బాలు ర వసతి గృహం, వెదురుకుప్పం (బాలురు), కార్వేటినగరం(బాలురు, బాలికలు), మదనపల్లెలో (బాలురు), బైరెడ్డిపల్లిలో (బాలురు), పలమనేరు వద్ద కొలమాసనపల్లి (బాలురు), వరదయ్యపాళెం మండలంలోని సంతవేలూరు (బాలురు),వరదయ్యపాళెం గంగాధరనెల్లూరు(బాలికల) వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని సంజయ్‌గాంధీనగర్‌ లో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో విజిలెన్స్‌ డీఈ శ్రీనివాసరెడ్డి తనిఖీలు చేపట్టారు. అక్కడి రికార్డులు, మరుగుదొడ్లు, వంటగది, స్టాక్‌రూం, బయోమెట్రిక్, తదితర అంశాలను  క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు.

తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు
చిత్తూరులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉదయం 6 గంటలకు వార్డెన్‌ లేకపోవడాన్ని గుర్తించారు.  హాస్టల్‌కు సరఫరా చేసే నిత్యావసర వస్తువుల వివరాలను రోజువారి స్టాకు రిజిస్టర్‌లో నమోదు చేయడం లేదని తేలింది. స్టోర్‌ రూంలో ఎక్కువ బియ్యం బస్తాలు ఉన్నాయని, విద్యార్థులకు వైద్యులు మూడేళ్లుగా హాస్టల్‌కు వచ్చి చికిత్స చేయడం లేదని గుర్తించారు. అలాగే నాసిరకం కందిపప్పు వాడకం, ట్యూటర్లు లేకున్నా బిల్లులు పెట్టుకోవడం ఇలా పలు అక్రమాలు తనిఖీల్లో తేలాయి. ఇదే విధంగా జిల్లాలో మిగిలిన వసతి గృహాల్లో చాలా అక్రమాలను విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. అవకతవకలు, సౌకర్యాల లేమి వంటి వాటిపై సంబంధిత హాస్టల్‌ వార్డెన్ల నుంచి లిఖిత పూర్వకంగా నివేదికలు తీసుకున్నారు. వీటిని విజిలెన్స్‌ డీజీకి పంపి, అక్కడ నుంచి ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ముందుగానే నిఘా పెట్టాం
సోషల్‌ వెల్ఫేర్‌ వసతి గృహాలను తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గురువారం జిల్లాలోని 12 ఎస్సీ వసతి గృహా ల్లో తనిఖీలు చేశాం. గత రెండు నెలల్లో చిత్తూరు జిల్లాలోని 10 వసతి గృహాలను తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. అదే విధంగా గురువారం జరిగిన తనిఖీల్లో డైట్‌చార్టు అమలుచేయకపోవడం,  ఎక్కువ సరుకులు పొందుతుండడం, బయోమెట్రిక్‌  పనిచేయకపోవడం వంటి అక్రమాలు బయటపడ్డాయి.– రాధాకృష్ణ, విజిలెన్స్‌ ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement