శిరోముండనం అయిన విద్యార్థులు
హన్మకొండ చౌరస్తా: అమ్మా, నాన్న పిలుపునకు దూరమై.. నా అనేవారు లేని పిల్లల సంరక్షణ చూడాల్సినవారే అమానుషంగా ప్రవర్తించారు. సరైన భోజనం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించినందుకు హింసించారు. అంతటితో అహం చల్లారక గుండు గీయించారు. అమానుషమైన ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ పట్టణ వీధి బాలల వసతి గృహంలో సుమారు వంద మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. పిల్లలందరూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు.
వారం రోజులుగా వార్డెన్ అర్చన వ్యక్తిగత సెలవులో ఉండగా, వసతి గృహాన్ని ట్యూటర్ రాజు, వాచ్‌మన్ జవహర్‌లే నిర్వహిస్తున్నారు. అయితే నీళ్ల చారు, సరిగా ఉడకని అన్నాన్ని వడ్డించడంపై రెండు రోజుల క్రితం కల్యాణ్, దిలీప్, అక్షయ్‌వర్మ అనే విద్యార్థులు ట్యూటర్, వాచ్‌మన్‌లను నిలదీశారు. దీంతో ‘మమ్మల్నే అడుగుతార్రా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఆ ముగ్గురు విద్యార్థులను చితకబాదారు. అయినప్పటికీ శాంతించని వాచ్‌మన్, ట్యూటర్‌లు ఆ ముగ్గురికి గుండు చేయించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఏబీఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎస్‌బీ, డీఎస్‌యూ విద్యార్థి సంఘాలు బుధవారం సాయంత్రం వసతి గృహం ఎదుట ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏబీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ ట్యూటర్, వాచ్‌మన్‌లను విధుల నుంచి తొలగించాలని, మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన ఉధృతం కాకుండా బందోబస్తు చేపట్టారు.
ఆ ఇద్దరిని తొలగించాం
విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ట్యూటర్ రాజు, వాచ్‌మన్ జవహర్‌ను తొలగిస్తూ ఉదయమే తీర్మానం చేశాం. వారిద్దరిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. పిల్లలకు సరైన భోజనం పెట్టడం లేదనడం సరైంది కాదు. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం.
– కేడల పద్మ, నిర్వాహకురాలు,పట్టణ వీధి బాలల వసతి గృహం, లష్కర్‌బజార్
Comments
Please login to add a commentAdd a comment