సమావేశంలో మాట్లాడుతున్న డీడీ ప్రసాదరావు
– డీడీ యు.ప్రసాదరావు
కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల బయోమెట్రిక్ హాజరుతోనే ఇక నుంచి మెస్ బిల్లులు విడుదలవుతాయని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు అన్నారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో సహాయ సంక్షేమాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 1వ తేదీ నుంచి అన్ని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల హాజరుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. బయోమెట్రిక్ మిషన్లలో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలను దృష్టిలో ఉంచుకొని ఐరిస్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ‘వనం–మనం’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీన హాస్టళ్లలో మొక్కలు నాటాలన్నారు. విద్యార్థుల యూనిఫాంను.. ఆయా హాస్టల్ పాయింట్లలోనే కుట్టించేందుకు అవసరమైన క్లాత్‌ను సహాయ సంక్షేమాధికారులు తీసుకువెళ్లాలన్నారు. ట్యూటర్లు, ప్లేట్లు, గ్లాసులు.. ఇతర అవసరమైన వస్తువుల కోసం ప్రతిపాదనలను అందించాలన్నారు. వసతి గృహాలు విలీనం అయిన దృష్ట్యా టీసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న హెచ్‌ఎంల వివరాలను తనకు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ప్రకాష్‌రాజు, సహాయ సంక్షేమాధికారులు రవీంద్రనాథ్‌రెడ్డి, నాగభూషణం, లక్ష్మయ్య, శ్రీరామచంద్రుడు, గోవిందప్ప, జాకీర్‌హుసేన్ పాల్గొన్నారు.