ఉత్తీర్ణత పదిలమేనా..! | tenth class students suffering in scst hostels | Sakshi
Sakshi News home page

ఉత్తీర్ణత పదిలమేనా..!

Published Mon, Jan 8 2018 10:21 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

tenth class students suffering in scst hostels

ఒంగోలు సెంట్రల్‌:  జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్య సరిగా అందడం లేదు. మరో 70 రోజుల్లో పరీక్షలు ప్రారంభమవుతున్నా అధికారుల్లో చలనం లేదు. వసతి గృహ విద్యార్థుల విద్యలో మార్పు లేదు.  ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ పదో తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా స్టడీ అవర్స్‌ నిర్వహించాల్సి ఉన్నా వార్డెన్లు చదివించడం లేదు. వార్డెన్లు రెండు పూటలా వసతి గృహాలకు రావడం లేదు. కొంత మంది ఇతర దూర ప్రాంతాల్లో నివాసం ఉంటూ రైళ్లు, బస్సుల టైం టేబుల్‌ ప్రకారం వస్తున్నారు. వార్డన్లే వసతి గృహాలకు సరిగ్గా రాకపోతుండటంతో ట్యూటర్లు కూడా చుట్టపు చూపుగా వస్తున్నారు. పరీక్షలకు ఈ చివరి రోజుల్లో విద్యార్థులు చదువుతున్నారా, లేదా వార్డెన్లు పర్యవేక్షిస్తున్నారా అనే విషయం తెలుసుకోవడానికి టెలీ కాన్ఫరెన్సులు అధికారులు నిర్వహించడం లేదు. దీంతో వార్డెన్ల పని ఇష్టారాజ్యమైంది.

గత ఏడాది అప్పటి కలెక్టర్‌ హాస్టళ్లలో విద్యార్థులు ఉత్తీర్ణత కాకపోతే వసతి గృహæ సంక్షేమ అధికారులను బాధ్యులను చేస్తామనడంతో కొంత వరకూ ఆశించిన ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితులు కనపడటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ట్యూటర్లకు రూ.1500  గౌరవ వేతనంగా అందిస్తున్నారు. ట్యూటర్లు లెక్కలు, ఇంగ్లిషు, హిందీ, సైన్స్‌ సబ్జెక్ట్‌లను విద్యార్థులకు బోధిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సంక్షేమ శాఖలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు 71 వసతి గృహాల్లో ఉన్నారు. వీటి పరిధిలో 1100 మంది చదువుతున్నారు. వీరిలో 870 మంది బాలురు, 230 మంది బాలికలు. ఈ శాఖలో ట్యూటర్లకు ఏడాదికి రూ.41 లక్షలు వెచ్చిస్తున్నారు. 140 మంది ట్యూటర్లు విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. అదే ఎస్టీ సంక్షేమ శాఖలో 14 వసతి గృహాల్లో 162 మంది పదో తరగతి చదువుతున్నారు. ట్యూటర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం కింద అందిస్తున్నారు. ఈ శాఖలో మొత్తం 43 మంది ట్యూటర్లు ఉన్నట్లు అధికా రులు అంటున్నారు. అదే వెనుకబడిన తరగతుల శాఖలో 76 వసతి గృహాల్లో 1100 మంది పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 920 మంది బాలురు, 180 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. 150 మంది ట్యూటర్లను నియమించారు.

ఇప్పటికీ అందని ఆల్‌ఇన్‌వన్‌ గైడ్‌లు, స్టడీ మెటీరియల్స్‌: ప్రభుత్వ వసతి గృహంలోని విద్యార్థులు పదో తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు గతంలో అధికారులు ఆల్‌ఇన్‌వన్‌ గైడ్‌లు, స్టడీ మెటీరియల్స్‌ అందించేవారు. అయితే ప్రస్తుతం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులు తమకు పాఠశాలలో చెప్పిన పాఠాలనే చదువుకుంటూ, సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఆల్‌ఇన్‌వన్‌లు, గైడ్‌ల సరఫరా టెండర్లు, కొటేషన్ల దశలోనే ఉంది. ఎస్సీ హాస్టళ్లకు కూడా ఇంకా ఇవ్వలేదు. బీసీ హాస్టళ్లలో కొందరికి మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన వారికి ప్రింటింగ్‌ అయిన తరువాత పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఏడాదిగా ట్యూటర్లకు ఏ సంక్షేమ శాఖలోనూ గౌరవ వేతనాలు విడుదల కాలేదు. దీంతో వారు కూడా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం లేదు.

త్వరలో సమావేశం నిర్వహిస్తాం
జిల్లాలోని వసతిగృహ అధికారులతో పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని త్వరలో నిర్వహిస్తాం. విద్యార్థులకు ఆల్‌ఇన్‌వన్‌ గైడ్‌లు, ప్రతి రోజు విద్యా ప్రణాళిక స్టడీ మెటీరియల్, విద్యార్థులకు ఓరియంటేషన్‌ తరగతులు, చదువులో పూర్తిగా వెనుకబడిన విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. – మువ్వా లక్ష్మీ సుధ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement