హాస్టళ్లపై ఏసీబీ మెరుపు దాడులు | ACB Rides On hostels PSR Nellore | Sakshi
Sakshi News home page

హాస్టళ్లపై ఏసీబీ మెరుపు దాడులు

Published Tue, Sep 11 2018 1:37 PM | Last Updated on Tue, Sep 11 2018 1:37 PM

ACB Rides On hostels PSR Nellore - Sakshi

వింజమూరులో విద్యార్థ్ధులతో మాట్లాడుతున్న అధికారులు

జిల్లాలోని వింజమూరు, రాపూరువసతి గృహాలపై సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంఖ్య కంటే హాజరు పుస్తకంలో సంఖ్య ఎక్కువగా ఉండడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని , బాత్‌రూములు సరిగా లేవని అధికారులను నిలదీశారు. విద్యార్థులఅవస్థలను చూసి వారు చలించారు. మెనూ ప్రకారం భోజనం అందడంలేదని తెలుసుకున్నారు. విద్యార్థులతో హాస్టల్‌లోనే ఉండాల్సిన వార్డెన్‌లు లేకపొవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతిగృహాల్లో ఉన్న పరిస్థితులపై అధికారులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వింజమూరు హాస్టల్‌లో 64 మంది విద్యార్థులు ఉండగా, రికార్డులో మాత్రం 174 ఉండడాన్ని గుర్తించారు. రాపూరులోనూ అదే పరిస్థితి.

నెల్లూరు, వింజమూరు/రాపూరు: లంచాల కోసం వేధిస్తూ, అవినీతికి పాల్పడే అధికారులు, ఉద్యోగుల భరతం పట్టే ఏసీబీ అధికారులు వసతిగృహాలపై కన్నేశారు. సోమవారం రాత్రి జిల్లా ఏసీబీ అధికారులు బృందాలుగా వింజమూరు, రాపూరులోని వసతిగృహాలపై మెరుపుదాడులు చేశారు. వింజమూరులోని బీసీ బాలుర వసతి గృహంపై సోమవారం రాత్రి నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ దేవదానం ఆధ్వర్యంలో దాడులు జరిగాయి,. వసతి గృహానికి రాత్రి 7 గంటలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యార్థులు చీకటిలో ఉండడంపై డీఎస్పీ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గదిలోని వంటగది, స్టాక్‌రూము, మరుగుదొడ్లను పరిశీలించారు. బియ్యపు గంజి అక్కడే నిల్వ ఉండి దుర్వాస రావడాన్ని గమనించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ దేవదానం విలేకరులతో మాట్లాడుతూ దాడులు జరిపిన సమయంలో సంక్షేమాధికారి వసతిగృహంలో లేరన్నారు.

తాము సమాచారం ఇచ్చిన తర్వాత వసతిగృహానికి వచ్చారన్నారు. ప్రధానంగా ఆదివారం 174 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉన్నట్లు హాజరు పుస్తకంలో ఉందన్నారు. ప్రస్తుతం 64 మంది మాత్రమే ఉన్నారన్నారు. బాత్‌రూములు సక్రమంగా లేవని, విద్యార్థులు బాత్‌రూముల్లో పెట్టెలు పెట్టుకుని ఆరుబయట పడుకునే దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు. వంట మనిషి సైతం వసతి గృహంలో లేరన్నారు. వసతి గృహానికి సంబంధించిన పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏసీబీ సీఐ రమేష్‌బాబు, సంక్షేమాధికారి జయరామయ్య, సిబ్బంది ఉన్నారు. రాపూరులోని సాంఘిక సంక్షేమ సమీకృత వసతి గృహంలో ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థులను, హాస్టల్‌ సిబ్బందిని విచారించారు. మెనూ సక్రమంగా అమలుకావడం లేదని, స్టాక్‌ నిల్వల్లో అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. విద్యార్థులు హజరులో 190 మంది ఉండగా ప్రస్తుతం 157 మంది ఉన్నట్టు గమనించారు. వసతి గృహంలో వార్డెన్‌ ఉండడం లేదని తెలుసుకున్నారు. సామగ్రి కొనుగోలుకు సంబంధించి బిల్లులు సక్రమంగా ఉన్నాయా?లేదా? అనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు శివకుమార్‌రెడ్డి, రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఏఎస్‌డబ్ల్యూ హాస్టళ్లలో తనిఖీలు జరుపుతున్నారా? లేదా? అనే విషయాన్ని విచారిస్తామన్నారు. వసతి గృహంలో నెలకొన్న పరిస్థితులపై సాంఘిక సంక్షేమ అధికారులకు, కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement