వసతి..ఇదేం దుస్థితి
- హాస్టళ్లలో కనిపించని సౌకర్యాలు
- మరో 8 రోజుల్లో పునః ప్రారంభం
- రూ.3.45 కోట్లతో ప్రతిపాదనలు
- పట్టించుకోని ప్రభుత్వం
- ఈ ఏడాదీ విద్యార్థులు అవే అవస్థలు
మరమ్మతులు చేపట్టాల్సిన వసతి గృహాల సంఖ్య
బీసీ సంక్షేమ శాఖ: 37
సాంఘిక సంక్షేమ శాఖ: 40
గిరిజన సంక్షేమం: 17
కర్నూలు(అర్బన్): తలుపులు లేని వాకిళ్లు .. రెక్కలు లేని కిటికీలు .. వెలగని విద్యుత్ బల్బులు.. గదుల నిండా చెత్తాచెదారం.. అరకొర తాగునీరు.. ఇలా అనేక సమస్యల మధ్య ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు వసతి గృహాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే పారదర్శకత పేరుతో పలు హాస్టళ్లను విలీనం చేసిన ప్రభుత్వం ఉన్న అరకొర వసతి గృహాల్లో కూడా విద్యార్థులకు అవసరమైన వసతలు కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఆయా వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించేందుకు పంపిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. దీంతో అసౌకర్యాల నీడనే పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువులు కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది.
జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 50 వసతి గృహాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఒక్క హుసేనాపురం మినహా మిగిలిన 49 వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వసతి గృహాల్లో దాదాపు 8,400 మంది విద్యార్థులు వసతులు పొందుతున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 54 వసతి గృహాలు ఉండగా, వీటిలో శ్రీశైలం మినహా మిగిలిన అన్ని వసతి గృహాలు సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వసతి గృహాల్లో దాదాపు 9 వేల పైచిలుకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 11 ఆశ్రమ పాఠశాలలు, ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక ప్రీమెట్రిక్ హాస్టల్ సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో 2,400 మంది విద్యార్థులు ఉన్నారు.
సౌకర్యాలేవీ..
గృహాల్లో విద్యుత్ సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని వసతి గృహాలకు ప్రహరీలు లేవు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. గోడలకు వైట్ వాష్ చేయలేదు. ఫ్యాన్లు పనిచేయడం లేదు. బోర్లు, స్నానపుగదుల మరమ్మతులు చేయాల్సి ఉంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 37 వసతి గృహాల్లో చేపట్టాల్సిన మరమ్మతులకు సంబంధించి గత ఏడాదే రూ. 72.98 లక్షలు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపారు. అలాగే 40 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని మరమ్మతులకు రూ.2.52 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పలు రిపేర్లు చేపట్టేందుకు రూ.21.50 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు.
నిధులు వస్తే మరమ్మతులు చేపడతాం
వసతి గృహాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆదోని డివిజన్‌లోని ఇంగళ్‌దహాల్ వసతి గృహానికి మాత్రం రూ.25 లక్షలను విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే ఆయా వసతి గృహాల్లో మరమ్మతులు చేపడతాం.
- బి.సంజీవరాజు, జిల్లా బీసీ సంక్షేమాధికారి