సాక్షి, హైదరాబాద్: హాస్టళ్లలో బయో మెట్రిక్ హాజరు విధానం అటకెక్కింది. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మెషిన్లు పనిచేయడంలేదు. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతూ వసతిగృహ సంక్షేమాధికారులు హాజరు ప్రక్రియను పాతపద్ధతికి మార్చేశారు. వసతిగృహాల్లో విద్యార్థుల హాజరులో అక్రమాలకు చెక్ పెట్టడానికిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాయి. వసతిగృహ సంక్షేమాధికారితోపాటు సిబ్బంది సైతం వేలిముద్రలతో బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో దాదాపు వెయ్యికిపైగా సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ మెషిన్లను ఏర్పాటు చేశారు.
సరికొత్తగా తీసుకొచ్చిన ఈ విధానంతో వసతి గృహాల్లో అవకతవకలు సైతం అదుపులోకి రాగా ప్రభుత్వానికి భారీగా ఖర్చులు తగ్గాయి. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ హాజరు విధానం స్తంభించి పోయింది. ఈ విధానంలో ఆధార్ నంబర్లే కీలకం. ఆధార్ నమోదు చేసుకున్నవారికే బయోమెట్రిక్ హాజరు తీసుకునే అవకాశం ఉండేలా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీంతో ఒక విద్యార్థి హాజరు మరొకరు వేసే అవకాశం ఉండదు. ఇటీవల ఆధార్ వివరాలతో ఉన్న టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం మెరుగుపరిచింది.
వరుసగా రెండుసార్లు అప్‌డేట్ కావడంతో ఆ మెషిన్లు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను సపోర్ట్ చేయడం లేదు. ఈ క్రమంలో బయోమెట్రిక్ మెషిన్లలోనూ ఆధార్ సాఫ్ట్‌వేర్‌ను సపోర్ట్ చేసేలా కొత్త వెర్షన్ అప్‌డేట్ చేయాల్సి ఉంది. అయితే, కొత్త సాఫ్ట్‌వేర్‌పై సంక్షేమ శాఖలు శ్రద్ధ పెట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో హాజరు నమోదులో గందరగోళం నెలకొంది. మెషిన్లు పనిచేయడం లేదంటూ వసతిగృహ సంక్షేమాధికారులు దాదాపు ఐదు నెలలుగా మాన్యువల్ పద్ధతిలోనే హాజరు స్వీకరిస్తున్నారు. దీంతో అవకతవకలకు మళ్లీ ఆస్కారం ఏర్పడింది. అక్రమార్కులకు మళ్లీ కలసి వచ్చినట్లైంది. వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు, హాజరుపట్టికలోని వివరాలకు పొంతన లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ మెషిన్లలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చే అంశంపై నిపుణులతో అధికారులు చర్చిస్తున్నారు.
స్తంభించిన బయోమెట్రిక్ హాజరు!
Published Sat, Nov 18 2017 1:37 AM | Last Updated on Sat, Nov 18 2017 1:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment