Bio-metric
-
స్తంభించిన బయోమెట్రిక్ హాజరు!
సాక్షి, హైదరాబాద్: హాస్టళ్లలో బయో మెట్రిక్ హాజరు విధానం అటకెక్కింది. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మెషిన్లు పనిచేయడంలేదు. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతూ వసతిగృహ సంక్షేమాధికారులు హాజరు ప్రక్రియను పాతపద్ధతికి మార్చేశారు. వసతిగృహాల్లో విద్యార్థుల హాజరులో అక్రమాలకు చెక్ పెట్టడానికిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాయి. వసతిగృహ సంక్షేమాధికారితోపాటు సిబ్బంది సైతం వేలిముద్రలతో బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో దాదాపు వెయ్యికిపైగా సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ మెషిన్లను ఏర్పాటు చేశారు. సరికొత్తగా తీసుకొచ్చిన ఈ విధానంతో వసతి గృహాల్లో అవకతవకలు సైతం అదుపులోకి రాగా ప్రభుత్వానికి భారీగా ఖర్చులు తగ్గాయి. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ హాజరు విధానం స్తంభించి పోయింది. ఈ విధానంలో ఆధార్ నంబర్లే కీలకం. ఆధార్ నమోదు చేసుకున్నవారికే బయోమెట్రిక్ హాజరు తీసుకునే అవకాశం ఉండేలా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీంతో ఒక విద్యార్థి హాజరు మరొకరు వేసే అవకాశం ఉండదు. ఇటీవల ఆధార్ వివరాలతో ఉన్న టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం మెరుగుపరిచింది. వరుసగా రెండుసార్లు అప్డేట్ కావడంతో ఆ మెషిన్లు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను సపోర్ట్ చేయడం లేదు. ఈ క్రమంలో బయోమెట్రిక్ మెషిన్లలోనూ ఆధార్ సాఫ్ట్‌వేర్‌ను సపోర్ట్ చేసేలా కొత్త వెర్షన్ అప్డేట్ చేయాల్సి ఉంది. అయితే, కొత్త సాఫ్ట్‌వేర్‌పై సంక్షేమ శాఖలు శ్రద్ధ పెట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో హాజరు నమోదులో గందరగోళం నెలకొంది. మెషిన్లు పనిచేయడం లేదంటూ వసతిగృహ సంక్షేమాధికారులు దాదాపు ఐదు నెలలుగా మాన్యువల్ పద్ధతిలోనే హాజరు స్వీకరిస్తున్నారు. దీంతో అవకతవకలకు మళ్లీ ఆస్కారం ఏర్పడింది. అక్రమార్కులకు మళ్లీ కలసి వచ్చినట్లైంది. వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు, హాజరుపట్టికలోని వివరాలకు పొంతన లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ మెషిన్లలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చే అంశంపై నిపుణులతో అధికారులు చర్చిస్తున్నారు. -
ఆసరా ‘గుర్తింపు’ పూర్తి
జీవాధార గుర్తింపునకు 15 వేల మంది దూరం జోగిపేట: ఆసరా లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్ (జీవాధార గుర్తింపు) పొందేందుకు గడువు బుధవారంతో ముగిసింది. పెన్షన్ల మంజూరులో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మీసేవ కేంద్రాల్లో వేలిముద్రలు, ఐరిస్ ద్వారా బతికున్నట్టు గుర్తింపు నమోదు చేసుకుంటేనే ప్రతి నెలా పెన్షన్ వచ్చేలా మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు జూన్ 1 నుంచి 20 వరకు గడువు విధించింది. ఆపై జూలై 20 వరకు గడువు పొడిగించారు. బ్యాంకు ద్వారా ఆసరా పెన్షన్లు పొందుతున్న 1,39,449 మందికి గాను, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 1,23,857 మంది జీవాధార గుర్తింపును నమోదు చేసుకున్నారు. 15,592 మంది నమోదుకు దూరమయ్యారు. కాగా, నమోదైన వారిలో 6 వేల మంది చెల్లని ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. 2,000 నుంచి 3,000 మంది మీసేవ కేంద్రాలకు వెళ్లలేదని, ఎందుకు వెళ్లలేదనేది గ్రామ కార్యదర్శుల ద్వారా విచారణ జరిపించి నివేదికను తెప్పించుకోనున్నట్టు అధికారులు చెప్పారు. మున్సిపాలిటీల్లోనే అక్రమాలు జిల్లాలోని మున్సిపాలిటీల్లోనే ఆసరా పథకంలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందినట్టు తెలిసింది. ఏడాది నుంచి ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్ పింఛనుదారుల్లో ఒక్కరికి కూడా డిలీట్ కాకపోవడం గమనార్హం. జీవాధార గుర్తింపు నమోదు పూర్తయిన తర్వాత జిల్లాలో 1,500 మంది చనిపోయిన వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు పడుతున్నాయని గుర్తించారు. ఇటీవల దుబ్బాక నగర పంచాయతీలో 75 పెన్షన్లు చనిపోయిన వారి పేరిటే మంజూరవుతున్నట్టు తేలింది. పుల్కల్, కొండపాక ప్రాంతాల్లో సైతం 20–30 మంది చనిపోయిన వారికి కూడా పెన్షన్లు యథావిధిగా వస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో 3.20 లక్షల పెన్షన్లు జిల్లాలో ఆసరా పథకం కింద 3.20 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వీరిలో 1.39,449 మంది బ్యాంకు ఖాతా, లక్ష మంది పోస్టాఫీసు, మరో 89 వేల మంది మాన్యువల్ (పంచాయతీ కార్యదర్శుల ద్వారా)గా నెలనెలా పెన్షన్లు పొందుతున్నారు. అయితే ప్రభుత్వం బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న వారికే ప్రతి ఆరు నెలలకోసారి జీవాధార గుర్తింపున నమోదు చేసుకోవాలని నిర్దేశించింది. 50 రోజుల పాటు జిల్లాలోని అన్ని మీసేవ కేంద్రాల్లో లబ్ధిదారులు ఈ మేరకు నమోదు చేయించుకున్నారు. వృద్ధుల సంగతేంటి? జిల్లాలోని చాలాచోట్ల జీవాధార గుర్తింపు సమయంలో చేతి వేళ్ల బలహీనత వల్ల 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు బయోమెట్రిక్ నమోదు కాలేదు. ఐరిస్ ద్వారా కొందరికి అనుమతించినా మొత్తానికి జిల్లాలో దాదాపు 2,000 మంది వృద్ధుల ‘గుర్తింపు’ నమోదు కాలేదు. వీరంతా తిరిగి ఆధార్ కార్డును నవీకరించుకోవాలని గ్రామ కార్యదర్శులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తికి 20 నుంచి 30 రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో తమకు పెన్షన్ వస్తుందో లేదోనని వీరంతా ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగిస్తాం జూన్ 1 నుంచి జూలై 20 వరకు జిల్లా వ్యాప్తంగా జీవాధార గుర్తింపు ప్రక్రియ జరిగింది. ఇందులో చనిపోయన వారు, నకిలీ ఆధార్‌తో పెన్షన్ పొందుతున్న వారు, బయోమెట్రిక్ అనుమతించని వృద్ధులు తదితరులు కలిపి 15 వేల మంది వరకు ఉన్నారు. జిల్లాలో 1500 పెన్షన్లు చనిపోయిన వారి పేరిటే ఉన్నట్టు అంచనా. 6,500 మంది నకిలీ ఆధార్ కార్డు ద్వారా పెన్షన్ పొందుతున్నారని అనుమానిస్తున్నాం. చనిపోయిన వారిని నెలాఖరులోగా గుర్తించి పెన్షన్లు నిలిపివేస్తాం. గ్రామ కార్యదర్శుల నివేదిక ఆధారంగా అనర్హుల పెన్షన్లు తొలగిస్తాం. – ఏపీఓ విజయలక్ష్మి, సంగారెడ్డి -
బయోమెట్రిక్ విధానం..అదో ఆర్భాటం
ప్రొద్దుటూరు: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బోగస్ అటెండెన్స్ నివారణకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన బయో మెట్రిక్ విధానం అమలు ప్రశ్నార్థకంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్ సామగ్రి నిరుపయోగంగా ఉంది. వాస్తవానికి చాలా రోజుల క్రితమే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొత్తగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే విద్యార్థుల హాజరునుబట్టి వసతి గృహ సంక్షేమాధికారులకు ల్యాప్‌టాప్‌లతోపాటు బయోమెట్రిక్ మిషన్లు సెప్టంబర్లో సరఫరా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 998 వసతి గృహాలకు ఈ సామగ్రి చేరింది. జిల్లాకు సంబంధించి 140 వసతి గృహాలకుగాను 99 వాటికి సరఫరా చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌తో వీటిని రూపొందించడంతో ఒక్కో వసతి గృహానికి సంబంధించిన ల్యాప్‌టాప్ బయోమెట్రిక్ మిషన్ కొనుగోలుకు ప్రభుత్వం సుమారు రూ.లక్ష వరకు వెచ్చించినట్లు అధికార వర్గాల సమాచారం. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో విద్యార్థుల అటెండెన్స్‌ను బయోమెట్రిక్ ద్వారా సేకరించాల్సి ఉంది. ప్రధానంగా బోగస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అయితే సంబంధిత ల్యాప్‌టాప్ కంపెనీ ప్రతినిధులు ఆయా డివిజన్లకు వచ్చి ల్యాప్‌టాప్‌లు అందించారే కానీ వినియోగంపై సరైన అవగాహన కల్పించలేదు. పూర్వం నుంచి రిజిష్టర్లపైన ఆధారపడిన హెచ్‌డబ్ల్యూఓలకు ఈ విధానంపై అవగాహన లేక ఆ సామగ్రిని తీసుకెళ్లి ఇళ్లల్లో దాచుకున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే మీరే బాధ్యులవుతారని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో హెచ్‌డబ్ల్యూఓలు వీటిని భద్రంగా దాచి ఉంచారు. ఇదిలావుండగానే సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ జి.జయలక్ష్మి డిసెంబర్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని వసతి గృహాల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అవగాహన లేని కారణంగా జిల్లాలో ఎక్కడా ఈ విధానం అమలుకు నోచుకోలేదు. -
టీచర్లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అంగీకరించం: జేఏసీ
హైదరాబాద్: టీచర్లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అంగీకరించమని ఏపీ ఉపాధ్యాయసంఘాల జేఏసీ తెలిపింది. ప్రభుత్వం మమ్మల్ని దొంగల్లా చూస్తే సహించమని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ సంఘాల ఆమోదం లేకున్నా హేతుబద్ధీకరణ చేపట్టడానికి వీళ్లేదని ఉపాధ్యాయ జేఏసీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై నియంత్రణలు విధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా ఒక్కో చర్య మొదలుపెడుతోందని జేఏసీ ఆరోపించింది. పదివేల మందికి పైగా టీచర్లను హేతుబద్ధీకరించాలని (రేషనలైజేషన్) ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. -
పింఛన్ల పంపిణీకి కొత్త విధానం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): డీఆర్డీఏ, ఐకేపీ ద్వారా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి సంబంధించిన పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆగస్టు నుంచే వీటిని అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత విధానం ప్రకారం పింఛన్ల పంపిణీకి పూర్తిస్థాయిలో స్మార్ట్‌కార్డులు, బయోమెట్రిక్ పద్ధతి అమలు చేస్తున్నారు. అయితే, అనివార్య కారణాల వల్ల సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే, కొత్త పద్ధతి ప్రకారం అలాంటి ఇబ్బంది తలెత్తితే గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల ఆమోదంతో వారి వేలిముద్రలు.. ఇతర ఆధారాలతో వారికి ఇంటివద్దే పింఛన్ అందజేస్తారు. వేలిముద్రలు నమోదు కాకుంటే... 80 ఏళ్లు.. ఆ పైబడిన వృద్ధుల విషయంలో వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో బయోమెట్రిక్ మిషన్లు వీరిని లబ్ధిదారులుగా గుర్తించడంలేదు. దీంతో సీఎస్పీలు, పోస్టాఫీస్‌లలో వందల సంఖ్యలో వృద్ధాప్య పింఛన్లు నిలిచిపోయాయి. ఈ విషయంలో గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులకు వాస్తవాలు తెలిసినా జాలి పడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే కారణాలతో జూన్ నాటికి జిల్లా 18వేల మందికి పింఛన్లు ఇవ్వకండా వివిధ స్థాయిలో అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం జారీచేసిన కొత్త నిబంధనల్లో వీరికి పాత బకాయిలు మొత్తం విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాల్లో కొన్ని... ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభించి 8 వతేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయాలి. వీటి వివరాలు 15వ తేదీలోగా ఎంపీడీఓలు, కమిషనర్ల ద్వారా అధికారులకు చేరాలి. బ్యాంకుల, పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్ పొందుతున్న వారిలో పైసలు తీసుకొని వారి వివరాలు 10వ తేదీన అధికారులకు తెలియజేయాలి. మిగిలిన మొత్తం 15వ తేదీలోగా ప్రభుత్వ ఖాతాలో జమచేయాలి. గ్రామాల్లో పింఛన్ల తొలగింపునకు సంబంధించిన సమాచారం అధికారులు సెర్ప్‌కు తెలియజేయాలి. ఇదే క్రమంలో ఇప్పటివరకు వేలిముద్రలు సేకరించని లబ్ధిదారులు వేలిముద్రల నమోదు పరికారాలు సమకూర్చుకుని వార్డులు, డివిజన్ల వారీగా తేదీలు ఖరారు చేయాలి. సేకరించిన వేలిముద్రలను ఎంపీడీఓ కార్యాలయాల్లో మండల కోఆర్డినేర్లకు అందజేయాలి. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు... వేలిముద్రలు సరిగా నమోదు కానివారు, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి ఇకపై ప్రత్యేక దూత ద్వారా ఇంటివద్దనే ప్రతినెల 10వ తేదీన పింఛన్ ఇస్తారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు వీఓలు, కౌన్సిలర్, కార్పొరేటర్ సభ్యులుగా ఉంటారు. కమిటీలోని అందుబాటులో ఉన్న ఇద్దరు సభ్యులు ధ్రువీకరిస్తే పింఛన్ ఇస్తారు. సెర్ప్ ఆదేశాల మేరకు.. సెర్ప్ ఆదేశాల మేరకు పింఛన్ పంపిణీ విధానంలో కొత్త పద్ధతి అనుసరిస్తున్నాము. ఈ విధానం ముఖ్యంగా వృద్ధులకు ఉపయోగ పడుతుంది. పింఛన్‌ను బయోమెట్రిక్ విధానం ద్వారా పంపిణీ చేస్తున్నారు. పెద్ద వయసు ఉన్న వారి వేలిముద్రలు సరిపోవడం లేదు. దీంతో వారికి పింఛన్ ఇవ్వలేక పోతున్నాము. ఇలా జిల్లాలో 6 నెలలుగా 18 వేల మందికి పింఛన్లు ఇవ్వలేకపోయాము. ప్రభుత్వం కొత్త విదానంతో వారికి కూడా పింఛన్ ఇచ్చే ఏర్పాటు కానుంది. - చంద్రశేఖర్‌రెడ్డి, పీడీ డీఆర్డీఏ -
భయోమెట్రిక్
తమకు వచ్చే నాలుగు రూకలనే వారు కొండంత అండగా భావిస్తారు. ఆ సొమ్ముతో ఒకనెల ఎలాగోలా నెట్టుకొస్తారు. అందుకోసం ప్రతి నెల వచ్చే ఒకటో తేదీ కోసం ఎదురు చూస్తారు. కొన్ని నెలలుగా పింఛన్లు అందుకోవటానికి అగచాట్లు పడుతున్నారు. సాంకేతిక లోపాలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గం చూపడంలో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. పింఛన్ కేంద్రాల వద్ద పండుటాకులు, వికలాంగులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. కడప రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా సాగుతోంది. ముఖ్యంగా బయో మెట్రిక్ విధానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు సమస్యకు పరిష్కారం చూపకుండా చోద్యం చూస్తున్నారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మనోవేదనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఫినో, పట్టణ ప్రాంతాలలో మణిపాల్ సంస్థల ద్వారా పింఛన్ల పంపిణీ సాగుతోంది. అయితే బయో మెట్రిక్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఐసీఐసీఐ వారి అనుసంధానంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), పట్టణ ఇందిరాక్రాంతి పథం (మెప్మా) ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ సాగుతోంది. జిల్లాలో ఏడు కేటగిరీలకు సంబంధించి 2,47,592 మందికి ప్రతినెల రూ. 8,28,65,400 పంపిణీ చేస్తున్నారు. ఇందులో 23,014 మంది బయో మెట్రిక్‌లో పేరు నమోదు చేసుకోలేని కారణంగా రెండు నెలల నుంచి పింఛన్లు మంజూరు కాలేదు. బయోమెట్రిక్‌లో తమ పేరు, వేలిముద్రలు తదితర వివరాలను నమోదు చేసుకుంటేనే పింఛన్లను పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. వేలిముద్రలను తిరస్కరిస్తున్న మిషన్ బయో మెట్రిక్ (పీఓటీ) మిషన్ ద్వారా పింఛన్‌దారుల వేలిముద్రల వివరాలను పింఛన్ సొమ్మును పంపిణీ చేసే సిబ్బంది స్వీకరిస్తారు. వేలిముద్రలను బయో మెట్రిక్ స్వీకరిస్తేనే సదరు వ్యక్తికి పింఛన్ సొమ్మును పంపిణీ చేస్తారు.50 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు, గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేసుకునే వారి వేలిముద్రలను మిషన్ స్వీకరించలేకపోతోంది. దీంతో వారు తమకు వచ్చే పింఛన్ సొమ్ము కోసం రోజుల తరబడి పింఛన్ కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నిరీక్షించి....నిరీక్షించి ఒత్తిడికి, అనారోగ్యానికి లోనవుతున్నారు. మరికొంతమంది సృ్పహతప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు. ప్రస్తుత విధానాన్ని ఎత్తివేసి మాన్యువల్ పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేయాలనే డిమాండ్ వస్తోంది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు కొత్త పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారింది. గడిచిన ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉప ఎన్నికల ముందు కొత్త పింఛన్లు పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు మరికొన్ని కొత్త పింఛన్లను పంపిణీ చేశారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో నిర్వహించిన రచ్చబండ తర్వాత జిల్లా వ్యాప్తంగా ఆయా ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలకు దాదాపు 12 వేల మందికి పైగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ వివరాలన్నీ ఆయా అధికారులు పింఛన్ల వెబ్సైట్లో ప్రభుత్వానికి విన్నవించారు. పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలను నివారించి క్రమం తప్పకుండా పంపిణీ చేయడంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త పింఛన్లు వచ్చేలా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు నెలలుగా పింఛన్ అందలేదు వేలి ముద్రలు సరి పోలేదని మూడు మాసాలుగా పింఛన్ ఇవ్వడం లేదు. గత నెలలో మళ్లీ ఫొటోలు, వేలి ముద్రలు తీశారు. అయినా ఈ నెల పింఛన్ రాలేదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తెమ్మన్నారు. వచ్చే నెల నుంచి పింఛన్ వస్తుందిలే అంటున్నారు. -బి.సుబ్బారెడ్డి, పుట్లంపల్లె, కమలాపురం ఈ అబ్బాయి పేరు హాజీ. కమలాపురంలో నివాసం ఉంటున్నాడు. మూగవాడు. ప్రతి నెల వచ్చే రూ. 500 పింఛన్ మూడు నెలలుగా రాలే దు. స్మార్ట్ కార్డు వ్యవస్థను తీసేసి మాన్యువల్‌గానే పింఛన్ ఇవ్వాలని హాజీ తల్లి కోరుతోంది.