భయోమెట్రిక్ | Bio-metric | Sakshi
Sakshi News home page

భయోమెట్రిక్

Published Sat, Jun 7 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

భయోమెట్రిక్

భయోమెట్రిక్

తమకు వచ్చే నాలుగు రూకలనే వారు  కొండంత అండగా భావిస్తారు. ఆ సొమ్ముతో ఒకనెల ఎలాగోలా నెట్టుకొస్తారు. అందుకోసం ప్రతి నెల వచ్చే ఒకటో తేదీ కోసం ఎదురు చూస్తారు. కొన్ని నెలలుగా పింఛన్లు  అందుకోవటానికి అగచాట్లు పడుతున్నారు.  సాంకేతిక లోపాలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గం చూపడంలో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. పింఛన్ కేంద్రాల వద్ద పండుటాకులు, వికలాంగులు  పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
 
 కడప రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా సాగుతోంది. ముఖ్యంగా బయో మెట్రిక్ విధానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు సమస్యకు పరిష్కారం చూపకుండా చోద్యం చూస్తున్నారు.  దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మనోవేదనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఫినో, పట్టణ ప్రాంతాలలో  మణిపాల్ సంస్థల ద్వారా పింఛన్ల పంపిణీ సాగుతోంది.
 
 అయితే బయో మెట్రిక్ విధానంలో సాంకేతిక సమస్యలు  తలెత్తుతున్నాయి. ఐసీఐసీఐ వారి అనుసంధానంతో జిల్లా  గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), పట్టణ ఇందిరాక్రాంతి పథం (మెప్మా) ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ సాగుతోంది. జిల్లాలో ఏడు  కేటగిరీలకు సంబంధించి 2,47,592 మందికి ప్రతినెల రూ. 8,28,65,400 పంపిణీ చేస్తున్నారు. ఇందులో 23,014 మంది బయో మెట్రిక్‌లో పేరు నమోదు చేసుకోలేని కారణంగా  రెండు నెలల నుంచి పింఛన్లు మంజూరు కాలేదు.  బయోమెట్రిక్‌లో తమ పేరు, వేలిముద్రలు తదితర వివరాలను నమోదు చేసుకుంటేనే పింఛన్లను పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
 
 వేలిముద్రలను తిరస్కరిస్తున్న మిషన్
 బయో మెట్రిక్ (పీఓటీ) మిషన్ ద్వారా పింఛన్‌దారుల వేలిముద్రల వివరాలను పింఛన్ సొమ్మును పంపిణీ చేసే సిబ్బంది స్వీకరిస్తారు. వేలిముద్రలను బయో మెట్రిక్ స్వీకరిస్తేనే సదరు వ్యక్తికి పింఛన్ సొమ్మును పంపిణీ చేస్తారు.50 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు, గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేసుకునే వారి వేలిముద్రలను మిషన్ స్వీకరించలేకపోతోంది. దీంతో వారు తమకు వచ్చే పింఛన్ సొమ్ము కోసం రోజుల తరబడి పింఛన్ కేంద్రాల వద్దకు వెళ్లాల్సి  వస్తోంది. దీంతో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నిరీక్షించి....నిరీక్షించి ఒత్తిడికి, అనారోగ్యానికి లోనవుతున్నారు. మరికొంతమంది సృ్పహతప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు.   ప్రస్తుత విధానాన్ని ఎత్తివేసి మాన్యువల్ పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేయాలనే డిమాండ్ వస్తోంది.
 
 కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు
 కొత్త పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారింది. గడిచిన ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉప ఎన్నికల ముందు కొత్త పింఛన్లు పంపిణీ చేశారు.  ఇటీవల  జరిగిన ఎన్నికల ముందు మరికొన్ని కొత్త పింఛన్లను పంపిణీ చేశారు.  
 
 అప్పటి  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో నిర్వహించిన రచ్చబండ తర్వాత జిల్లా వ్యాప్తంగా ఆయా ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలకు దాదాపు 12 వేల మందికి పైగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ వివరాలన్నీ ఆయా అధికారులు  పింఛన్ల వెబ్‌సైట్‌లో ప్రభుత్వానికి విన్నవించారు. పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలను నివారించి క్రమం తప్పకుండా పంపిణీ చేయడంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త పింఛన్లు వచ్చేలా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 మూడు నెలలుగా పింఛన్ అందలేదు
 వేలి ముద్రలు సరి పోలేదని మూడు మాసాలుగా పింఛన్  ఇవ్వడం లేదు.  గత నెలలో మళ్లీ ఫొటోలు, వేలి ముద్రలు తీశారు. అయినా ఈ నెల పింఛన్ రాలేదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తెమ్మన్నారు.  వచ్చే నెల నుంచి పింఛన్ వస్తుందిలే అంటున్నారు.
 -బి.సుబ్బారెడ్డి, పుట్లంపల్లె, కమలాపురం
 
 ఈ  అబ్బాయి పేరు హాజీ.  కమలాపురంలో నివాసం ఉంటున్నాడు. మూగవాడు. ప్రతి నెల వచ్చే రూ. 500 పింఛన్ మూడు నెలలుగా రాలే దు.  స్మార్ట్ కార్డు వ్యవస్థను తీసేసి మాన్యువల్‌గానే పింఛన్ ఇవ్వాలని హాజీ తల్లి కోరుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement