పింఛన్ల పంపిణీకి కొత్త విధానం | Whole new approach to pensions | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీకి కొత్త విధానం

Published Sat, Aug 2 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

Whole new approach to pensions

 జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): డీఆర్‌డీఏ, ఐకేపీ ద్వారా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి సంబంధించిన పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆగస్టు నుంచే వీటిని అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత విధానం ప్రకారం పింఛన్ల పంపిణీకి పూర్తిస్థాయిలో స్మార్ట్‌కార్డులు, బయోమెట్రిక్ పద్ధతి అమలు చేస్తున్నారు. అయితే, అనివార్య కారణాల వల్ల సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే, కొత్త పద్ధతి ప్రకారం అలాంటి ఇబ్బంది తలెత్తితే గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల ఆమోదంతో వారి వేలిముద్రలు.. ఇతర ఆధారాలతో వారికి ఇంటివద్దే పింఛన్ అందజేస్తారు.
 వేలిముద్రలు నమోదు కాకుంటే...
 80 ఏళ్లు.. ఆ పైబడిన వృద్ధుల విషయంలో వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో బయోమెట్రిక్ మిషన్లు వీరిని లబ్ధిదారులుగా గుర్తించడంలేదు. దీంతో సీఎస్‌పీలు, పోస్టాఫీస్‌లలో వందల సంఖ్యలో వృద్ధాప్య పింఛన్లు నిలిచిపోయాయి. ఈ విషయంలో గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులకు వాస్తవాలు తెలిసినా జాలి పడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే కారణాలతో జూన్ నాటికి జిల్లా 18వేల మందికి పింఛన్లు ఇవ్వకండా వివిధ స్థాయిలో అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం జారీచేసిన కొత్త నిబంధనల్లో వీరికి పాత బకాయిలు మొత్తం విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
 కొత్త మార్గదర్శకాల్లో కొన్ని...
 ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభించి 8 వతేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయాలి. వీటి వివరాలు 15వ తేదీలోగా ఎంపీడీఓలు, కమిషనర్ల ద్వారా అధికారులకు చేరాలి. బ్యాంకుల, పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్ పొందుతున్న వారిలో పైసలు తీసుకొని వారి వివరాలు 10వ తేదీన అధికారులకు తెలియజేయాలి. మిగిలిన మొత్తం 15వ తేదీలోగా ప్రభుత్వ ఖాతాలో జమచేయాలి. గ్రామాల్లో పింఛన్ల తొలగింపునకు సంబంధించిన సమాచారం అధికారులు సెర్ప్‌కు తెలియజేయాలి. ఇదే క్రమంలో ఇప్పటివరకు వేలిముద్రలు సేకరించని లబ్ధిదారులు వేలిముద్రల నమోదు పరికారాలు సమకూర్చుకుని వార్డులు, డివిజన్ల వారీగా తేదీలు ఖరారు చేయాలి. సేకరించిన వేలిముద్రలను ఎంపీడీఓ కార్యాలయాల్లో మండల కోఆర్డినేర్లకు అందజేయాలి.
 
 గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు...
 వేలిముద్రలు సరిగా నమోదు కానివారు, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి ఇకపై ప్రత్యేక దూత ద్వారా ఇంటివద్దనే ప్రతినెల 10వ తేదీన పింఛన్ ఇస్తారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు వీఓలు, కౌన్సిలర్, కార్పొరేటర్ సభ్యులుగా ఉంటారు. కమిటీలోని అందుబాటులో ఉన్న ఇద్దరు సభ్యులు ధ్రువీకరిస్తే పింఛన్ ఇస్తారు.
 
 సెర్ప్ ఆదేశాల మేరకు..
 సెర్ప్ ఆదేశాల మేరకు పింఛన్ పంపిణీ విధానంలో కొత్త పద్ధతి అనుసరిస్తున్నాము. ఈ విధానం ముఖ్యంగా వృద్ధులకు ఉపయోగ పడుతుంది. పింఛన్‌ను బయోమెట్రిక్ విధానం ద్వారా పంపిణీ చేస్తున్నారు. పెద్ద వయసు ఉన్న వారి వేలిముద్రలు సరిపోవడం లేదు. దీంతో వారికి పింఛన్ ఇవ్వలేక పోతున్నాము. ఇలా జిల్లాలో 6 నెలలుగా 18 వేల మందికి పింఛన్లు ఇవ్వలేకపోయాము. ప్రభుత్వం కొత్త విదానంతో వారికి కూడా పింఛన్ ఇచ్చే ఏర్పాటు కానుంది.
 - చంద్రశేఖర్‌రెడ్డి, పీడీ డీఆర్‌డీఏ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement