ఆసరా ‘గుర్తింపు’ పూర్తి | Aasara 'identity' complete | Sakshi
Sakshi News home page

ఆసరా ‘గుర్తింపు’ పూర్తి

Published Wed, Jul 20 2016 10:36 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM

ఆసరా ‘గుర్తింపు’ పూర్తి - Sakshi

ఆసరా ‘గుర్తింపు’ పూర్తి

  • జీవాధార గుర్తింపునకు 15 వేల మంది దూరం
  • జోగిపేట: ఆసరా లైవ్‌ ఎవిడెన్స్‌ సర్టిఫికెట్‌ (జీవాధార గుర్తింపు) పొందేందుకు గడువు బుధవారంతో ముగిసింది. పెన్షన్ల మంజూరులో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మీసేవ కేంద్రాల్లో వేలిముద్రలు, ఐరిస్‌ ద్వారా బతికున్నట్టు గుర్తింపు నమోదు చేసుకుంటేనే ప్రతి నెలా పెన్షన్‌ వచ్చేలా మార్గదర్శకాలను రూపొందించింది.

    ఇందుకు జూన్‌ 1 నుంచి 20 వరకు గడువు విధించింది. ఆపై జూలై 20 వరకు గడువు పొడిగించారు. బ్యాంకు ద్వారా ఆసరా పెన్షన్లు పొందుతున్న 1,39,449 మందికి గాను, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 1,23,857 మంది జీవాధార గుర్తింపును నమోదు చేసుకున్నారు. 15,592 మంది నమోదుకు దూరమయ్యారు.

    కాగా, నమోదైన వారిలో 6 వేల మంది చెల్లని ఆధార్‌ కార్డులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. 2,000 నుంచి 3,000 మంది మీసేవ కేంద్రాలకు వెళ్లలేదని, ఎందుకు వెళ్లలేదనేది గ్రామ కార్యదర్శుల ద్వారా విచారణ జరిపించి నివేదికను తెప్పించుకోనున్నట్టు అధికారులు చెప్పారు.

    మున్సిపాలిటీల్లోనే అక్రమాలు
    జిల్లాలోని మున్సిపాలిటీల్లోనే ఆసరా పథకంలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందినట్టు తెలిసింది. ఏడాది నుంచి ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్‌ పింఛనుదారుల్లో ఒక్కరికి కూడా డిలీట్‌ కాకపోవడం గమనార్హం. జీవాధార గుర్తింపు నమోదు పూర్తయిన తర్వాత జిల్లాలో 1,500 మంది చనిపోయిన వారి ఖాతాల్లో పెన్షన్‌ డబ్బులు పడుతున్నాయని గుర్తించారు. ఇటీవల దుబ్బాక నగర పంచాయతీలో 75 పెన్షన్లు చనిపోయిన వారి పేరిటే మంజూరవుతున్నట్టు తేలింది. పుల్కల్, కొండపాక ప్రాంతాల్లో సైతం 20–30 మంది చనిపోయిన వారికి కూడా పెన్షన్‌లు యథావిధిగా వస్తున్నట్టు తెలిసింది.

    జిల్లాలో 3.20 లక్షల పెన్షన్లు
    జిల్లాలో ఆసరా పథకం కింద 3.20 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వీరిలో 1.39,449 మంది బ్యాంకు ఖాతా, లక్ష మంది పోస్టాఫీసు, మరో 89 వేల మంది మాన్యువల్‌ (పంచాయతీ కార్యదర్శుల ద్వారా)గా నెలనెలా పెన్షన్లు పొందుతున్నారు. అయితే ప్రభుత్వం బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న వారికే ప్రతి ఆరు నెలలకోసారి జీవాధార గుర్తింపున నమోదు చేసుకోవాలని నిర్దేశించింది. 50 రోజుల పాటు జిల్లాలోని అన్ని మీసేవ కేంద్రాల్లో లబ్ధిదారులు ఈ మేరకు నమోదు చేయించుకున్నారు.

    వృద్ధుల సంగతేంటి?
    జిల్లాలోని చాలాచోట్ల జీవాధార గుర్తింపు సమయంలో చేతి వేళ్ల బలహీనత వల్ల 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు బయోమెట్రిక్‌  నమోదు కాలేదు. ఐరిస్‌ ద్వారా కొందరికి అనుమతించినా మొత్తానికి జిల్లాలో దాదాపు 2,000 మంది వృద్ధుల ‘గుర్తింపు’ నమోదు కాలేదు. వీరంతా తిరిగి ఆధార్‌ కార్డును నవీకరించుకోవాలని గ్రామ కార్యదర్శులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తికి 20 నుంచి 30 రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో తమకు పెన్షన్‌ వస్తుందో లేదోనని వీరంతా ఆందోళన చెందుతున్నారు.

    చనిపోయిన వారి పేర్లను తొలగిస్తాం
    జూన్‌ 1 నుంచి జూలై 20 వరకు జిల్లా వ్యాప్తంగా జీవాధార గుర్తింపు ప్రక్రియ జరిగింది. ఇందులో చనిపోయన వారు, నకిలీ ఆధార్‌తో పెన్షన్‌ పొందుతున్న వారు, బయోమెట్రిక్‌ అనుమతించని వృద్ధులు తదితరులు కలిపి 15 వేల మంది వరకు ఉన్నారు. జిల్లాలో 1500 పెన్షన్లు చనిపోయిన వారి పేరిటే ఉన్నట్టు అంచనా. 6,500 మంది నకిలీ ఆధార్‌ కార్డు ద్వారా పెన్షన్‌ పొందుతున్నారని అనుమానిస్తున్నాం. చనిపోయిన వారిని నెలాఖరులోగా గుర్తించి పెన్షన్లు నిలిపివేస్తాం. గ్రామ కార్యదర్శుల నివేదిక ఆధారంగా అనర్హుల పెన్షన్లు తొలగిస్తాం.
    – ఏపీఓ విజయలక్ష్మి, సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement