ప్రొద్దుటూరు: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బోగస్ అటెండెన్స్ నివారణకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన బయో మెట్రిక్ విధానం అమలు ప్రశ్నార్థకంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్ సామగ్రి నిరుపయోగంగా ఉంది. వాస్తవానికి చాలా రోజుల క్రితమే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొత్తగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే విద్యార్థుల హాజరునుబట్టి వసతి గృహ సంక్షేమాధికారులకు ల్యాప్‌టాప్‌లతోపాటు బయోమెట్రిక్ మిషన్లు సెప్టంబర్‌లో సరఫరా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 998 వసతి గృహాలకు ఈ సామగ్రి చేరింది. జిల్లాకు సంబంధించి 140 వసతి గృహాలకుగాను 99 వాటికి సరఫరా చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌తో వీటిని రూపొందించడంతో ఒక్కో వసతి గృహానికి సంబంధించిన ల్యాప్‌టాప్ బయోమెట్రిక్ మిషన్ కొనుగోలుకు ప్రభుత్వం సుమారు రూ.లక్ష వరకు వెచ్చించినట్లు అధికార వర్గాల సమాచారం. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో విద్యార్థుల అటెండెన్స్‌ను బయోమెట్రిక్ ద్వారా సేకరించాల్సి ఉంది. ప్రధానంగా బోగస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అయితే సంబంధిత ల్యాప్‌టాప్ కంపెనీ ప్రతినిధులు ఆయా డివిజన్లకు వచ్చి ల్యాప్‌టాప్‌లు అందించారే కానీ వినియోగంపై సరైన అవగాహన కల్పించలేదు.
పూర్వం నుంచి రిజిష్టర్లపైన ఆధారపడిన హెచ్‌డబ్ల్యూఓలకు ఈ విధానంపై అవగాహన లేక ఆ సామగ్రిని తీసుకెళ్లి ఇళ్లల్లో దాచుకున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే మీరే బాధ్యులవుతారని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో హెచ్‌డబ్ల్యూఓలు వీటిని భద్రంగా దాచి ఉంచారు. ఇదిలావుండగానే సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ జి.జయలక్ష్మి డిసెంబర్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని వసతి గృహాల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అవగాహన లేని కారణంగా జిల్లాలో ఎక్కడా ఈ విధానం అమలుకు నోచుకోలేదు.
బయోమెట్రిక్ విధానం..అదో ఆర్భాటం
Published Sat, Dec 6 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement