AP: బడికి డుమ్మా కొడితే ఇంటికే మెసేజ్‌! | Message To Parents Through App If Students Do Not Come To School In AP | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో యాప్‌తో అటెండెన్స్‌.. బడికి డుమ్మా కొడితే ఇంటికే మెసేజ్‌!

Published Wed, Jan 18 2023 2:30 PM | Last Updated on Wed, Jan 18 2023 3:09 PM

Message To Parents Through App If Students Do Not Come To School In AP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని ప్రకాశరావుపేటకు చెందిన రాకేష్‌ పొద్దున్నే ఎంచక్కా తయరై, పుస్తకాల బ్యాగు భుజాన వేసుకొని ఠంచన్‌గా బడికి బయలుదేరాడు. కానీ ఉదయం 11గంటలకు ఆ విద్యార్ధి తండ్రి వెంకటరావు సెల్‌ఫోన్‌కు ‘మీ బాబు ఈ రోజు స్కూల్‌కు ఆబ్‌సెంట్‌ అయ్యాడు’ అని మెసేజ్‌ వచ్చింది.తమ కుమారుడు బడికి వెళ్లి చదువుకుంటున్నాడనుకున్న ఆ తల్లిదండ్రులు, ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌తో పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. రాకేష్‌  కాలనీ సమీపంలో తోటి మిత్రులతో ఆడుతూ కనిపించాడు. అక్కడ నుంచి బడికి తీసుకెళ్లి వదిలాడు.  

స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ యాప్‌ హాజరు నమోదు ద్వారా సత్ఫలితాలు కనిపిస్తొన్నాయి. విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1,397 పాఠశాలలు ఉండగా, ఇందులో 3,54,740 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ప్రతి రోజూ స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వెళ్లేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. పాఠశాలల్లో 90 శాతం హాజరు నమోదౌతుండటమే కాక,  తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఏర్పడింది.  

చదువులవైపు మళ్లించేలా.. 
విద్యార్థులందరినీ బడికి రప్పించి, వారికి విద్యాబుద్ధులు నేరి్పంచాలనే లక్ష్యంతో మొబైల్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదుకు విద్యాశాఖ ఏర్పాట్లు  చేసింది. చదువులకు తోడ్పాటు అందించాలనే సంకల్పంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న అమ్మ ఒడి పథకం లబి్ధపొందేందుకు  పాఠశాల పనిదినాల్లో  75 శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరుశాతం పెంపుతో పాటు, మధ్యాహ్న భోజన పథకం పారదర్శకంగా అమలయ్యేలా స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ యాప్‌ హాజరు నమోదుపై  విద్యాశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 

బడికి రాకుంటే ఇంటికే వలంటీర్‌ 
ప్రతి రోజూ ఉదయం 9.15 నుంచి 10 గంటల మధ్యలో పాఠశాలల్లో హాజరు నమోదు చేసేలా జిల్లా విద్యాశాఖాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  పాఠశాల తల్లిదండ్రులు, క్లాస్‌ టీచర్, అదే విధంగా గ్రామ/వార్డు వలంటీరు సెల్‌ఫోన్‌ నంబర్‌ను చైల్డ్‌ ఇన్ఫోతో కూడిన స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌కు అనుసంధానం చేశారు. యాప్‌లో విద్యార్థి హాజరు నమోదు కాకుంటే వెంటనే వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వెళ్తొంది. వరుసగా మూడు రోజులు విద్యార్థి పాఠశాలకు గైర్హాజర్‌ అయినట్‌లైతే సచివాలయ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ ద్వారా వలంటీర్‌కు సమాచారం వెళ్తోంది. దీంతో వలంటీరు విద్యార్థి ఇంటికి వెళ్లి , బడికి రాకపోవడానికి గల కారణాలు తెలుసుకునేలా విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  

ప్రతి రోజూ పర్యవేక్షణ 
విద్యార్థుల హాజరు నమోదుపై ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా యాప్‌ద్వారానే హాజరువేయాలి. విద్యార్థులను చదువుల వైపు మళ్లించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఇటువంటి ఏర్పాట్లు చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుంది.  
– ఎల్‌. చంద్రకళ,  డీఈవో, ఉమ్మడి విశాఖ జిల్లా 

హాజరుశాతం పెరిగింది 
స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ ద్వారానే విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నాం. దీని వల్ల బడికి రాని విద్యార్థులెవరనేది వెంటనే తెలుసుకునే అవకాశం కలిగింది. ఇలాంటి పర్యవేక్షణతో బడిలో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. ల్లిదండ్రులను కూడా భాగస్వామ్యులను చేయటం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తొన్నాయి.  
– బాబు, హెచ్‌ఎం,  మధురానగర్‌ పీఎస్, విశాఖ జిల్లా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement