Telangana: గురుకులాల్లో హాజరు.. 57శాతమే | Attendance Of Students In Gurukul Schools Is Less In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: గురుకులాల్లో హాజరు.. 57శాతమే

Published Thu, Nov 4 2021 3:19 AM | Last Updated on Thu, Nov 4 2021 3:30 AM

Attendance Of Students In Gurukul Schools Is Less In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. ఈ విద్యాసంస్థలు పునఃప్రారంభమై 12 రోజులు గడిచినా ఇప్పటికీ సగం మంది విద్యార్థులు గైర్హాజరులోనే ఉన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో గతేడాది మార్చిలో మూతబడ్డ గురుకుల విద్యా సంస్థలు.. సుదీర్ఘ విరామం తర్వాత అక్టోబర్‌ 21న పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు అన్ని తరగతుల్లో ప్రత్యక్ష బోధన షురూ అయినా హాజరు శాతం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఎస్సీ గురుకుల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ ఈఐఎస్‌) పరిధిలోని 239 విద్యా సంస్థల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 1.38 లక్షల మంది విద్యార్థులుండగా, ఈనెల 2 నాటికి 57.46 శాతం మంది మాత్రమే ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. అలాగే ఇతర గురుకుల సొసైటీల పరిధిలోనూ హాజరు శాతం ఇలాగే ఉన్నట్లు ఆయా సొసైటీల అధికారులు చెబుతున్నారు.

2వ తేదీ నాటికి 57.46 శాతం మందే..
ప్రత్యక్ష తరగతుల హాజరుపై గురుకుల విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికీ ఎలాంటి నిర్ణ యం తీసుకోలేనట్లు తెలుస్తోంది. గురుకుల పాఠ శాలల పునఃప్రారంభంపై విద్యార్థులు, వారి తల్లి దండ్రులకు 20వ తేదీనే ఫోన్‌లు, వాట్సాప్, ఎస్‌ఎం ఎస్‌ల ద్వారా సమాచారాన్ని ఇచ్చారు. కానీ తొలి రోజు 6% విద్యార్థులే పాఠశాలలకు హాజరయ్యా రు. అనంతరం గైర్హాజరవుతున్న విద్యార్థులతో క్లాస్‌ టీచర్లు నేరుగా ఫోనులో సంప్రదించడం, వారి తల్లిదండ్రులతో మాట్లాడి అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు. అయినా హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంది. ఈనెల 2 నాటికి 57.46% మంది మాత్రమే హాజరయ్యారు.

ఈ క్రమంలో విద్యార్థుల హాజరును పెంచి నూరుశాతం ప్రత్యక్ష బోధనను విజయవంతంగా సాగించాలని గురుకుల సొసైటీలు క్షేత్రస్థాయిలోని రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా సంక్షేమాధికారులు, గురుకుల విద్యా సంస్థల ప్రిన్స్‌పాల్స్‌కు, టీచర్లకు లిఖితపూర్వక ఆదేశాలు పంపాయి. గైర్హాజరవుతున్న విద్యార్థులు, తల్లిదం డ్రులతో ప్రత్యేక చొరవ తీసుకుని అవగాహన కల్పించాలని, విద్యార్థి పాఠశాల/ కళాశాలకు వచ్చేంతవరకు ఈమేరకు చర్యలు తీసుకోవాలని సూచించాయి. ప్రిన్స్‌పాళ్లు, టీచర్లకు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ల ద్వారా సమాచారాన్ని సైతం చేరవేశాయి. రోజువారీగా హాజరు తీరును ఎప్పటికప్పుడు ప్రిన్సిపాళ్లు, రీజినల్‌ కోఆర్డినేటర్లకు బాధ్యతతో పంపాలని సూచించాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement