- వైఎస్సార్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి
హాస్టళ్లలో సమస్యలు తీర్చకుంటే ఉద్యమం
Published Mon, Jan 30 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
కొరిటెపాడు(గుంటూరు) ఎస్సీ సోషల్ వెల్ఫేర్, స్టూడెంట్స్ మేనేజ్‌మెంట్స్ హాస్టళ్లలో వసతులు దయనీయంగా ఉన్నాయని, వసతులు మెరుగుపర్చడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు తదితరులు సోమవారం జెడ్పీ గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేకు వినతిపత్రం ఇచ్చారు.
బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు..
పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న గుంటూరులోని మహిమా గార్డెన్స్ వెనుక వైపున సోషల్ వెల్ఫేర్ నిర్వహిస్తున్న హాస్టల్ బిల్డింగ్ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని తెలిపారు. ఫ్లోరింగ్ లేదని, కిటికీలు లేవని, బాత్‌రూమ్‌లు టాయిలెట్లకు కనీసం తలుపులు కూడా లేవని, ఇటువంటి భవనంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తినే భోజనంలో రాళ్లు, పురుగులను ఏరుకుని తినాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దళితుల బాగోగులు పట్టని ముఖ్యమంత్రి, మంత్రులు పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో నోడల్ ఏజన్సీ పెట్టి దళిత, గిరిజనులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత, గిరిజనుల చట్టాలకు తూట్లు పొడుస్తూ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన నిధులను దారిమళ్లిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సూచించిన చట్టాలు, సూత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని, అవినీతి హెచ్చుమీరిపోయిందని విమర్శించారు. ఫిబ్రవరి 10వ తేదీ లోపు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో వసతులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే 10వ తేదీన జిల్లా సోషల్ వెల్ఫేర్ కార్యాలయాన్ని పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. సమాజంలో అసమానతలు తొలగాలన్నా, పేదరికం పోవాలన్నా ధనిక వర్గాలతో సమానంగా పేద వర్గాలు ఉన్నత చదువులు చదువుకోవాలని అంబేద్కర్ చెప్పారన్నారు. అసమానతలు తొలగి, అన్ని వర్గాలు ఉన్నత స్థితికి చేరుకోవాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశ, థ్యేయమని స్పష్టం చేశారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ దళిత, గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ లేదు అనడానికి సోషల్ వేల్ఫేర్ హాస్టల్స్ దుస్థితే నిదర్శనమన్నారు. హాస్టళ్లలో మౌలిక వసతులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్–2 ముంగా వెంకటేశ్వరరావును హాస్టల్‌కు పంపి, విద్యార్థులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చిస్తామని కలెక్టర్ కాంతీలాల్ దండే వారికి హామీ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో వైఎస్సార్ సీపీ నేతలు ఏలికా శ్రీకాంత్‌యాదవ్, గనిక ఝాన్సీరాణి, మద్దుల రాజాయాదవ్, దాసరి కిరణ్, పల్లపు మహేష్, సోమికమల్, పానుగంటి చైతన్య, షేక్ రబ్బాని, వినోద్, విఠల్, వలి, పేటేటి బాజి, యాదాల రామ్, దాసరి గోపి, సాయిగోపి, నాని తదితరులున్నారు.
Advertisement
Advertisement