సమస్యలపై.. దొంగ నిద్ర!
Published Wed, Dec 25 2013 2:37 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
నిద్రపోయేవారిని లేపగలం గాని, దొంగనిద్ర నటిస్టున్న వారిని లేపడం ఎవరి తరమూ కాదు. సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యల విషయంలో సర్కార్ దొంగనిద్ర నటిస్తూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. సంక్షేమ బాట కార్యక్రమంలో భాగంగా అధికారులు హాస్టళ్లలో రాత్రులు నిద్రపోయి, అక్కడి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలి. మొదటి మూడేళ్లు బాగా నడిచిన ఈ పథకాన్ని తరువాత పట్టించుకోవడం మానేశారు. దీంతో సమస్యలు పరిష్కారం కాక విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
నెల్లిమర్ల, న్యూస్‌లైన్: వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన సంక్షేమబాట కార్యక్రమానికి ప్రస్తుత సర్కారు తిలోదకాలిచ్చింది. ఏటా అధికారులు వసతిగృహాలను సందర్శించి, అక్కడి సమస్యలను గుర్తించాలన్న ఉద్దేశంతో 2008లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత సర్కారు నీరుగార్చుతోంది. రెండేళ్లుగా అధికారులు వసతిగృహాలను సందర్శించకపోవడం, సమస్యల పరిష్కారానికి సంబంధించి నిధులు విడుదల చేకపోవడమే దీనికి నిదర్శనం. వివరాల్లోకి వెళితే..జిల్లా వ్యాప్తంగా మొత్తం 163 సంక్షేమ వసతి గృహాలున్నాయి.
వీటిలో 58 వెనుకబడిన తరగతులకు చెందినవి కాగా, 62 సాంఘిక సంక్షేమ వసతి గృహాలున్నాయి. అలాగే మరో 43 గిరిజన సంక్షేమ వసతిగృహాలున్నాయి. ఈ వసతిగృహాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు 2008లో ప్రభుత్వం సంక్షేమబాట కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే జిల్లావ్యాప్తంగానున్న అన్ని వసతి గృహాలను అధికారులు సందర్శించాలి. విద్యార్థులతో పాటు వసతిగృహాల్లోనే నిద్రపోవాలి. వారితో మమేకమై ఆయా వసతి గృహాల్లోని సమస్యలు గుర్తించాలి. గుర్తించిన సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలి. అధికారులు నివేదిక ప్రకారం సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం అవసరమయ్యే నిధులు విడుదల చేస్తుంది.
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదటి మూడేళ్లూ సక్రమంగానే నిర్వహించింది. అయితే గత రెండేళ్లుగా కార్యక్రమం ఊసే ఎత్తలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు ఏడు నెలలైనా ఇప్పటిదాకా సంక్షేమబాట చేపట్టలేదు. దీంతో అన్ని హాస్టళ్లలో ప్రతి ఏటా సమస్యలు పెరిగిపోతున్నాయి. నెల్లిమర్ల మండలంలోని అలుగోలు బీసీ బాలుర వసతి గృహంలో సుమారు 250 మంది విద్యార్థులుండగా కేవలం నాలుగు గదులే ఉన్నాయి. రెండేళ్ల క్రితం నిర్వహించిన సంక్షేమబాటలో ఈ వసతి గృహానికి ప్రభుత్వం అదనపు భవనాన్ని మంజూరుచేసింది. అయితే నిధులు చాలకపోవడంతో ఆ భవనం ఇప్పటికీ పూర్తికాలేదు. అదే సంక్షేమబాట కార్యక్రమం చేపట్టి ఉంటే భవన నిర్మాణం పూర్తయ్యేది. అలాగే ఇక్కడి విద్యార్థుల కోసం నూతన మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ నీటి సదుపాయం లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.
రామతీర్థం ఎస్సీ బాలుర వసతిగృహం భవనం శిథిలమై మూడేళ్ల క్రితమే కూలిపోయింది. అయితే సంక్షేమబాట కార్యక్రమం చేపట్టకపోవడంతో మొన్నటిదాకా నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరుకాలేదు. సంక్షేమబాట కార్యక్రమం చేపట్టకపోవడంతో ఇదే పరిస్థితి దాదాపు జిల్లాలోని అన్ని వసతిగృహాల్లోనూ నెలకొంది. చాలా వసతిగృహాల్లో విద్యార్థులు నిద్రించేందుకు గదులు సైతం లేవు. అలాగే పలు వసతి గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించలేదు. కొన్ని హాస్టళ్లలో నీటి సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా సంక్షేమబాట కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే సమస్యలు ప్రతి ఏటా పేరుకుపోయి ఉండేవి కాదని వసతిగృహాల సంక్షేమాధికారులు సైతం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్షేమబాట కార్యక్రమం చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Advertisement
Advertisement