కలెక్టరేట్ ముట్టడి
కడప ఎడ్యుకేషన్:
సంక్షేమ హాస్టల్స్ మూసివేతను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పేద విద్యార్థులకు చదువును దూరం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రెండేళ్ల పాలనలో బడా కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేయడం తప్ప పేద విద్యార్థులకు చేసిందేమీ లేదన్నారు. హాస్టల్స్‌ని మూసివేసి విద్యార్థులను గురుకులాలకు తరలిస్తున్నారని, అక్కడ పరిస్థితులు హాస్టల్స్ కంటే దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. బి.మఠం, సగిలేరు, ముక్కవారిపల్లె, రామాపురం, సరస్వతీపురాలలో ఉండే గురుకుల భవనాల పరిస్థితి భయానకరమన్నారు. జిల్లాలో 55 హాస్టల్స్ మూతపడటంతో 1500 మంది విద్యార్థులు రోడ్డునపడ్డారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హాస్టల్స్ మూసివేత ఆలోచనను విరమించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జగదీష్, నగర అధ్యక్ష, కార్యదర్శులు కుమార్, ఓబులేసు, జిల్లా ఉపాధ్యక్షుడు డెవిడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి నేతల అరెస్ట్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను బలవంతంగా ఆరెస్టు చేసి వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు జగదీష్, నగర అధ్యక్షుడు ఓబులేసు తదితరులను ఈడ్చుకెళ్లి వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.