► రోడ్డెక్కిన జూనియర్ కళాశాల విద్యార్థులు
పాపన్నపేట(మెదక్) ఇరుకైన గదులు..చాలీచాలని ఫర్నిచర్.. మనిషి పట్టని టాయిలెట్లతో వేగేదెలా అంటూ పాపన్నపేట జూనియర్ కళాశాల విద్యార్థులు మెదక్ బొడ్మట్‌పల్లి రోడ్డుపై శనివారం రాస్తారోకోకు దిగారు. అర్ధగంట పాటు సాగిన ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోగా పోలీసుల రంగప్రవేశంతో ఆందోళన సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే..పాపన్నపేట జూనియర్ కళాశాలలో 450 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే చదువుకోవడానికి మాత్రం నాలుగు గదులే ఉండటంతో ఒక్కోగదిలో100 మందికి పైగా కూర్చోవాల్సి వస్తుంది.పైగా అదే గదిలో ల్యాబ్ అలమారాలు ఉన్నాయి.దీంతో విద్యార్థుల బాధలు అలవి కాకుండా పోయాయి.
కిక్కిరిసిన గదిలో అమ్మాయిలు,అబ్బాయిలు కూర్చోవడం కష్టతరంగా మారింది. ఇదే క్రమంలో గత మూడు రోజుల క్రితం తరగతి గదిలోని అలమారాల కిందికు పాము వచ్చింది. మరోవైపు ఇరుకైన టాయిలెట్లు వినియోగానికి అనుకూలంగా లేవు.రెండేళ్లు గడుస్తున్నా కొత్త బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో చదువులు ఎలా సాగుతాయంటు విద్యార్థులు మెదక్ బొడ్మట్‌పల్లి రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సమస్యలు వెంటనే తీర్చాలంటు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి తరలి వచ్చి ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.