కష్టబడి..! | Students Face Problems Going To School | Sakshi
Sakshi News home page

కష్టబడి..!

Published Sat, Aug 17 2019 10:24 AM | Last Updated on Sat, Aug 17 2019 11:39 AM

Students Face Problems Going To School - Sakshi

టెక్కలి రూరల్‌: రెండు వీధుల తర్వాత పాఠశాల ఉంటేనే చాలా మంది వెళ్లడానికి బద్దకిస్తుంటారు. కానీ ఈ విద్యార్థులు కిలోమీటర్ల ఆవల ఉన్న బడికి వెళ్లేందుకు నిత్యం నరకయాతన పడుతున్నారు. రాళ్లు రప్పలతో నిండి ఉన్న దారిలో నిత్యం పా దయాత్ర చేస్తున్నారు. చదువుకోవాలనే కుతూహలం, విద్య నేర్చుకోవాలనే ఆరాటం వారిని నిత్యం నడిపిస్తోంది. టెక్కలి మండలంలోని ముఖలింగాపురం పంచాయతీ పరిధి బెండకాయలపేట గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు వీరు వస్తుంటారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే మెళియాపుట్టి మండల పరిధి అడ్డివాడ గ్రామానికి చెందిన కొందరు గిరిజన విద్యార్థులు బెండకాయలపేట ప్రాథమిక పాఠశాలకు వస్తుంటారు. రాళ్లు రప్పలతో ఉన్న కొండ మార్గం నుంచి నిత్యం పాఠశాలకు రావడం, తిరిగి సాయంత్రం తమ ఇళ్లకు నడిచివెళ్లడం సాహసంతో కూడుకున్న పని. చిన్నపాటి వర్షం కురిసినా, గట్టిగా ఎండ పెట్టినా వీరి రాక అంత సజావుగా సాగదు. అయినా అంత కష్టం పడుతూనే బడికి వస్తున్నారు.

ఏటా ఈ గ్రామం నుంచి విద్యార్థులు చదువుకునేందుకు ఈ పాఠశాలకు రావడం పరిపాటి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెండకాయలపేట గ్రామంలోనున్న పాఠశాలలో సుమారు 24 మంది చదువుతున్నారు. పరిసర గ్రామాలైన లంకపాడు, ముఖలింగాపురం, చిరుతునాపల్లి తదితర గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు. వీరు ఇంత కష్టపడి పాఠశాలకు వస్తుంటే.. వారం రోజులుగా పాఠశాల మూతబడి ఉంది. ఇక్కడ టీచర్‌ సెలవు పెడితే బడికి కూడా సెలవే. గతంలో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిన కారణంగా నూతనంగా ఇక్కడ ఉపాధ్యాయులను నియమించకపోవడంతో పాఠశాల మూతబడింది. అయితే అడ్డివాడ గ్రామం నుంచి వచ్చే విద్యార్థులకు పాఠ«శాల తెరిచి ఉన్నదీ లేనిదీ తెలీకపోవడంతో రాకపోకలు సాగించక లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖాధికారులు స్పందించి కొండపైన పాఠశాలను ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

నిత్యం నడిచే వెళ్తున్నాం..
కొండ దిగువన మా పాఠశాల ఉండడంతో నిత్యం కొండపై నుంచి కిందకు నడిచి వెళ్తున్నాం. రోజూ ఉదయం కొండ దిగి పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం కొండ ఎక్కి గ్రామానికి వెళ్తుంటాం. గత కొద్దిరోజులుగా పాఠశాలకు ఉపాధ్యాయులు రాకపోవడంతో రోజూ వెళ్లి నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది.
– ఒంటిళ్ల కుమారస్వామి, 4వ తరగతి విద్యార్థి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement